
ముంబై: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు -2019 ను నిరసిస్తూ ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు, రచయిత షిరీన్ దాల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయ చట్టానికి నిరసనగా తనకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ బిల్లును పాస్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెక్యులరిజానికి విరుద్ధమని విమర్శించారు. ఈ పరిణామం తనను తీవ్రమైన విచారానికి, షాక్‌కు గురించేసిందని షిరీన్ వ్యాఖ్యానించారు. ''అవధ్‌నామా'’ ఉర్దూ పత్రిక ముంబై ఎడిషన్ ఎడిటర్‌గా పనిచేసిన ఆమెకు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవకు గాను 2011లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే చార్లీ హెబ్డో కార్టూన్‌ను తిరిగి ముద్రించిన వివాదంలో ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న ఆమె ఉర్దూన్యూస్ ఎక్స్‌ప్రెస్. కామ్ అనే న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
మరోవైపు మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ముంబై (రాష్ట్ర మానవ హక్కుల కమిషన్) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగిస్తుందంటూ బిల్లును ఖండించిన ఆయన తన సర్వీసులకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
కాగా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకన్న నరేంద్ర మోదీ సర్కార్, బుధవారం రాజ్యసభ ఆమోదాన్ని కూడా సాధించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలు వీగిపోయాయి. సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు తరువాత రాజ్యసభ బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదించింది. దీంతో ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్డుడుకుతున్నాయి. ముఖ్యంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. గువహటి, డిబ్రూగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలతోపాటు పలు రైళ్ల, విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment