సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి బంధువయిన అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అండదండలతో ఏకంగా మూడు పోస్టుల్లో కొనసాగుతున్న సంబంధిత అధికారిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఓ ఐఎఫ్‌ఎస్ అధికారికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం సంబంధిత విభాగాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళితే..గుంటూరులోని రాష్ట్ర అటవీ దళాల అధిపతి (హెచ్‌వోఎఫ్‌ఎఫ్) కార్యాలయంలో ఫారెస్ట్ యుటిలైజేషన్ అధికారి (ఎఫ్‌యూవో)గా పనిచేస్తున్న బీవీఏ కృష్ణమూర్తి అదనంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్‌కాస్ట్) సభ్య కార్యదర్శిగానూ, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఏపీఎన్‌జీసీ) డైరెక్టర్ పోస్టుల్లో ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముడుపుల కోసం కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని, ఒకే పర్యటనకు వేర్వేరు విభాగాల నుంచి టీఏ, డీఏ బిల్లులు పొందారని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ అధికారిపై తీవ్ర విమర్శలున్నాయి. సదరు అధికారిపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఇలా ఆరోపణలున్న అధికారిని వాస్తవంగా అయితే ఫోకల్ పోస్టులో ఉంచరాదు. లూప్‌లైన్‌లో పెట్టాలి. కానీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏకంగా మూడు పోస్టుల్లో కొనసాగుతుండడం గమనార్హం.
లంచం తీసుకుని ఉద్యోగాలిచ్చారు..
ఆరుగురికి ఔట్‌సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్కరి నుంచి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకూ వసూలు చేశారని ప్రభుత్వానికి ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే హైదరాబాద్ నుంచి అమరావతికి బదిలీ అయిన సందర్భంగా రెగ్యులర్ పోస్టు అయిన ఎఫ్‌యూవో నుంచి ట్రాన్స్‌ఫర్ ట్రావెలింగ్ అలవెన్సు (టీటీఏ) తీసుకోవాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అప్‌కాస్ట్ నుంచి డ్రా చేశారు. ఇక్కడైతే ఆయనే హెచ్‌వోడీ అయినందున నచ్చినంత తీసుకోవచ్చనే భావంతోనే ఇలా చేశారని ఆరోపణలొస్తున్నాయి. టెండర్లు లేకుండానే అప్‌కాస్ట్‌లో కావాల్సిన వారికి పనులు అప్పగించి నిబంధనలకు విరుద్ధంగా చెక్కులు ఇస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో తాము ఇరుక్కుపోతామంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఆయనను ఇన్‌చార్జి పోస్టు నుంచి తప్పించకపోతే మూకుమ్మడిగా సెలవుపై వెళ్లాల్సి ఉంటుందని ఉన్నతాధికారులతోపాటు మంత్రికీ మొరపెట్టుకున్నారు.
రూ.6 కోట్ల నిధులు మురిగి పోవాల్సిందేనా?
రాజమండ్రిలో రీజనల్ సైన్స్ సెంటర్‌కు కేంద్రం ఏడాది క్రితం రూ.6 కోట్లు మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకూ ప్రహరీ కూడా నిర్మించలేదు. ఈ నిధులు మురిగిపోతాయని ఆ సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయం తెలియడంతో ఆ అధికారిని తక్షణమే అప్‌కాస్ట్ ఇన్‌చార్జి పోస్టు నుంచి తొలగించాలంటూ ఒక ఎంపీ అటవీశాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కాగా బీవీఏ కృష్ణమూర్తిపై వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా భారీ అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం వాస్తవమేనని..అందుకే విచారణకు ఆదేశించామన్నారు. ఈ అభియోగాలపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఐఎఫ్‌ఎస్ అధికారి శాంతిప్రియ పాండేని ఆదేశించామని చెప్పారు.
ఇన్‌చార్జి పోస్టు నుంచి తప్పించాలి
కృష్ణమూర్తిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినందున నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి, వాస్తవాలు బయటకు రావడానికి వీలుగా ఆయనను అప్‌కాస్ట్ సభ్యకార్యదర్శి, ఏపీఎన్‌జీసీ డైరెక్టర్ అనే ఇన్‌చార్జి పోస్టుల నుంచి తక్షణమే తప్పించాలని ఆయా సంస్థల ఉద్యోగులు కోరుతున్నారు. ఆయన్ని పోస్టుల నుంచి తప్పించి విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment