సాహితీ సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు
తణుకు టౌన్: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ, భావ కవిత్వం వైపు నడిపించిన గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సాహిత్య అకాడమీ, తిలక్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ శత జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు సాహితీ అకాడమీ, తెలుగు అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిలక్ తన రచనల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, జాతి, మత తత్వాలకతీతంగా ఆయన రచనలున్నాయని కొనియాడారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ తిలక్ కవిత్వం 20వ శతాబ్దపు సాహిత్య ప్రపంచంలో ఎక్కువ జనాదరణ పొందిందన్నారు.
తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ తర్వాత అంతటి ప్రభావం చూపిన రచనలు తిలక్‌వని కొనియాడారు. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని ప్రకటించుకున్న కవి తిలక్ అని, ఆయన కవిత్వానికి మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తిలక్ రచనలపై ముద్రించిన పుస్తకాలను చిన వీరభద్రుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు నన్నయ భట్టారక పీఠం అధ్యక్షుడు జేఎస్ సుబ్రహ్మణ్యం, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment