peddibhotla subbaramaiah
-
కథ రాయడం చాలా కష్టం...
1938లో గుంటూరులో పుట్టిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య సుమారు ఏడు దశాబ్దాలు విజయవాడలోనే ఉన్నారు. గుండెను తడి చేసే ‘ఇంగువ’ వంటి అనేక కథలు రచించారు. అందులో కథలకు బహుమతులు పొందారు. ఆ కథలకు అవార్డులు అందుకున్నారు, సన్మానాలు పొందారు. విజయవాడ లయోలా కళా శాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. తాను చేసిన సాహితీ సేవకు అవార్డులు అందుకున్న పెద్ది భొట్ల తన పేరున కూడా కొందరికి అవార్డులు ఇవ్వా లనుకున్నారు. 2012 నుంచి ప్రతి డిసెంబరు 16వ తేదీన తన జన్మదినం సందర్భంగా తన పేరు మీదు గానే అవార్డులు ప్రదానం చేయడం ప్రారంభించారు. 80 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో మే 18 శుక్రవారం కన్నుమూశారు. రెండేళ్ల క్రితం తన జన్మదినం సంద ర్భంగా ఆయన తన చివరి ఇంటర్వ్యూ సాక్షి పాఠ కుల కోసం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు... చిన్నతనంలో స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్కూల్ పుస్తకాలతో పాటు, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు బాగా చదువుకున్నాను. పెద్దయిన తర్వాత సామాజిక స్పృహ ఉన్న రచనలు విరివిగా చదవ సాగాను. ఒంగోలులో పెద్ద లైబ్రరీ ఉండేది. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది. అక్కడ కొవ్వలి, జంపన, శరత్‌ల నవలలు బాగా చదివేవా డిని. ముఖ్యంగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారా యణగారి ‘వేయి పడగలు’ విపరీతంగా చదివాను. విశ్వనాథవారితో అనుబంధం విజయవాడ మాచవరంలో ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీతో బిఏ చదివాను. కాలేజీ... తాటాకులు, తాటి బద్దలతో ఉండేది. అందువల్ల వాన పడితే రోడ్ల మీద షికారు. అప్పట్లో గొప్ప గొప్ప వాళ్లతో ప్రత్యేక పాఠాలు చెప్పించేవారు కళాశాల యాజమాన్యం. అలా చేయడం కాలేజీకి ఒక ఘనత. ఇది 1955 నాటి మాట. స్పెషల్ తెలుగులో నలుగురు మాత్రమే ఉన్నాం. విశ్వనాథ సత్యనారాయణ మా తెలుగు మాస్టారు. ఒకనాడు ఆయనను పాఠం చెప్పమని అడిగితే, ‘‘ఈ రోజు అన్నం తినలేదురా, నీరసంగా ఉంది. ఇంటికి రండి. మధ్యాహ్నం చెప్తాను’’ అన్నారు. విశ్వనాథ వారి ఇంటికి వెళ్తున్నామంటే, మహానుభావుడికి పాదాభివందనం చేయబోతున్నా నన్న జలదరింపు కలిగింది. ఆయన ఇంటికి వెళ్లాం. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడు వరకు ఆయన పాఠం చెప్పారు. పాఠం అంటే కేవలం పాఠం కాదు, అనేక ఇతర అంశాలు, సంస్కారాన్ని జోడించి పాఠం బోధించారు. ఆయనతో కాలం ఇట్టే గడిచిపోయింది. నా చదువు పూర్తయ్యాక, విజయ వాడ లయోలా కళాశాలలో పోస్ట్ ఉందని, వెళ్లమని స్వయంగా విశ్వనాథ వారే పంపారు. అప్పట్లో లయోలా కాలేజీ ఋషివాటికలా ఉండేది. నేను 1996లో అదే కళాశాలలో రిటైరయ్యాను. పద్యం వద్దన్నారు నేను చదువుకునే రోజుల్లో మార్కండేయశర్మ అనే మాస్టారు ‘నువ్వు రచయితవు అవుతావు’ అన్నారు. ఒకసారి ఆయన భారతం విరా టపర్వం చదవమని నాకు ఇచ్చారు. ఆదిపర్వం ఇవ్వ కుండా విరాటపర్వం ఇచ్చారేమిటి అన్నాను. అందుకు ఆయన ‘ఓరి వెర్రివాడా! భారతం పఠనం విరాటపర్వంతో ప్రారంభించాలి’ అన్నారు. ‘భీష్మ ద్రోణ... పద్యం కనిపించింది. నేను చదవలేకపో యాను. అదే మాట ఆయనతో అన్నాను. దానికి సమాధానంగా ఆయన, ‘ఏవీ వాటంతట అవి అర్థం కావు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, తెలుసుకోవాలి’ అన్నారు. అప్పటి నుంచి ప్రతి అంశాన్నీ పట్టుదలతో నేర్చుకోవడం ప్రారంభిం చాను. అప్పట్లో గురువుల తర్ఫీదు అలా ఉండేది. ఆ రోజుల్లోనే ఒకసారి కొన్ని పద్యాలు రాసి, విశ్వనాథ వారికి చూపించాను. అప్పటికే ‘నీళ్లు’ కథ రాసి ఆయన ప్రశంసలు పొందాను. నా పద్యాలు విన గానే, ‘ఇంకెప్పుడైనా పద్యాలు రాసావంటే తంతా నురా’ అన్నారాయన. మళ్లీ పద్యం జోలికి పోలేదు. నేను చదువుకునే రోజుల్లో నాకు స్కాలర్ షిప్ వచ్చింది. కానీ మా నాన్నగారు వద్దన్నారు. చేతిలోకి వచ్చిన మహా నిధి పోయినట్లు అనిపించింది. అప్పుడు వేరే అబ్బాయికి ఇచ్చారు. ఏడుపొచ్చేసింది. ఇంటికి వచ్చి ఏడ్చాను. ‘‘మా నాన్న నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని, ‘స్కాలర్ షిప్ పేద పిల్లల కోసం’ అని చెప్పారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుండెను తాకుతూ ఉంటుంది. చదివితే రాయగలుగుతాం పెద్దవాళ్ల రచ నలు బాగా చదివిన తరవాత, అసలు నేను ఎందుకు కథ రాయకూడదు అనుకున్నాను. కేవలం రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించాలనుకున్నాను. తలుపులన్నీ మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావని, అనేక మంది జీవితాలను బాగా పరిశీలించగలిగితే, మంచి మంచి కథలు వస్తాయని తెలుసుకున్నాను. అలా కథలు రాయడం మొదలుపెట్టాను. అలా భారతిలో మొత్తం 14 కథలు, 2 నవలలు ప్రచురితమయ్యాయి. అమరావతి పేరుతో ప్రకృతి ధ్వంసం ‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతాయి. అయితే దాన్ని పట్టించుకోవాలి. దాని గురించి ఆలోచించాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి ఒక మాను అవుతుంది. అప్ర యత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. కథ జీవితంలో నుంచి వస్తుంది. కథ రాయడం మిగిలిన అన్ని ప్రక్రియల కంటె చాలా కష్టం. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. ఉత్తమ రచయితల జన్మ ధన్యం. ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. ముఖ్యంగా పచ్చటిపొలాలు ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం రాజధాని కోసం తీసేసుకుంది. అందు వల్ల తాజాగా ఉండే కూరలు, పండ్లు, పూలు మాకు దూరమైపోయాయి. అటువైపుగా వెళ్లాలంటేనే చాలా బాధ వేస్తోంది. ఈ ప్రాంతానికి రైతు దూరమై పోయాడు. అక్కడకు వెళ్లి పోరాటం చేయాలను కుంటున్నాను. ఎంతటి అందమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో భూమాత పచ్చటి పట్టుచీర కట్టుకునేది. పుడమి తల్లి ఎంత బాధపడుతోందో అనిపిస్తుంది. మనిషికి భూమితో సంబంధం తెగిపోయింది. పెద్ద పెద్ద భవంతులు వచ్చి కూర్చున్నాయి. అందుకే అక్కడ నుంచి కథలు రావట్లేదు. ఈ ప్రాంతాల నుంచే కథలు... రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచిమంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతో షం... భూమి ఎండితే దుఃఖం... వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. ప్రస్తుతం నవలలు రావట్లేదు. నవలల పేరుతో చెత్త రాకుండా, మేలు జరిగింది. ఇది మంచి పరిణామం. మంచి కథ చదివితే జీవిత శకలం అనుభవానికి వచ్చినట్లు ఉంటుంది. కథ చదివిన తరవాత కొంతసేపటి వరకు వాస్తవంలోకి రాలేకపోతాం. మనల్ని మనం మరచి పోతాం. ఇప్పుడు ఇక్కడ డబ్బు, మనిషి కథాంశా లుగా మారిపోతున్నాయి. కార్పొరేట్ కల్చర్ మొదల య్యాక మనీ కల్చర్ తప్ప మరేమీ లేదు. అభివృద్ధి పేరుతో మానవ విలువలు నశించిపోయాయి. నేను బెజవాడను ప్రేమించాను. రెండుసంవత్సరాల క్రితం గవర్నర్‌తో సన్మానం చేయించారు. అంతిమంగా, నా నిర్జీవ వ్యర్థ ప్రసాదాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసు పత్రికి రాసి ఇచ్చేశాను. – సంభాషణ : డా. పురాణపండ వైజయంతి -
ఇంగువ అంటే?
ప్రాణ స్నేహితుడు చివరి రోజుల్లో ఉన్నాడట.ఎన్ని రోజులు? ఆరా తీశాడు.మహా అయితే వారం.చూసి రావాలి. చూసి రావాలా? చూడగలడా?చిన్నప్పుడు రోజులు బాగా గడిచాయి. ఇద్దరూ కలిసి పెరిగారు. వాన వస్తే చొక్కాలు విప్పి నెత్తి మీద గొడుగు పట్టారు. ఎండ కాస్తే కొమ్మలు తెంపి వొంటి మీద ఛత్రీ పట్టారు. ఎవరి ఇంట్లోనో కాసిన జామకాయల మీద పెత్తనం చేశారు. ఏదో గోడ మీద ఇష్టం లేని హీరోను పేడతో తడిపారు. కాలానికి కూడా బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటుంది.ఇప్పుడు వృద్ధాప్యం.ఈ వృద్ధాప్యంలో ఆకు రాలినా కళవళపడేలా మనసు సున్నితమైన క్షణాల్లో వాణ్ణి చూసి రావాలా? చూసి రావాలి. చూడకపోతే ఎలా?ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే ఎవరో పలకరించి వెళుతున్నారు. భార్యా పిల్లలూ... ఇంటి పెద్దమనిషికి సుఖవంతమైన వీడ్కోలు ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటున్నారా? మంచం దగ్గర శబ్దం రాకుండా స్టూల్‌ను లాక్కుని కూచున్నాడు.చేయి పట్టుకున్నాడు.ఎన్నిసార్లు పట్టుకున్న చేయి. వేలసార్లు పట్టుకున్న చేయి. చిన్న కదలిక వచ్చింది. గట్టిగా నొక్కాడు. ఆ కదలికకు కారణమైన మనిషి ఎవరో కనిపెట్టినట్టుగా ఇంకొంచెం కదిలింది. ‘ఎలా ఉన్నావురా?’ అడిగాడు.చేతిలో ఉన్న చేయి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది. కళ్లు ఏవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.ఏం చెప్పాలనుకుంటున్నాడు?నోటి దగ్గరగా మెడను వొంచి చెవి దగ్గర చేశాడు.ఆ మిత్రుడు, మృత్యువు గడప దగ్గర నిలుచుని సుసమయం కోసం ఎదురు చూస్తున్న మిత్రుడు, ప్రాణమిత్రుడు, చిరకాల మిత్రుడు... ప్రశ్న వేశాడు.ఏమని?‘ఇంగువ అంటే ఏమిటిరా?’అదిరిపోయాడు. ఒక్క క్షణం ఉలిక్కిపడి చేయి విడిచేశాడు. స్టూలు నుంచి లేచి నిలబడి, ఏం చేయాలో తోచనట్టుగా నిలబడి, ఇప్పుడే వస్తాను అన్నట్టుగా మొదలు నెమ్మదిగా ఆ తర్వాత వడివడిగా అడుగులు వేసి ఇంట్లో నుంచి బయటపడ్డాడు.ఏమిటి వీడు... ఇంకా మర్చిపోలేదా అది?ఒకసారి ఇద్దరూ పెళ్లిలో కలిశారు. అప్పుడా స్నేహితుడు అన్నాడు–‘ఏమిటో రోజులు.. ఎలాగో గడచిపోతున్నాయి. చిన్నచిన్నవి ఏవో అనుకుంటామా తీరవు. రేపు చేద్దాం అనుకుంటాం. ఆ రేపు రాదు. మాపు చేద్దాం అనుకుంటాం ఆ మాపు రాదు. బతుకు బాదరబందీలో పడీ.... అంతెందుకు? ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోవాలని నాకెప్పటి నుంచో కోరిక. అదేమైనా చెట్టా కాయా పండా ఫలమా విత్తనమా లవణమా రసాయనమా... ఏమిటా ఇంగువా. రోజూ వంటలో తింటాను కదా. ఈ ఇంగువంటే ఏమిటో కూడా తెలుసుకోకుండానే చచ్చిపోతానా అని బెంగ. ఇంతకీ ఇంగువంటే ఏమిట్రా’ ఏమో. ఎవరికి తెలుసు. తనకూ తెలియదు. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయాడు. వీడు మర్చిపోలేదే. అది కూడా తెలుసుకోకుండా పోతాడా? అది కూడా తెలపకుండా పంపుతాడా తను?ఏమీ తోచనట్టుగా బజార్లలో తిరిగాడు. ఏమీ తోచనట్టుగా ఏదో సినిమా చూశాడు. మనసుకు శాంతిగా అనిపించలేదు. ఈ ఊళ్లోనే తెలిసిన లెక్చరర్ ఒకడు ఉన్నాడు. వెళ్లి అతణ్ణి అడిగితే?వేళాపాళా లేకుండా ఊడిపడిన అతణ్ణి లెక్చరర్ వింతగా చూశాడు.‘ఇంగువంటే ఏమిటండీ’ సమయం సందర్భం లేకుండా అడిగిన ప్రశ్నకు ఇంకా వింత పడ్డాడు.కాని వాలకం అర్థమైంది. ఏదో అర్జెన్సీలో ఉన్నాడు.అందుకని ఇంగువంటే ఏమిటో అది ఎలా వస్తుందో వివరంగా చెప్పి పంపించాడు.ఇప్పుడు సంతోషంగా ఉంది. సంతృప్తిగా ఉంది. స్నేహితుడి వెలితిని తొలగించగలనన్న నమ్మకం ఉంది. ఇప్పుడు తనకు ఇంగువ అంటే ఏమిటో తెలుసు. అది పండో ఫలమో కాయో బెరడో వేరో లవణమో తనకు తెలుసు. ఇది వెంటనే స్నేహితుడికి చెప్పాలి. కచ్చితంగా చెప్పాలి. చెప్పి తీరాలి.అడుగులు వేగంగా వేశాడు. ఇంత పెద్ద వయసు కదా. అయితే ఏమిటి? పరిగెత్తినట్టు వేశాడు. పరిగెత్తాడా? అదిగో అల్లంత దూరంలో ఇల్లు. ఒరే స్నేహితుడా... ఇంగువ అంటే ఏమిటో చెప్తాను ఉండు ప్రాణం ఉగ్గబట్టుకో... నడుస్తున్నాడు. కాని– ఏడుపు. అవును. ఏడుపు. బాబోయ్ ఏడుపే.పోయాడు. పోయాడే. ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోకుండానే పోయాడే.చిన్న కోరిక. చాలా చిన్నది.తీరకుండా పోయాడా?ఎవరికి చెప్పాలి ఇది. ఈ జవాబు ఎవరికి చెప్పాలి.ఇంగువ అంటే... ఇంగువ అంటే... పెద్దగా అరవబోయాడు. అరవనున్నాడు. అరిచి చెప్పనున్నాడు.కథ ముగిసింది.పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ, ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టిన కథ ‘ఇంగువ’ ఇది.పెళ్లయ్యాక తొలిరోజుల్లో భార్య సిగలో మల్లెలు తురుముతూ ‘మనం తాజ్‌మహల్ వెళ్దాంలే’ అంటాడొకడు. ఎప్పటికీ జరగదు. సొంత ఇల్లు, నాదంటూ ఒక గది, అందులో అల్మారా నిండా పుస్తకాలు అనుకుంటాడొకడు. జరగదు. చిన్నప్పుడు ‘ఒరే శీనయ్యా’ అని ప్రేమగా పిలిచి ఇంకు పెన్ను బహూకరించిన అమ్మాయి ఫలానా ఊళ్లో స్థిరపడి ఉందని తెలిసి వెళ్లి చూడాలి అనుకుంటాడొకడు. కుదరదు. కొండ సానువుల్లో వేపచెట్టు నీడన చల్లటి అమ్మోరితల్లికి దండం పెట్టుకొద్దామనుకుంటాడొకడు. కుదరనే కుదరదు. మంచి బట్టలూ కుదరవు. కళ్లకు నదురైన ఫ్రేమ్‌తో ఉన్న అద్దాలూ కుదరవు. చిన్న చిన్న కోరికలే అన్ని.మనుషులు కోరుకోదగ్గవే.బరువులు, బాధ్యతలు, ఉద్యోగాలు, సద్యోగాలు, చావులు, పుటకలు... వీటిలోనే రోజులన్నీ గడిచిపోతాయి. తీరా తేరుకుని ఇది నా జీవితం దీనిని నేను అనుభవిస్తాను అని అనుకునేలోపు మృత్యువు మంచం కోడు దగ్గర పాశం పట్టుకు నిలబడి ముగింపు సమయాన్ని ప్రకటిస్తుంది.జీవితాన్ని ప్రతిక్షణం ఒక సమాధానంలా జీవించడం అదృష్టం.జీవితాన్ని ప్రతి నిమిషం ఒక సందేహంలా జీవించడం దురదృష్టం.రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య రవంత ఇంగువను జోడించి ఈ కథలో చెప్పిన రహస్యం ఇదే.ఇప్పుడు అర్థమైందా ఇంగువ అంటే ఏమిటో. – మూలకథకు పునఃకథనం: మహమ్మద్ ఖదీర్‌బాబు (రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు) - పెద్దిభొట్ల సుబ్బరామయ్య -
పెద్దిభొట్ల వెళ్లిపోయారు
-
సాహిత్య చరిత్రలో పెద్దిభొట్లది ప్రత్యేక స్థానం: వైఎస్ జగన్
సాక్షి, గోపాలపురం : విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కార గ్రహీత పెద్దభొట్ల సుబ్బరామయ్య మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 350కి పైగా కథనలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి పెద్దభొట్ల విశేష సేవలందించారని వైఎస్ జగన్ కొనియాడారు. తెలుగు సాహిత్య చరిత్రలో పెద్దిభొట్ల ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. పెద్దిభొట్ల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విఖ్యాత రచయిత పెద్దిభొట్ల కన్నుమూత -
విఖ్యాత రచయిత పెద్దిభొట్ల కన్నుమూత
సాక్షి, విజయవాడ : విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో నాలుగు రోజుల కిందట విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1938 డిసెంబరు 15న గుంటూరులో జన్మించిన పెద్దిభొట్ల ఒంగోలులో స్కూలు చదువు పూర్తిచేసుకున్న ఆయన విజయవాడలో పై చదువులు చదివారు. 350కి పైగా కథలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి ఆయన విశేష సేవలందించారు. పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని గుంటూరు ఎన్నారై ఆస్పత్రికి దానం చేసిన విషయం తెలిసిందే. పెద్దిభొట్లకు పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారం, ఏస్ రన్నర్, వీళ్ళు (కథాసంకలనం) వంటి కథలు, ముక్తి, చేదుమాత్ర నవలలు పేరు తెచ్చాయి. ఆంధ్రా లయోలా కాలేజీలో 40 ఏళ్లపాటు లెక్చరర్‌గా సేవలు అందించిన ఆయన 1996లో రిటైర్ అయ్యారు. విఖ్యాత రచయిత ‘వేయి పడగలు’ నవల సృష్టికర్త విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడైన ఆయన రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1)కు గానూ 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. -
కథ రాయడం చాలా కష్టం
అభిప్రాయం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గుండెను తడి చేసే కథలు రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ గురించి, కథ రాయడంలోని కష్టం గురించి ‘సాక్షి’తో సంభాషించారు.. కథ రాయాలంటే... కేవలం ఇతరుల రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడే మంచి కథలు వస్తాయి. తలుపులు మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావు. అనేక జీవితాలను పరిశీలించాలి. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతుంది. అయితే దాన్ని పట్టించుకోవాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి మాను అవుతుంది. అప్రయత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. అయితే, కథ రాసేవారికి బయటి నుంచీ ఏవీ సహకరించవు. రచయిత చూసినవి, రచయిత స్వానుభవం మాత్రమే కథలో ఉంటాయి. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. చిన్న కథ పుట్టుక... ‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. అయితే, ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతోషం, ఎండితే దుఃఖం. వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. వీరు కూడా రచించారు... ప్రక్రియలన్నిటిలో కూడా కథానిక ప్రత్యేకమైనది. ఇది పాశ్చాత్య ప్రక్రియ. పాఠకులకు ఒక జీవిత శకలాన్ని చూపించే సాధనం కథ. ఉత్తమ కథానికలో ఒక్క అక్షరం కూడా వృథాపోదు. కథలో సాధారణ మానవుడి జీవితాన్ని సాధారణమైన పద్ధతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, వేలూరి వంటి పద్యకావ్య రచయితలు సైతం కథానికలు రాశారు. వారు కథను ప్రేమించారు. వాటి గొప్పదనాన్ని గుర్తించారు. ‘ముసురు’ కథ... ఒక శవం పక్కన ఒక తమిళ అమ్మాయి కూర్చున్న దృశ్యం నన్ను ఆకర్షించింది. ఏం జరిగిందని పక్కన వాళ్లను అడిగితే, వారిద్దరూ ప్రేమికులనీ, లేచిపోయి వచ్చారనీ, చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగిస్తున్నారనీ, అతడు చనిపోయాడనీ, ఆ అమ్మాయికి మన భాష రాదనీ చెప్పారు. ఆ దృశ్యం చూశాక అంతర్మథన పడ్డాను. అందులో నుంచి వ చ్చిన కథే ‘ముసురు’. ‘ఇంగువ’ గురించి... నా బాల్యమిత్రుడు ‘ఇంగువ అంటే ఏంటి?’ అని అడిగాడు. ఆ తరవాత కొన్నాళ్లకి చనిపోయాడు. ఇంతకీ అతడు ఈ విషయం తెలుసుకుని పోయాడా, తెలుసుకోకుండా పోయాడా అనుకున్నాను. జీవితంలో తెలుసుకునేవి తక్కువ, తెలియని విషయాలు ఎక్కువ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ఇంగువ’ కథ. ఇలా ఎన్నో కథలు నేను ఎన్నో జీవితాలను పరిశీలించి రాసినవే. పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో రైలు తుడవ డానికి ఎక్కే నలుగురు కుర్రాళ్ల జీవితాల మీద నాలుగు కథలు రాశాను. వారిలోనూ అద్భుతమైన జీవితం ఉంటుంది. వాళ్లకి ఆ స్టేషనే జన్మస్థలం, పడక, పక్క అన్నీ! వాళ్లు అక్కడ నుంచి బయటకు వెళ్లలేకపోతారు. వెళ్లాలంటే భయం. విమర్శలు... చాలామంది నా కథలు ఏడుపు కథలన్నారు. కరుణ అనేది సున్నితమైన సూత్రం. అది తెగితే జుగుప్స. నేను అచ్చంగా చూసిన జీవితాన్ని చూసినట్టు రాశాను. అలాగే, మనిషిలో అసంతృప్తి అనే లక్షణం ఉంటుంది. ఆ అసంతృప్తే నా కథలకు ప్రధాన వస్తువు. సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకునేవారికి, మన చుట్టూ ఉన్నవన్నీ కథా వస్తువులే. అయితే, కథలు చదవడానికి కూడా ఒక కల్చర్ ఉండాలి. ఇంకించుకునేవారు ఉత్తమ పాఠకులు. - డా. పురాణపండ వైజయంతి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి