కథ రాయడం చాలా కష్టం... | Writer Peddibhotla Subbaramaiah Is Passes Away | Sakshi
Sakshi News home page

కథ రాయడం చాలా కష్టం...

Published Sat, May 19 2018 2:19 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Writer Peddibhotla Subbaramaiah Is Passes Away - Sakshi

1938లో గుంటూరులో పుట్టిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య సుమారు ఏడు దశాబ్దాలు విజయవాడలోనే ఉన్నారు. గుండెను తడి చేసే ‘ఇంగువ’ వంటి అనేక కథలు రచించారు. అందులో కథలకు బహుమతులు పొందారు. ఆ కథలకు అవార్డులు అందుకున్నారు, సన్మానాలు పొందారు. విజయవాడ లయోలా కళా శాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. తాను చేసిన సాహితీ సేవకు అవార్డులు అందుకున్న పెద్ది భొట్ల తన పేరున కూడా కొందరికి అవార్డులు ఇవ్వా లనుకున్నారు. 2012 నుంచి ప్రతి డిసెంబరు 16వ తేదీన తన జన్మదినం సందర్భంగా తన పేరు మీదు గానే అవార్డులు ప్రదానం చేయడం ప్రారంభించారు. 80 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో మే 18 శుక్రవారం కన్నుమూశారు. రెండేళ్ల క్రితం తన జన్మదినం సంద ర్భంగా ఆయన తన చివరి ఇంటర్వ్యూ సాక్షి పాఠ కుల కోసం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...

చిన్నతనంలో స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే స్కూల్‌ పుస్తకాలతో పాటు, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు బాగా చదువుకున్నాను. పెద్దయిన తర్వాత సామాజిక స్పృహ ఉన్న రచనలు విరివిగా చదవ సాగాను. ఒంగోలులో పెద్ద లైబ్రరీ ఉండేది. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది. అక్కడ కొవ్వలి, జంపన, శరత్‌ల నవలలు బాగా చదివేవా డిని. ముఖ్యంగా కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారా యణగారి ‘వేయి పడగలు’ విపరీతంగా చదివాను.

విశ్వనాథవారితో అనుబంధం 
విజయవాడ మాచవరంలో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కాలేజీతో బిఏ చదివాను. కాలేజీ... తాటాకులు, తాటి బద్దలతో ఉండేది. అందువల్ల వాన పడితే రోడ్ల మీద షికారు. అప్పట్లో గొప్ప గొప్ప వాళ్లతో ప్రత్యేక పాఠాలు చెప్పించేవారు కళాశాల యాజమాన్యం. అలా చేయడం కాలేజీకి ఒక ఘనత. ఇది 1955 నాటి మాట. స్పెషల్‌ తెలుగులో నలుగురు మాత్రమే ఉన్నాం. విశ్వనాథ సత్యనారాయణ మా తెలుగు మాస్టారు. ఒకనాడు ఆయనను పాఠం చెప్పమని అడిగితే, ‘‘ఈ రోజు అన్నం తినలేదురా, నీరసంగా ఉంది. ఇంటికి రండి. మధ్యాహ్నం చెప్తాను’’ అన్నారు. విశ్వనాథ వారి ఇంటికి వెళ్తున్నామంటే, మహానుభావుడికి పాదాభివందనం చేయబోతున్నా నన్న జలదరింపు కలిగింది. ఆయన ఇంటికి వెళ్లాం. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడు వరకు ఆయన పాఠం చెప్పారు. పాఠం అంటే కేవలం పాఠం కాదు, అనేక ఇతర అంశాలు, సంస్కారాన్ని జోడించి పాఠం బోధించారు. ఆయనతో కాలం ఇట్టే గడిచిపోయింది. నా చదువు పూర్తయ్యాక, విజయ వాడ లయోలా కళాశాలలో పోస్ట్‌ ఉందని, వెళ్లమని స్వయంగా విశ్వనాథ వారే పంపారు. అప్పట్లో లయోలా కాలేజీ ఋషివాటికలా ఉండేది. నేను 1996లో అదే కళాశాలలో రిటైరయ్యాను. 

పద్యం వద్దన్నారు 
నేను చదువుకునే రోజుల్లో మార్కండేయశర్మ అనే మాస్టారు ‘నువ్వు రచయితవు అవుతావు’ అన్నారు.  ఒకసారి ఆయన భారతం విరా టపర్వం చదవమని నాకు ఇచ్చారు. ఆదిపర్వం ఇవ్వ కుండా విరాటపర్వం ఇచ్చారేమిటి అన్నాను. అందుకు ఆయన ‘ఓరి వెర్రివాడా! భారతం పఠనం విరాటపర్వంతో ప్రారంభించాలి’ అన్నారు. ‘భీష్మ ద్రోణ... పద్యం కనిపించింది. నేను చదవలేకపో యాను. అదే మాట ఆయనతో అన్నాను. దానికి సమాధానంగా ఆయన, ‘ఏవీ వాటంతట అవి అర్థం కావు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, తెలుసుకోవాలి’ అన్నారు. అప్పటి నుంచి ప్రతి అంశాన్నీ పట్టుదలతో నేర్చుకోవడం ప్రారంభిం చాను. అప్పట్లో గురువుల తర్ఫీదు అలా ఉండేది. ఆ రోజుల్లోనే ఒకసారి కొన్ని పద్యాలు రాసి, విశ్వనాథ వారికి చూపించాను. అప్పటికే ‘నీళ్లు’ కథ రాసి ఆయన ప్రశంసలు పొందాను. నా పద్యాలు విన గానే, ‘ఇంకెప్పుడైనా పద్యాలు రాసావంటే తంతా నురా’ అన్నారాయన. మళ్లీ పద్యం జోలికి పోలేదు. 

నేను చదువుకునే రోజుల్లో నాకు స్కాలర్‌ షిప్‌ వచ్చింది. కానీ మా నాన్నగారు వద్దన్నారు. చేతిలోకి వచ్చిన మహా నిధి పోయినట్లు అనిపించింది. అప్పుడు వేరే అబ్బాయికి ఇచ్చారు. ఏడుపొచ్చేసింది. ఇంటికి వచ్చి ఏడ్చాను. ‘‘మా నాన్న నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని, ‘స్కాలర్‌ షిప్‌ పేద పిల్లల కోసం’ అని చెప్పారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుండెను తాకుతూ ఉంటుంది. 

చదివితే రాయగలుగుతాం 
పెద్దవాళ్ల రచ నలు బాగా చదివిన తరవాత, అసలు నేను ఎందుకు కథ రాయకూడదు అనుకున్నాను. కేవలం రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించాలనుకున్నాను. తలుపులన్నీ మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావని, అనేక మంది జీవితాలను బాగా పరిశీలించగలిగితే, మంచి మంచి కథలు వస్తాయని తెలుసుకున్నాను. అలా కథలు రాయడం మొదలుపెట్టాను. అలా భారతిలో మొత్తం 14 కథలు, 2 నవలలు ప్రచురితమయ్యాయి.

అమరావతి పేరుతో ప్రకృతి ధ్వంసం 
‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతాయి. అయితే దాన్ని పట్టించుకోవాలి. దాని గురించి ఆలోచించాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి ఒక మాను అవుతుంది. అప్ర యత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. కథ  జీవితంలో నుంచి వస్తుంది. కథ రాయడం మిగిలిన అన్ని ప్రక్రియల కంటె చాలా కష్టం. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. ఉత్తమ రచయితల జన్మ ధన్యం. ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. ముఖ్యంగా పచ్చటిపొలాలు ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం రాజధాని కోసం తీసేసుకుంది. అందు వల్ల తాజాగా ఉండే కూరలు, పండ్లు, పూలు మాకు దూరమైపోయాయి. అటువైపుగా వెళ్లాలంటేనే చాలా బాధ వేస్తోంది. ఈ ప్రాంతానికి రైతు దూరమై పోయాడు. అక్కడకు వెళ్లి పోరాటం చేయాలను కుంటున్నాను. ఎంతటి అందమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో భూమాత పచ్చటి పట్టుచీర కట్టుకునేది. పుడమి తల్లి ఎంత బాధపడుతోందో అనిపిస్తుంది. మనిషికి భూమితో సంబంధం తెగిపోయింది. పెద్ద పెద్ద భవంతులు వచ్చి కూర్చున్నాయి. అందుకే అక్కడ నుంచి కథలు రావట్లేదు. 

ఈ ప్రాంతాల నుంచే కథలు... 
రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచిమంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతో షం... భూమి ఎండితే దుఃఖం... వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. ప్రస్తుతం నవలలు రావట్లేదు. నవలల పేరుతో చెత్త రాకుండా, మేలు జరిగింది. ఇది మంచి పరిణామం. మంచి కథ చదివితే జీవిత శకలం అనుభవానికి వచ్చినట్లు ఉంటుంది. కథ చదివిన తరవాత కొంతసేపటి వరకు వాస్తవంలోకి రాలేకపోతాం. మనల్ని మనం మరచి పోతాం. ఇప్పుడు ఇక్కడ డబ్బు, మనిషి కథాంశా లుగా మారిపోతున్నాయి. కార్పొరేట్‌ కల్చర్‌ మొదల య్యాక మనీ కల్చర్‌ తప్ప మరేమీ లేదు. అభివృద్ధి పేరుతో మానవ విలువలు నశించిపోయాయి. నేను బెజవాడను ప్రేమించాను. రెండుసంవత్సరాల క్రితం గవర్నర్‌తో సన్మానం చేయించారు. అంతిమంగా, నా నిర్జీవ వ్యర్థ ప్రసాదాన్ని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసు పత్రికి రాసి ఇచ్చేశాను.

– సంభాషణ : డా. పురాణపండ వైజయంతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement