Ampasayya Naveen
-
Gunturu Seshendra Sharma: రసాత్మక వాక్యాల విప్లవ కవి
మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ అఖిల భారత స్థాయిలో గుర్తింపు పొందాల్సినంత ప్రతిభాశాలి. ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని అనుకునేవాళ్లలో నేనొకడిని. భారతదేశపు నోబెల్ ప్రైజుగా భావించే జ్ఞానపీఠ పురస్కారం ఆయనకు వచ్చినట్టే వచ్చి చేజారడం దురదృష్టకర సంఘటన. శేషేంద్ర సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ తనదైన ముద్రను లిఖించగలిగాడు. ఆశ్చర్యం యేమిటంటే, ఆయనను కవిగాకంటే విమర్శకుడిగా గుర్తించటం. ఈమాట ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆయన రాసిన ఏ కవితా సంకలనానికో రాలేదు. కాలరేఖ పేరుతో ఆయన సంకలనం చేసిన కొన్ని విమర్శా వ్యాసాలకు వచ్చింది. మరొక ఆశ్చర్యకరమైన అంశమేమంటే, ఆయన శ్రామిక పక్షం వహిస్తూ శ్రామిక విప్లవం రావాలని చెప్పే కవిత లెన్నో రాశాడు. అయినప్పటికీ ఆయనను అభ్యుదయకవి అనో, విప్లవ కవి అనో ఎవరూ అనలేదు. ధనిక వర్గానికి చెందిన నవ్య సంప్రదాయవాదిగానే తెలుగు సాహితీ ప్రపంచం గుర్తించింది. ఇందుకు కారణం ఏమిటో మనం పెద్దగా ఊహిం చాల్సిన అవసరం లేదు. మహాసంపన్నురాలైన ఇందిరా ధన్రాజ్గిరితో ఆయన సహజీవనం చెయ్యటం మొదలెట్టినప్పటినుంచీ ఆయన జీవన విధానం మారిపోయింది. రాజభవనం లాంటి ప్యాలెస్‌లో నివసిస్తూ, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన శేషేంద్రను విప్లవ కవి అంటే ఎవరు నమ్ముతారు? కానీ ఆయన కవిత్వంలో మాత్రం బలమైన విప్లవ భావాల చిత్రణే జరిగింది. ఇందుకు ఉదాహరణగా ఆయన రాసిన ‘గొర్రిల్లా’ అనే లఘుకావ్యాన్ని పరిశీలించవచ్చు. ఆయన ప్రతి కవితలోని ప్రతీ వాక్యం సౌందర్యవంతంగా, రసాత్మకంగా ఉంటుంది. ‘లేస్తోంది ఉషఃకాంతుల్లోంచి ఒక హస్తం/ ఆ హస్తం, కాలం అనే నిరంతర శ్రామికుడి సమస్తం’ అని అన్నా, ‘నదులు, కవులు ఖగోళపు రక్తనాళాలు’ అన్నా ఎంత రసాత్మకంగా ఉన్నాయో గమనించవచ్చు. గెరిల్లా అనే ఇంగ్లిష్ మాటను ఆయన గొర్రిల్లా అంటున్నాడు. దీన్ని విప్లవానికి సంకేతంగా ఈ కవి తీసుకున్నాడు. శ్రామిక విప్లవం కోసం గెరిల్లా అనే వాడు కంటికి కనిపించకుండా శత్రువుపై మెరుపుదాడి చేస్తాడు. డెబ్బైలలో వియత్నాంలో గెరిల్లాలు గొప్ప పోరాటం చేశారు. అమెరికా లాంటి శక్తిమంతమైన పెట్టుబడిదారి సైన్యాన్ని కోలుకోకుండా దెబ్బతీశారు. వీరిని వియట్‌కాంగ్ అనేవారు. అలాంటి గెరిల్లాలే ప్రపంచంలో సమసమాజాన్ని స్థాపించగల్గుతారని ఈ కావ్యంలో శేషేంద్ర భావించాడు. ‘అడవుల్లో ఉరితీసిన వీరుడిలా ఉదయపు చెట్లలో వ్రేలాడుతున్నాడు సూర్యుడు’ అంటాడు. ‘దేవత లొస్తుంటారు, పోతుంటారు. మనకందే దేవత మాత్రం మన చేతుల్లో ఉన్న నాగలి... మన కండరాల్లో నిదురించే గొర్రిల్లా’ అన్నప్పుడు గెరిల్లాను రాబోయే విప్లవానికి ఒక ప్రతీకగా భావించాడు. శేషేంద్ర కవి త్వంలో అడుగడుగునా ఈ సింబాలిజం దర్శన మిస్తుంది. ఇంకా తనలోని గెరిల్లా గురించి ఈ కవి అంటున్న ఈ మాటలు చూడండి: సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు/ తుపాను గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు/ నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు– కానీ/ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’. ‘రా సోదరా, ఇది గొర్రిల్లా యుగం. విస్తట్లో తుపానులు వడ్డించాను, తిందామురా. మనకోసం నిరీక్షిస్తున్న తరుణపు బ్రహ్మరాక్షస పరిమాణాలు అందుకుందాం రా’ అని పాఠకులను పిలుస్తాడు. ‘తమ్ముడా నీ గాయాల దైన్యాన్ని చూడలేకున్నాను. కానీ నీ ఆత్మ తిరగబడదనే నా బాధ! లోకం గొర్రిల్లా దశలోకి దొర్లిపోతోంది. మన మహాపూర్వుడి ఇనుప కండరాల శకంలోకి– ఇంకా పాత పేజీల్లోనే పచార్లు చేస్తూ ఉండిపోకు’అని హెచ్చరిస్తాడు. ఇంకా ఇలా అంటాడు: ‘పొగరుబోతు గుర్రాల్లా నురగలు కక్కుతూ పరుగులెత్తే కండరాలకు కళ్లెం వెయ్యకు. నీ బాహువుల్లో నిదురించే శక్తే నిన్ను రక్షించాలి. వాళ్ల దేవుడు గుడి విడిచి పారిపోయాడు, భక్తుల బాధ తట్టుకోలేక. నీ దేవుడు నీ తుపాకీ కండరాల్లోనే నిదురిస్తున్నాడు. అది పేలిన శబ్దం నీ చుట్టూ సుడి తిరిగితే, ఒక గుడిగా పెరిగితే నీ యుగం దిగి వస్తుంది భూతలం మీదికి’. గెరిల్లా ఇలా అంటున్నట్టుగా ఈ కవి ఊహిం చాడు: ‘నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు. పిడికిళ్లలో బాంబులు బిగించుకొని వచ్చాను’. శేషేంద్రకు ప్రతీకాత్మక లేక సింబాలిస్టు పొయెట్రీ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన ‘నీరై పారి పోయింది’ కావ్యాన్ని గూర్చి రాస్తూ ఆర్.ఎస్. సుదర్శనం ఇలా అంటారు: ‘‘ఈ కావ్యంలో కవితాభివ్యక్తి ప్రతీకల ద్వారా జరుగుతున్నది. ఆ పద్ధతి అంటే తనకెంత అభిమానమో ‘రక్తరేఖ’లో శేషేంద్ర శర్మ చాలా చోట్ల రాశాడు. ఆలంకారికులు సాహిత్య పరాకాష్ఠగా చెప్పే ధ్వని కంటే సింబాలిజం చాలా గొప్పది. అది ఒక విరాట్ స్వరూపం. అయితే ధ్వని దాని పాదం వరకే వస్తుంది. ధ్వని కేవలం ఒక శబ్ద శక్తి వ్యవహారం. కానీ సింబాలిజం ఒక దృగ్వ్యవహారం, సదసద్వివేక వ్యవహారం, వైదిక వ్యవహారం’. శేషేంద్ర రాసిన అన్ని కావ్యాల్లోలాగే ఈ కావ్యంలో కూడా ప్రతీకాత్మకత ప్రధానంగా దర్శన మిస్తుంది. గెరిల్లాను ఇంతగా హృదయంలోకి తీసుకొని, తన పితామహునిగా భావించి ఆకాశానికి ఎత్తేస్తూ రాసిన ఈ లఘుకావ్యంలోని విప్లవకాంక్షను విప్లవకవులు లేక విప్లవాభిమానులు గుర్తించారో లేదోగానీ అడుగడుగునా వాక్యం రసాత్మకం అనిపించే ఈ కావ్యాన్ని రచించిన శేషేంద్ర శర్మను మహాకవి అనటానికి ఎవరికీ సందేహం ఉండకూడదనుకుం టాను. ఆ మహాకవికి నా జోహార్లు! - అంపశయ్య నవీన్ వ్యాసకర్త ప్రముఖ రచయిత (మే 30న గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి) -
కావ్యం మీద తిరుగుబాటు నవల
సాహిత్య సభలకు ప్రజలు రారనే అపప్రదని ఈ ప్రపంచ తెలుగు మహాసభలు పటాపంచలు చేశాయని రచయిత అంపశయ్య నవీన్ వ్యాఖ్యానించారు. ఆయన అధ్యక్షతన తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో నవలా సాహిత్యంపై విస్తృతంగా చర్చ జరిగింది. కవిత్వం మీద చేసిన తిరుగుబాటు నవల అనీ, అంతకుముందున్న ప్రబంధాలూ, కావ్యాలూ కొన్ని వర్గాలకే సొంతం అయినా నవల అందరికీ సాహిత్యాన్ని చేరువ చేసిందని సదస్సు అభిప్రాయపడింది. యశోదారెడ్డి నవలల్లో తెలంగాణ గ్రామీణ భాష, యాస, శ్వాసలుగా నిలిచాయని వక్తలు ప్రశంసించారు. కాసుల ప్రతాపరెడ్డి నవలా సాహిత్యం– తొలిదశను వివరిస్తూ కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ తొలి నవల అన్నారు కానీ అది ఓ ఇంగ్లీషు నవలకి అనుసరణ మాత్రమేననీ, ఒద్దిరాజు∙సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి తొలి నవల అనీ అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణమూర్తి, అటవీశాఖా మంత్రి జోగు రామన్న, వి.శంకర్, త్రివేణి హాజరైన ఈ నవలా సాహిత్య సదస్సు మంచి నవలల ఆవశ్యకతను చాటిచెప్పింది. -
ఆయన సంకల్పబలం అద్భుతం
‘తెలంగాణ రాష్ట్రం ఆవి ర్భవించే వరకు మరణం నా దరిచేరదు’ అని సంక ల్పబలాన్ని చాటిన ధీశాలి భూపతి కృష్ణమూర్తి. ఆయన అన్నట్టే ప్రత్యేక రాష్ట్రంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇలాంటి అరుదైన చారిత్రక దృశ్యా లు కృష్ణమూర్తి జీవితంలో కొన్ని కనిపిస్తాయి. భార త స్వాతంత్య్రోద్యమాన్ని అహింసా పథంలో నడి పించిన గాంధీజీని ఆరాధిస్తూనే, హైదరాబాద్ సంస్థానంలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో తన వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించిన పోరాట శీలి ఆయన. 1946లో టి. హయగ్రీవాచారితో కలసి ఓరుగల్లు కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కృష్ణమూర్తిగారు, అదే సమయంలో రజాకార్ల దాష్టీ కాన్ని కూడా చవి చూశారు. మహాత్మాగాంధీతో, 1944లో ఆయన జన్మదినం అక్టోబర్ 2న వార్ధా ఆశ్ర మంలో గడిపే అరుదైన అవకాశం ఆయన పొం దారు. గాంధీజీ పిలుపునిచ్చిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2009లో ఇక్కడి పెద్దలు ఆయనకు ‘తెలంగాణ గాంధీ’ అని బిరుదునిచ్చి సత్కరించుకున్నారు. చివరికంటా గాంధేయవాది గానే జీవించిన కృష్ణమూర్తికి ఇది గొప్ప గౌరవం. తెలంగాణను చైతన్యవంతం చేసిన గ్రంథాలయో ద్యమంలో కూడా ఆయనది కీలకపాత్రే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ప్రారంభం నుంచి (1956 నుంచి) అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటివరకు కూడా ప్రత్యేక తెలంగాణ ఆశయాన్ని సడలించుకోని మహోన్నత వ్యక్తి భూపతి కృష్ణ మూర్తి. తెలంగాణను కోస్తాంధ్ర జిల్లాలతో కలపొ ద్దనీ, ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలనీ ఎవరు కలసి వచ్చినా రాకున్నా అవిశ్రాంతంగా పోరాటం చేశారా యన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అసం భవం, ఇక రాదేమోనని ఎందరో నిరాశ పడుతున్న సమయంలో ఆయన ఏనాడూ ధైర్యాన్ని కోల్పో లేదు. నిరాశపడనూ లేదు. 1968లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి తెలంగాణ వాదులలో మరోసారి ఆశను రేకెత్తించారు. వారిని ఏకం చేశారు. ‘నా జీవితకాలంలోనే తెలంగాణ రావాలి. నేను తెలంగాణను చూసిన తర్వాతనే చివరిశ్వాస విడుస్తా’ అని చెప్పేవారు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, సామల సదాశివ వంటి మహానుభావులు తాము జీవించి ఉండగా తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావాలని అనుకునేవారు. కానీ మన మధ్య ఉండగా వారి కల సాకారం కాలేదు. భూపతి కృష్ణమూర్తి సంకల్పబలం ఎంతగొప్పదంటే తాను చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణ వచ్చిన తరువాతనే వెళ్లిపోయి మాట నిలబెట్టుకున్నారు. 2014 సెప్టెంబర్ 9న కాళోజీ శతజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు నేనే స్వయంగా ఆయనను స్టేజీ పైకి తీసుకురావడం మంచి జ్ఞాపకం. ఆ వేదికపై ఆయనను సన్మానించాం. ప్రతి ఏడాది కాళోజీ పేరిట అందజేసే అవార్డును 2015 సంవత్సరానికి గానూ భూపతి కృష్ణమూర్తి గారికే ఇవ్వాలను కున్నాం. దురదృష్టం కొద్ది ఇంతలోనే ఆయన మరణ వార్త వినవలసి వచ్చింది. ఆయన సంకల్పబలానికి నా జోహార్లు. (వ్యాసకర్త ప్రముఖ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత) -
సాంస్కృతిక రంగానికి పూర్వవైభవం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : కళలకు ప్రోత్సాహం కరువవుతున్న తరుణంలో కాకతీయ ఉత్సవాల ద్వారా జిల్లాలో కళా, సాంస్కృతిక రంగాలకు పూర్వవైభవం లభిస్తోందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న సంగీత, నృత్య నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రదర్శనలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఓరుగల్లులో కళలకు కొదవలేదని అన్నారు. లలిత కళలు జనజీవితంలో పెనవేసుకుని అన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో కె.వెంకటరమణ, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓలలాడించిన డాక్టర్ శేషులత సంగీత, నృత్య నవరాత్రోత్సవాల్లో భాగంగా డాక్టర్ కె.శేషులత శాస్త్రీయ సంగీతంప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది. శష్ముఖ ప్రియ రాగంలో సిద్ది వినాయకం అనే ముత్తుస్వామి దీక్షతార్ కృతితో శేషులత తన గాత్రాన్ని ప్రారంభించారు. అనంతరం, హేమగిరి తనయో హేమలత్ అంచశుద్ద ధన్యాసి రాగంలో త్యాగరాజ కృతి, బంటురీతి కొలువు అనే కృతిని హంసపద రాగంలోనూ, నగుమోము అనే త్యాగరాయ కీర్తన అభేది రాగంలో ఇలా దాదాపు గంటన్నరపాటు తన శాస్త్రీయ సంగీత కార్యక్రమం జరిగింది. శేషులత గానానికి మృదంగం జయభాస్కర్, వయోలిన్ నందకుమార్, ఘఠంపై రవికుమార్ వాద్య సహకారం అందించారు. అనంతరం జయాపసేనాని నృత్యాలయం, చాతరాజు నవ్యజ బృందం చేసిన ఆలయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో పీవీ.మదన్మోహన్ పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు.. గురువారం సాయంత్రం 6 గంటలకు వద్దిరాజు నివేదిత శిష్య బృందంచే శాస్త్రీయ సంగీతం, హైదరాబాద్‌కు చెందిన ఎం.సురేంద్రనాథ్ బృందంచే కూచిపూడి నృత్యప్రదర్శన ఉంటాయి. అలాగే వరంగల్ కాకతీయ కళాక్షేత్రం వెంపటి నాగేశ్వరి బృందంచే శాస్త్రీయ నృత్యాలుంటాయని జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ కె.వెంకటరమణ తెలిపారు.