సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన లిటరరీ ఫెస్ట్‌లో తెలుగెత్తి జైకొట్టు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీ ప్రముఖులు
హైదరాబాద్: దేశంలో సాహిత్యంపై దాడులు జరుగుతున్నాయని ప్రముఖ హిందీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మంగలేష్ దబ్రాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 4వ లిటరరీ ఫెస్ట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 135 మంది సాహితీవేత్తలు, స్కాలర్స్ రచించిన ‘తెలుగెత్తి జైకొట్టు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగలేష్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చరిత్ర, కొత్త వ్యక్తులను ముందుకు తీసుకొస్తున్నారని, గాంధీ, నెహ్రూలకు బదులుగా వారి త్యాగాలను చరిత్రను చెరిపేసి సావర్కర్, వల్లభాయ్ పటేల్‌ను ముందుకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో మత ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతిశీలమైన రచయితలను నిషేధిస్తున్నారని విమర్శించారు. నేటి కవులు, రచయితలు అప్రమత్తంగా ఉండి దేశ వైవిధ్యాన్ని కాపాడాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. దిశ అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రజల నిరసనలు పెరిగాయని అన్నారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడే ఎన్‌కౌంటర్లు జరుగుతాయన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పారు. తెలుగును ఎత్తిపట్టుకోవాల్సిన సందర్భం వచ్చిందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు వారిని అర్థం చేసుకునేది మాతృ భాష అని చెప్పారు. ప్రముఖ కవి సుధామ మాట్లాడుతూ.. సాహిత్యం లేకున్నా భాష ఉంటుంది.. కానీ భాష లేకుంటే సాహిత్యం ఉండదని పేర్కొన్నారు. ప్రముఖ విమర్శకులు కె.శివారెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యానికి ఎల్లలు లేవని అన్నారు. సమాజం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కవులకు ఉందన్నారు. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. భాష, సంస్కృతి ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవులు నిఖిలేశ్వర్, ఓయూ తెలుగు శాఖ అధిపతి సూర్య ధనుంజయ్, కవి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment