కడప కార్పొరేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి ప్రజల బాగోగులు చూడాలన్న తపన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేస్తూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష ఎకరాలలో రాజధాని ఎక్కడా నిర్మించలేదని రాజధాని పేరిట అక్రమాలు, అన్యాయాలకు పాల్పడేందుకే అధికారపార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు వంద వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఐదు సంతకాలు చేశారన్నారు. ఆరునెలలు కావొస్తున్నా వాటిలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు.
రాష్ట్రంలో 1.29 కోట్ల రైతు ఖాతాలు ఉంటే అందులో లక్షలోపు రుణం తీసుకొన్న ఖాతాలు 1.22 కోట్లు ఉన్నాయన్నారు. వీటన్నింటికీ రుణం మాఫీ చేయాలంటే రూ.88 వేల కోట్లు అవసరమైతే ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం ఐదువేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించిందన్నారు. దీన్నిబట్టే ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక అనేకమంది ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. వెరిఫికేషన్ పేరుతో 10 లక్ష ల పింఛన్లు, 23 లక్షల రేషన్‌కార్డులను తొలగించారని ఆరోపించారు. నేను మారానని చంద్రబాబు పదే పదే చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను, డ్వాక్రామహిళలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లే కపోయినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉందన్నారు.
ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 5వ తేదీ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు హామీలు నమ్మి దగాపడ్డ రైతులు, మహిళలు, పింఛన్‌దారులంతా భారీగా ధర్నాకు తరలివచ్చి ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాసీమ బాబు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు నిత్యానందరెడ్డి, పులి సునీల్‌కుమార్, ఎస్‌ఎండీ షఫీ, చల్లా రాజశేఖర్, ఖాజారహమతుల్లా, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిలదీద్దాం
Published Fri, Dec 5 2014 3:43 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement