కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : కళలకు ప్రోత్సాహం కరువవుతున్న తరుణంలో కాకతీయ ఉత్సవాల ద్వారా జిల్లాలో కళా, సాంస్కృతిక రంగాలకు పూర్వవైభవం లభిస్తోందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న సంగీత, నృత్య నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రదర్శనలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఓరుగల్లులో కళలకు కొదవలేదని అన్నారు. లలిత కళలు జనజీవితంలో పెనవేసుకుని అన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో కె.వెంకటరమణ, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓలలాడించిన డాక్టర్ శేషులత
సంగీత, నృత్య నవరాత్రోత్సవాల్లో భాగంగా డాక్టర్ కె.శేషులత శాస్త్రీయ సంగీతంప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది. శష్ముఖ ప్రియ రాగంలో సిద్ది వినాయకం అనే ముత్తుస్వామి దీక్షతార్ కృతితో శేషులత తన గాత్రాన్ని ప్రారంభించారు. అనంతరం, హేమగిరి తనయో హేమలత్ అంచశుద్ద ధన్యాసి రాగంలో త్యాగరాజ కృతి, బంటురీతి కొలువు అనే కృతిని హంసపద రాగంలోనూ, నగుమోము అనే త్యాగరాయ కీర్తన అభేది రాగంలో ఇలా దాదాపు గంటన్నరపాటు తన శాస్త్రీయ సంగీత కార్యక్రమం జరిగింది.
శేషులత గానానికి మృదంగం జయభాస్కర్, వయోలిన్ నందకుమార్, ఘఠంపై రవికుమార్ వాద్య సహకారం అందించారు. అనంతరం జయాపసేనాని నృత్యాలయం, చాతరాజు నవ్యజ బృందం చేసిన ఆలయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో పీవీ.మదన్‌మోహన్ పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు..
గురువారం సాయంత్రం 6 గంటలకు వద్దిరాజు నివేదిత శిష్య బృందంచే శాస్త్రీయ సంగీతం, హైదరాబాద్‌కు చెందిన ఎం.సురేంద్రనాథ్ బృందంచే కూచిపూడి నృత్యప్రదర్శన ఉంటాయి. అలాగే వరంగల్ కాకతీయ కళాక్షేత్రం వెంపటి నాగేశ్వరి బృందంచే శాస్త్రీయ నృత్యాలుంటాయని జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ కె.వెంకటరమణ తెలిపారు.
సాంస్కృతిక రంగానికి పూర్వవైభవం
Published Thu, Oct 10 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement