సాహిత్య విమర్శకు రాచబాట | Literary criticism is the thoroughfare | Sakshi
Sakshi News home page

సాహిత్య విమర్శకు రాచబాట

Published Mon, Jan 19 2015 2:49 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

సాహిత్య విమర్శకు రాచబాట - Sakshi

సాహిత్య విమర్శకు రాచబాట

విలక్షణమైన కవిగా.. రచయితగా.. ఆయన సాహితీ లోకానికి సుపరిచితులు. గురజాడ సాహిత్యాన్ని నిత్య నూతనం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి. సీమలోని అనేకమంది సాహిత్యకారులను సునిశితంగా పరిశీలించి వారిని బయట ప్రపంచానికి తెలియజెప్పిన పరిశోధకుడు.

ఆయనే మన తెలుగు నవల కథానిక సాహిత్య విమర్శకు ‘రాచ’బాట వేసిన చిత్తూరు సాహిత్య ముద్దు బిడ్డ.. ఎస్వీయూ చిన్నోడు.. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి. తండ్రి సేద్యం చేయమని పట్టుబట్టాడు. చదువుకోవాలని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పినతల్లి ఆయనను ఒప్పించి కళాళాలకు పంపింది.

 
 తిరుపతి రూరల్: ఆంధ్ర దేశంలో తెలుగు కథపై మాట్లాడగలిగిన, రాయగలిగిన అతికొద్దిమంది విమర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు  రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి. 30 ఏళ్లుగా సాహిత్యరంగంలో ఏనలేని కృషి చేస్తున్న ఆయన, నిబద్ధతతో కూడిన విమర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రచించి న ‘మన నవలలు-మన కథానికలు’ అనే విమర్శన గ్రంథానికి 2014 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.

జాతీయ స్థాయిలో ఉత్తమస్థాయి విమర్శకు దక్కిన గౌరవం ఇది అని సాహితీవేత్తలు కొనియాడుతున్నారు. రాచపాళె ం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు సాధిం చడం.. ప్రస్తుత కథా విమర్శ తీరు తెన్నులు.. శాస్త్రవేత్త అవుదామనుకున్న తాను తెలుగు సాహిత్యం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది.. తన జీవితాన్ని మలుపుతిప్పి తన ఉన్నతికి తోడ్పాటు అందించిన వారి గురించి ఇటీవల తిరుపతికి సమీపంలోని తన స్వస్థలం కుంట్రపాకానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

అవి ఆయన మాటల్లోనే..
‘‘మాది తిరుపతి మండలంలో కుంట్రపాకం అనే చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు.. చుట్టూ కొండలతో ఉండే అందమైన గ్రామం. గ్రామంలో భూములు ఎక్కువగా ఉండేవి. నాయన రామిరెడ్డి, అమ్మ మంగమ్మ. చిననాటి నుంచి చదువుల్లో ముందు ఉండేవాడిని. ప్రాథమిక విద్య మొత్తం గ్రామంలోనే సాగింది. పీయూసీ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది.

నాన్న చదువులు వద్దు ఇంటి ద గ్గరే ఉండి సేద్యం చూసుకోమని అడ్డం తిరిగాడు. అప్పటికే తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్ కళాశాలలో బీయస్సీ సైన్స్ కోసం, ఎస్వీ యూనివర్సిటీ స్పెషల్ తెలుగు కోసం దరఖాస్తు చేసుకున్నా. రెండు చోట్లా సీటు వచ్చింది. కానీ ఇంట్లో మాత్రం చదువు వద్దని నాన్న పోరు.
 
పిన తల్లి లేకుంటే సేద్యంలోనే..!
 నాన్నకు ఎంత చెప్పిన వినకపోవడం, సీటు వచ్చిన చదువులు కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇక జీవితం సేద్యం పాలే  అనుకు న్నా. అప్పుడు దేవత లాగా ఆదుకుంది సవతి తల్లి రాజమ్మ. (మేము చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో నాన్న మళ్లీ పెళ్ళి చేసుకున్నా రు. ఆమే రాజమ్మ) ఆ తల్లే లేకుంటే చదువు లేదు.. సాహిత్యం లేదు.. బిడ్డా చదువుకుంటానంటే సేద్యం అంటావేంటి అంటూ నాన్నను ఓప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది.

సేద్యం ఇబ్బందిగా ఉంది తోడుగా ఉంటాడు.. అని నాన్న తన అవసరాలను చెప్పగా.. అదే సమయంలో నీకేందుకు బాబయ్య.. సేద్యం పనులు నేను చూసుకుంటా అబ్బోడిని చదువు కు పంపించు అంటూ ఇంట్లో నౌకరుగా పనిచేస్తున్న మాలపెద్దాయన సైతం చెప్పడంతో కళాశాల చదువులకు నాన్న ఒప్పుకున్నాడు.
 
ఆర్ట్సా.. సైన్సా..!
 ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బీయస్సీలో.. ఎస్వీ యూనివర్విటీలో స్పెషల్ తెలుగులోనూ సీటు వచ్చింది. దీంతో ఆర్ట్స్ తీసుకోవాలో, సైన్స్ తీసుకొవాలో అర్థం కాని పరిస్థితి. ఆ రోజుల్లో సైన్స్ గ్రూపులు అంటే భలే క్రేజ్. నాకు కూడా సైంటిస్ట్ అవ్వాలని కోరిక. కానీ యూనివర్సిటీలో సీటు కావడంతో స్పెషల్ తెలుగులో చేరాలని నిర్ణయించుకున్నా.
 
విమర్శకు పునాది అక్కడే
సాహిత్య విమర్శకు పునాది  ఎస్వీయూలోనే పడింది. నాడు తెలుగుశాఖలో ఉద్దండులైన అచార్యులు ఉండేవారు. అచార్య బీయన్ రెడ్డిగారు శాఖాధ్యక్షులుగా ఉన్నారు. మద్దూరి సుబ్బారెడ్డి, తుమ్మపూడి కోటేశ్వరరావు, నాగయ్య, సూర్యనారాయణ వంటి ఆచార్యులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదై న శైలిలో బోధించేవారు. మద్దూరి సుబ్బారావు గారు క్లాసులోనే పిల్లల చేత పాఠం చెప్పించే వారు. ఆచార్య బీయన్ రెడ్డి గారు ప్రతి శనివారం సెమినార్ నిర్వహించేవారు. విద్యార్థి బోధనపై చర్చ జరిపించేవారు.

తెలుగు సాహిత్యానికి మంచి విమర్శ కావాలని నాడే ఉద్బోధించా రు. వారి సాన్నిహిత్యం, సూచనలు, తరగతి గది నుంచే నాలో విమర్శకు పునాది పడింది. వారిద్దరిదీ ఒక ఎత్తు అయితే ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు పర్యవేక్షణలోనే పరిశోధన చేశా. సాహిత్య విమర్శకు ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో మేలు చేశాయి.
 ప్రస్తుతం సాహిత్య విమర్శ సామాజిక  అభ్యుదయ ప్రాపంచిక దృక్పథంతో సాగుతోంది. జీవితంలోని కొత్త కోణాలను అర్థం చేసుకోవడానికి కథా సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రస్తుతం తెలుగు కథ నిర్వహిస్తున్న సామాజిక పాత్ర చాలా బాగుంది.
 
సాహిత్య సేవలో..
ప్రస్తుతం ఆచార్య చంద్రశేఖర్ రె డ్డి కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. అభ్యుదయ రచయితల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా.. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా.. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యునిగా సేవలు అందిస్తున్నారు.

సీమ సాహిత్య మాస పత్రిక సంపాదకునిగా, విద్యార్థి చెకుముకి మాస పత్రిక సంపాదకవర్గం సభ్యునిగా పనిచేశారు. 2012 అక్టోబర్ నుంచి వైఎస్‌ఆర్ జిల్లాలోని కవులు, రచయితలపై ‘నెల నెల మన జిల్లా సాహిత్యం’ పేరిట సాహిత్య సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈయన సాహిత్యంపై ఏడుగురు పరిశోధనలు చేశారు. 90 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఉపన్యాసాలు ఇచ్చారు.
 
 పేరు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
 తండ్రి పేరు: రామిరెడ్డి
 తల్లి పేరు: మంగమ్మ
 స్వగ్రామం: తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం
 చదువు: ఎస్వీయూ తెలుగు విభాగంలో ఎంఏ, పీహెచ్‌డీ, వయోజన విద్యలో డిప్లొమా, ఎస్కేయూలో తమిళంలో సర్టిఫికెట్ కోర్సు
 ఉద్యోగం: 31 ఏళ్ళ పాటు ఎస్కేయూ తెలుగు విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. 2008లో తెలుగు శాఖాధ్యక్షులుగా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కడపలోని యోగి వేమన వర్సిటీ తెలుగు విభాగంలో గౌరవ ఆచార్యులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement