కథ: ఫిబ్రవరి 14.. ప్రేమా.. నీ విలువెంత..? | Vamsi Krishna Anuvada Katha In Funday Magazine | Sakshi
Sakshi News home page

కథ: ఫిబ్రవరి 14.. ప్రేమా.. నీ విలువెంత..?

Published Sun, Oct 17 2021 11:07 AM | Last Updated on Sun, Oct 17 2021 12:01 PM

Vamsi Krishna Anuvada Katha In Funday Magazine - Sakshi

అదే ఘోరమైన తప్పు ఇవాళ మళ్ళీ చేశాను. 
అదేదో నేను కావాలని చేయలేదు. ఎవరో నా మట్టిరంగు శరీరంలో ఉండి, ఆ క్షణంలో నా సమస్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుని, వాళ్ళే నా రక్షకులైనట్టు, నా జీవితాన్ని చైతన్యవంతం చేసే ఉత్ప్రేరకాలు అయినట్టు, నా ఆత్మను వెలిగించే దైవత్వం ఏదో వాళ్లలో నిండి ఉన్నట్టు ఆ క్షణంలో కళ్ళు మూసుకునిపోయి చేయడం వలన ఇప్పుడు ఒంటరిగా మిగిలాను. ఆ తప్పిదం వలన నా కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోయాయి. నేనొంటరిగా అలా పక్కమీద వాలిపోయాను. ఈ బాధను ఎవరితో ఎలా పంచుకోవాలి? ప్రేమలో నా అపజయాలను, నా ఓటమిని, నాతో  దీర్ఘకాలం ప్రయాణం చేయలేని నా స్నేహితులను, నేను ఫ్రిజిడిటీతో బాధపడుతున్నాను అని భావించే నేను ఇష్టపడిన మగవాళ్ళను, వాళ్లు నన్ను ఎక్సయిట్‌ చేయలేక పడిన నిరుత్సాహాన్నీ ఎవరితో ఎలా పంచుకోను? ఈ బాధ.. కాలం గడుస్తున్న కొద్దీ నన్ను అలసటకు గురిచేయసాగింది. 


నిస్సందేహంగా పరిణతి చెందిన పురుషులు, మనం నివసిస్తున్న సమాజంలో తమదైన ముద్ర వేయగల పురుషులంటే నా కిష్టం అని చెప్పగలను. చాలామంది చెప్తారు.. ప్రేమకు హద్దులు లేవని. నేనూ అలాగే అంటాను. ప్రేమకు హద్దుల్లేవు అని. నన్ను నన్నుగా ప్రేమించే పురుషుడు పెళ్లయిన వాడా? పెళ్లికాని వాడా? ధనికుడా? డబ్బులేని వాడా? సామాజిక స్థాయిలో ఉన్నత, నిమ్న అంశాలు ఇవన్నీ నాకు పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కానేకావు. ఇంతా చెప్పాక నన్ను  ప్రేమించే వాడు నాకు ఎంత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తానో మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. అతడికి నా ప్రేమను కూడా అంతే ప్రత్యేకంగా మూటకట్టి మరీ ఇస్తాను. 

మేమిక్కడికి, ఈ ఫిబ్రవరి 14 సాయంత్రం పూట  ఈ పండుగ వాతావరణాన్ని సంపూర్తిగా హృదయంలో నింపుకోవడానికి వచ్చాము. ఈ పూట మా ప్రేమ ప్రయాణంలో ఏ అవరోధమూ, ఆటంకమూ లేకుండా సాయంత్రమంతా గడపడానికి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాము. ఈ మూడు నక్షత్రాల హోటల్‌ టెర్రస్‌ మీద కూర్చుని చూస్తుంటే ఈ ప్రపంచం ఎంత బావున్నది? కొన్ని వేల నియాన్‌ దీపాలు వెదజల్లుతున్న కాంతిలో చీకటి రాత్రి అన్ని వైపుల నుండీ పువ్వులు వెదజల్లుతున్న పరిమళాలతో సౌందర్య భరితంగా కనిపిస్తున్నది. మనోల్లాసకరమైన మంద్ర సంగీతానికి అంతే  మంద్రంగా నాట్యం చేస్తున్న యువతీ యువకులు. ప్రతి యువతీ ఒక రాజకుమారిలాగా, ప్రతి యువకుడూ ఒక రాకుమారుడిలాగా కనిపిస్తూ వాతావరణంలో ఒక ప్రేమ రాజసాన్ని నింపుతున్నారు. బయట వాలంటైన్‌ డే సెలబ్రేషన్స్‌ జరుపుకోవడానికి కొన్ని సమూహాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వుంది. ప్రేమికులు కనిపిస్తే చాలు బలవంతంగా తీసుకుని వెళ్లి తాళి  కట్టించే సమూహాల నుండి దూరంగా, ఏ ఆటంకమూ లేని ఈ ప్రదేశంలో అతడితో నా బంధం మొదలుకావడానికి ఇదొక అద్భుతమైన, అందమైన సమయం. 

దేశపు తూర్పు ప్రాంతంలో ఇది వసంత సమయం. అవును నా జీవితంలో కూడా ఇది వసంత సమయమే. అతడు చాలా ఫార్మల్‌ సూట్‌లో ఎర్ర టై కట్టుకుని, కోట్‌ ముందు గుండీలు పెట్టుకునే బొత్తాంలో ఎర్రగులాబీ తురుముకుని ఒక అరిస్టోక్రాట్‌లాగా వచ్చాడు. తన జీవితంలో దుష్ట గ్రహాలు కలుగచేసే దుష్ట ప్రభావాలను తొలగించడానికి మూడువేళ్ళకు మూడు రంగురాళ్ల ఉంగరాలు ధరించి వచ్చాడు. 

నన్ను చూడగానే అతడి మొహంలో ఒక చిన్న ఆశాభంగం కనిపించింది. బహుశా నేను ప్రత్యేకంగా తన కోసమే తయారై ట్రెండీగా వస్తానని ఊహించి ఉంటాడు. అతడలా ఎందుకు ఊహించాడో నాకు తెలియదు.. కానీ అలంకరణ విషయంలో నేను చాలా పొదుపు. మా అమ్మ లాగా, ఇతర ఆడవాళ్ళలాగా నేను గంటల తరబడి అద్దం ముందు గడపను. ఈ క్షణాన నేను ఎర్రగులాబీ రంగు చీర కట్టుకుని వున్నాను. మేడలో చిన్న లాకెట్‌. ఎప్పటిలాగే జుట్టు లూజుగా వదిలివేశా. కొంచెంగా నాకు ఇష్టమైన ఫ్రెంచ్‌ పెర్ఫ్యూమ్‌ అద్దుకున్నా . చెవులకు చిన్న జూకాలు.  ప్రత్యేకమైన సందర్భాల కోసం ప్రత్యేకంగా తయారవడం కన్నా ఇలా సింపుల్‌గా ఉండటమే నా కిష్టం. నా ప్రేమను చాలా డాంబికంగా ప్రదర్శించే శక్తిని ఆ సమయంలో నాలో వున్నదో లేదో నాకు తెలియదు. 

‘నువ్వు చాలా అందంగా, ప్రత్యేకంగా, ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత ఆకర్షణీయమైన స్త్రీలా కనిపిస్తున్నావు. కానీ ఎందుకింత సింపుల్‌గా డ్రెస్‌ చేసుకున్నావు?’ మెరిసే కళ్ళతో అతడు అడిగిన ప్రశ్నకు నేను నవ్వి ఊరుకున్నాను.

మా టేబుల్‌కి కాస్త దూరంలో మరొక టేబుల్‌ దగ్గర ఒక జంట తమ ఇద్దరు పిల్లలతో కూర్చుని వుంది. ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరు.. మరొకరికి ఎనిమిదేళ్ళు వుంటాయేమో! పిల్లలు ఇద్దరూ ఫోర్క్‌లు, కత్తులతో కుస్తీ పడుతున్నారు. అతడు తరచూ ఆ పిల్లల వంక చూస్తూ నా వైపు చూస్తున్నాడు. మిగిలిన జీవితం తన వెనుక మిగల్చబోయే ఒకానొక జ్ఞాపకం గురించి అతడు పరధ్యానంలో పడి పోయాడేమో. అతడి ఆలోచన గురించి ఇప్పుడు నేను చెప్పడం కాస్త అసంబద్ధంగా ఉంటుంది. ఈ క్షణం నాది. ఈ అద్భుతమైన క్షణం నాది. ఈ పారవశ్యం నాది. ఈ క్షణం మోహంతో మొదలై ఆత్మీయతగా పరిణతి చెంది, గౌరవంగా కుదురుకుని, అనుబంధంగా పండి కలకాలం వీడలేని బంధంగా మారిపోయే పరిణామశీలతకు ఇది నాంది. అతడు లేని జీవితం అలసి సొలసి విశ్రమించిన ఎడారి! 

నేను ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాదీ పర్సులో నుండి ఒక డార్క్‌ చాకోలెట్‌ తీసి అతడికి ఇచ్చాను. ఆ చాకోలెట్‌ నేను ఢిల్లీలో కొని ఈ రోజు కోసం ఫ్రిజ్‌లో దాచి వుంచాను. ఆ పింక్‌ కలర్‌ ర్యాపర్‌ను నేను తాకనైనా తాకకుండా అతడికోసమే దాచి వుంచాను. ఎవరు చెప్పారో సరిగ్గా గుర్తు లేదు కానీ జపనీస్‌  తమకు ఇష్టమైన పురుషులకు ఈ ప్రత్యేకమైన వాలంటైన్స్‌ డే రోజున చాకోలెట్స్‌ బహుమతిగా ఇస్తారట. సరిగ్గా నెల రోజుల తరువాత మార్చ్‌ 14 నాడు పురుషులు తమ స్త్రీలకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారట. 

అతడు ఆ పింక్‌ కలర్‌ ర్యాపర్‌ను జాగ్రత్తగా సున్నితంగా విప్పి ఒక చిన్న బిట్‌ మునిపంటితో కొరికి ‘రుచికరం’ అన్నాడు. వెంటనే మళ్ళీ ‘ నువ్వు నా కోసం ప్రత్యేకంగా చేదుగా, వగరుగా వుండే ఈ చాకోలెట్‌ కొన్నావు కదూ! నువ్వు బయటకి చాలా గట్టిగా  సాధించలేని శిఖరంలా కనిపిస్తావు కానీ లోపల చాలా సున్నితం’ అన్నాడు. 

మేము ఒకరి చేతిలో మరొకరం చేతిని బంధించి ఉంచాము. మా చేతి వేళ్ళు ఒకదానితో మరొకటి పెనవేసుకున్నాయి. చుట్టూ జనంతో ఉత్సహంగా , ఉల్లాసంగా , సంతోష  సంబరాలతో  ఉద్విగ్నంగా వున్న ఆ వాతావరణంలో మాలో ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి దారిదొరకలేదు మాకు.

 అతడు మెల్లగా ‘అందుకే మనకు కాస్త ప్రయివసీ కావాలి అన్నాను. కేవలం నువ్వు, నేను మాత్రమే ఉండగలిగే చోటు. నీ సాహచర్యాన్ని నేను మాత్రమే అనుభూతించగలిగే చోటు. ఇక్కడ ఇలా మనలని ఎవరైనా చూస్తే జరిగే పరిణామాలు నేనూహించగలను. నా బాధ నా గురించి కాదు. నీ గురించే! నీ రెప్యుటేషన్‌ గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. 

నన్ను మాత్రం గాలి అలలలో తేలి వస్తున్న  బ్రయాన్‌ ఆడమ్‌  ‘Everything I do, I do it for you’ పాట పూర్తిగా లీనం చేసుకున్నది. 

అతడికి అర్థం అయ్యేట్లు నేనెలా చెప్పాలి.. ‘కొండల మీద నుండి దూకే ఒక జలపాతాన్ని నేను’ అని! శతసహస్ర రేకులుగా విచ్చుకున్న ప్రేమ కుసుమం నుండి రెక్కలన్నీ ఒక్కసారిగా రాల్చేస్తే ప్రేమను పొందడమూ, అపురూపంగా జ్ఞాపకాల వెన్నెల భరిణలో దాచుకోవడమూ, అప్పడప్పుడూ ఆ భరిణ  తీసి ఆ మధుర, మంజుల ముద్ర శ్వాసను ఆఘ్రాణించడమూ కష్టమని! అతడిది నిర్మల హృదయమే. సమాజంలో వివిధ స్థాయిలలో ఉన్న  రకరకాల వ్యక్తులతో ఉండే  వైయక్తికమైన స్నేహసౌరభాలను అతడు అనుభూతించగలడు.

ఈ ప్రత్యేకమైన సందర్భం సెలబ్రేట్‌ చేసుకోవడానికి అతడు నా కోసం ఒక చిన్న ఎర్ర గులాబీని కూడా తీసుకుని రాలేదు. ప్రేమికుల రోజున ఎర్ర గులాబీ ఇచ్చుకోవడం సంప్రదాయం. అతడా సంప్రదాయాన్ని  పాటించలేదు.  ఈ వాతావరణాన్ని మత్తిల్ల చేయడానికి ఒక పెర్ఫ్యూమ్‌నైనా  అతడు కానుకగా ఇవ్వలేదు. మా మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ బంధానికి భవిష్యత్తు లేదని అతడికి తెలుసేమో. అయినా మేమిద్దరమూ ప్రేమికులరోజు గురించి చాలా అభిప్రాయాలను, ఉటంకింపులను పంచుకున్నాము. ప్రేమ, విధేయత రెండూ ఒకటేనని.. ప్రేమ ఒక రక్షణ కవచంలా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇద్దరమూ అంగీకరించాము. చాలా రోజుల తరువాత మా ఇద్దరికీ ఇలా కలిసే అవకాశం దొరికింది. నేను మెల్లగా ఒక సాధారణ స్త్రీగా మారిపోతున్నాను ఈ మత్తిల్లిన వాతావరణంలో. 

రాత్రి మెల్లగా చిక్కబడుతున్నది. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కి మూడు నక్షత్రాల హోటల్‌ సిద్ధం అవుతున్నది. అతడు తన కోటు బటన్‌ విప్పి లోపల దాచిన ఒక సన్నటి పాకెట్‌ బయటకు తీశాడు. అది గిఫ్ట్‌ ర్యాపర్‌తో చుట్టిలేకపోవడంతో నేను చాలా తేలికగా పోల్చుకోగలిగాను. 

అదొక వేణువు. ఎక్కడో అరణ్యగర్భంలోని వెదురు చెట్టు నుండి లేలేత వెదురుముక్కను కోసీ, నదీ తీరంలోని గులక రాళ్ళతో పదును తేల్చి, నీళ్లలో నానబెట్టి సున్నితంగా చేసి, ఓ అద్భుతమైన కళాకారుడు తన ఆత్మనంతా ఆ వెదురులోకి ఒంపి, నిలువెల్లా గాయాలతో శ్వాస నింపి, ప్రతి అద్భుతమైన భావానికి అపురూపమైన ప్రాణ శబ్దాన్ని ఇవ్వగల వేణువు. 

ఆకుపచ్చదనం పండితే  మధురమై, ఆ తీవ్ర మాధుర్యంలో మనలని మనం కోల్పోతామట. అది సాధ్యమేనా? నా ఎదురుగా ఉన్న అతడు, అత్యంత నాగరీకమైన దుస్తులు ధరించి లోలోపల అంత దైవత్వాన్ని కలిగివున్నాడా? బహుశా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆ వేణువు మీద అతడు పాడే పాటలో నేను కరిగి, నీరై, నా లోని నిశ్చలత్వం పారిపొయ్యెలా చేసే రసవిద్య అతడిలో ఉన్నదా? ఒకానొక మార్మికమైన గూడు ఏదో  నా చుట్టూ అల్లుకుంటున్న భావన. నా కళ్ళు కృతజ్ఞత తో చెమర్చాయి. 

అతడి వెచ్చనైన గొంతు మెల్లగా వినిపిస్తున్నది.. ‘నీ స్వచ్చమైన, సుందరమైన అభిరుచి నాకు తెలిసీ ఇలాంటి గిఫ్ట్‌ తీసుకుని వచ్చానని నవ్వుతావేమోనని  మొదట నాకు చాలా భయమేసింది. నిన్ను దేనితోనూ కొనలేనని నువ్వన్నమాట నాకు గుర్తున్నది. నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రసవిద్య తెలిసి  ఉండాలి. గతనెల నేను ఇన్‌స్పెక్షన్‌ పని మీద జార్ఖండ్‌ వెళ్ళాను. ఆ రాత్రి.. కొద్ది దూరం నుండి వినిపిస్తున్న వేణుగానాన్ని విన్నాను. అలాంటి వేణునాదాన్ని ఇంతకుముందెప్పుడూ నేను విని ఉండలేదు. ఎంత మధురమైన నాదం అంటే బహుశా ఆ కోయిల గానానికి కూడా అంత మాధుర్యం ఉండదేమో! అప్పుడే అనిపించింది .. ఆ అద్భుతమైన వేణువునే ఈ రోజు నేను నీకు ఇవ్వగల అపురూపమైన కానుక అని. ఆ మరునాడే మావాళ్లను పిలిచి ఆ వేణువు ఊదే వ్యక్తిని తీసుకుని రమ్మని చెప్పాను. అతికష్టం మీద వాళ్లు అతడిని పట్టుకున్నారు. 

అతడొక చిన్నపిల్లాడు. పేదరికం వలన తన వయసుకు రెండింతల పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అన్నం తిని ఎన్నిరోజులు అయిందో పొట్ట వీపుకు అతుక్కొని ఉంది. ఆ పిల్లాడి తల్లి తండ్రులు చనిపోయారట. ఆ అబ్బాయి ఈ భూమి మీద బతికి ఉండటానికి కావల్సిన ఒక్క కారణం కూడా లేదు. నేను ఆ పిల్లాడికి రెండు వందల రూపాయలు ఇచ్చి ముందు కడుపు నిండా అన్నం తినమన్నాను. మందు తాగితే అస్సలు ఊరుకోను అని చెప్పాను. ఎందుకంటే గిరిజనులు చేతిలో డబ్బు పడగానే మద్యం షాప్‌కే పరుగెడతారు. ఆ పిల్లాడు  మద్యం షాప్‌కి వెళ్లకుండా ఒక కన్ను వేసి ఉంచమని మా వాళ్లతో చెప్పాను. అప్పుడు చూశాను ఆ పిల్లాడి నడుముకు వేళ్ళాడుతున్న వేణువును. ‘నాకు ఆ వేణువు అమ్ముతావా?’ అని అడిగాను. 

వెంటనే ఆ పిల్లాడు వేణువును దాచేసుకున్నాడు. నేనా పిల్లాడితో ‘వేణువు ఇస్తే మరొక రెండువందలు ఇస్తాను’ అన్నాను. వాడు ఒప్పుకోలేదు. చివరకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాను. వాడికి నా ఆఫర్‌ను కాదనే శక్తి లేదు. మార్కెట్‌లో యాభై రూపాయలు కూడా చేయని వేణువుకు వెయ్యి రూపాయలు. కానీ బహుమతిగా ఇచ్చే వేణుగానం విలువ వాడికి ఎలా తెలుస్తుంది? ఆ వేణువులాంటి దానివే నువ్వు కూడా. నువ్వూ అమూల్యం. ఒక అమూల్యమైన నీకు, నీలాంటి అమూల్యమైన వేణువును మించిన బహుమతి కచ్చితంగా సరిపోతుంది’ 

అతడి మాటలు నేను ఎంతోసేపు వినలేక పోయాను. అకస్మాత్తుగా నా ప్రపంచం అంతా ఒక విషాదంతో నిండిపోయింది. ఆ వేణువు నా హృదయంలో ఒక దుఃఖ గీతం పాడసాగింది. ఎప్పటిలాగే నా లోలోపలి ఆత్మ మేలుకున్నది. ప్రేమ గురించిన నా భౌతికమైన వాంఛలన్నీ ఒక్కసారిగా కొట్టుకునిపోయాయి. ఆ వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? నేను ప్రేమించిన ఈ మనిషికి ప్రేమ విలువ తెలుసా? ప్రేమ విలువ తెలియడానికి, ప్రేమ విలువ తెలియకపోవడానికి ఒక మనిషికి కావలసినది ఏమిటి? డబ్బేనా? ఇతడికి డబ్బు వుంది కనుక  ప్రేమ విలువ తెలుస్తుందా? డబ్బు లేదు కనుక వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? అంటే డబ్బు వున్నది  కనుక అతడు ఏదైనా కొనగలడా? 

నేను ఒక ఎనిగ్మాటిక్‌ పరిమళంలోకి ప్రయాణిస్తున్నాను. మామిడిపళ్ళ మాధుర్యంలోకి, కొండలమీద నుండి దూకే చిన్న జలపాతంలోకి  ప్రయాణిస్తున్నాను. నా స్పృహ, అస్తిత్వం ఒక గొప్ప వరదలో కొట్టుకుని పోతున్నదా? నా శరీరం మొత్తం నిరసనతో వణికిపోతున్నది. 
నేను మరొక్క మాట కూడా మాట్లాడలేక పోయాను. త్వరగా డిన్నర్‌ ముగించి త్వరగా వెళ్ళిపోదామని చెప్పాను. ఎక్కడో ఏదో జరగకూడనిది జరిగింది అన్న విషయాన్ని అతడు పసిగట్టినట్టున్నాడు. 

నేను మూర్ఖురాలినా? భౌతికమైన ఆనందాలు, సంతోషాలు పొందే క్రమంలో అవన్నీ చాలా అల్పమైన విషయాలని తెలియచెప్పే ఒక హింసాత్మక డెమి ఉమన్‌ నేనా? నేనెవరిని? అతడు ఎంచుకున్న మనిషినా? అతడి మనిషినా?
బంధాల భవిష్యత్తును ముందుగానే గుర్తించగలిగితే మనమెవరమూ బహుశా బంధాలలోకి ఎప్పటికీ స్వయంగా వెళ్ళమేమో! 

ఒరియా మూలం : మోనాలిసా జెనా
తెలుగు సేత :  వంశీకృష్ణ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement