పెద్దిభొట్ల సుబ్బరామయ్య (ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ : విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో నాలుగు రోజుల కిందట విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1938 డిసెంబరు 15న గుంటూరులో జన్మించిన పెద్దిభొట్ల ఒంగోలులో స్కూలు చదువు పూర్తిచేసుకున్న ఆయన విజయవాడలో పై చదువులు చదివారు. 350కి పైగా కథలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి ఆయన విశేష సేవలందించారు.
పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని గుంటూరు ఎన్నారై ఆస్పత్రికి దానం చేసిన విషయం తెలిసిందే. పెద్దిభొట్లకు పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారం, ఏస్ రన్నర్, వీళ్ళు (కథాసంకలనం) వంటి కథలు, ముక్తి, చేదుమాత్ర నవలలు పేరు తెచ్చాయి. ఆంధ్రా లయోలా కాలేజీలో 40 ఏళ్లపాటు లెక్చరర్‌గా సేవలు అందించిన ఆయన 1996లో రిటైర్ అయ్యారు. విఖ్యాత రచయిత ‘వేయి పడగలు’ నవల సృష్టికర్త విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడైన ఆయన రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1)కు గానూ 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment