మతమేదైనా మహిళకు పోరే
తమిళ రచయిత్రి.. రాజకీయవేత్త.. అన్నిటికన్నా ముందు నాలుగు గోడల బందీ! టాల్‌స్టాయ్.. చింఘిజ్ ఐత్మతోవ్.. దాస్తోవ్‌స్కీ..
సంకెళ్లను తెంచేసుకునే ఆలోచనలిచ్చిన నేతలు! ఆ ధైర్యంతోనే బందీ ‘రజతి’ రచనల రెక్కలు విప్పుకొని స్వేచ్ఛా విహంగం ‘సల్మా’గా మారింది! ఈ రెండింటికి మధ్య నలిగిన ‘రొక్కయ్య’ కూడా ఉంది! సల్మాకు పోరాటాన్ని నేర్పిన వనిత.. ఆమె జర్నీ టు ఫ్రీడమ్‌కి స్ఫూర్తిప్రదాత! ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కవిసంగమం పొయెట్రీ ఫెస్టివల్‌కి సల్మా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పరిచయం తన మాటల్లోనే...
పుట్టింట్లో రజతి
అమ్మానాన్న పెట్టిన పేరు రజతి. మా సొంతూరు తిరుచ్చి దగ్గర్లోని తువరన్‌కురుచ్చి. పల్లెటూరు. ఆడపిల్లలు బయటకు వెళ్లకూడదనుకునే సంప్రదాయ ముస్లిం కుటుంబం. మట్టి గోడల మా ఇంటి చిన్న కిటికీ నాకు, అక్క (నజ్మా)కు బయటి ప్రపంచాన్ని చూపించేది. నాకేమో చదువంటే ప్రాణం. మా కజిన్‌తో ఊళ్లోని లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకొని చదివేదాన్ని. చిన్నపిల్లల కథల పుస్తకాలతో పాటు టాల్‌స్టాయ్, ఐత్మమతోవ్, దాస్తోవ్‌స్కీలనూ నాకు పరిచయం చేసింది ఆ లైబ్రరీయే! సాహిత్యాన్ని చదవడంతోనే సరిపెట్టుకోలేకపోయాను. మనసులోని భావాలను కాగితంమీద పరచాలనిపించింది. అలా నా పదిహేనవ యేట తొలి రచనకు శ్రీకారం చుట్టాను. గడపదాటి బయటకు వెళ్లకుండా నేనేం చేసినా మా పెద్దవాళ్లు అభ్యంతర పెట్టేవాళ్లు కాదు. నేను రాసిన కవితలను మా అమ్మ బాగా మెచ్చుకునేది. నాన్న వాటిని పత్రికలకు పోస్ట్ చేసేవాడు. అట్లా నా కవితలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా! నా కవిత్వాన్ని అంతలా ప్రోత్సహించిన అమ్మ నా పెళ్లి విషయంలో మాత్రం ఎందుకంత మొండిపట్టు పట్టిందో అర్థంకాలేదు. మా ఊళ్లోనే ఉంటున్న అబ్దుల్ మాలిక్ అనే అతనితో సంబంధం ఖాయం చేశారు. నాకిప్పుడప్పుడే పెళ్లొద్దు అని పట్టుబట్టినా అమ్మ మనసు కరగలేదు. తొమ్మిదో తరగతితోనే నా చదువు ఆగిపోయింది. మాలిక్‌తో నిఖా అయిపోయింది.
అత్తింట్లో రొక్కయ్య
నా రెండో పాత్ర. రజతి అనే నా పుట్టింటి పేరు ముస్లింపేరులా లేదని మా అత్తింటి వాళ్లు రొక్కయ్యగా మార్చారు నన్ను. అదే బందీ జీవితం.. గోడలు మారిందంతే! కాకపోతే మా ఇంట్లో నాకు నచ్చింది చదువుకొని, వచ్చింది రాసుకొనే స్వేచ్ఛ ఉండేది. ఇక్కడ అదీ లేదు. నా ప్రపంచం మరింత కుదించుకుపోయింది. ఏదైనా ఆలోచన రాగానే ఎవరికంటా పడకుండా పెన్ను, పేపర్ తీసుకొని బాత్రూమ్‌లోకి వెళ్లి రాసుకునేదాన్ని. ఆ కాగితాలను బాత్రూమ్‌లోనే దాచేదాన్ని. నన్ను చూడ్డానికి మా నాన్న వచ్చినప్పుడు దొంగతనంగా ఆయనకు ఈ కాగితాలు ఇచ్చేదాన్ని పత్రికలకు పోస్ట్‌చేయమని. ఊళ్లో మా ఆయన కాస్త పేరు, పలుకుబడి ఉన్న పొలిటికల్ లీడర్. రజతి పేరుతో పత్రికల్లో అచ్చయిన నా కవితల గురించి అతనికి తెలిసింది. అప్పటికే మాకిద్దరు పిల్లలు సలీం, నదీం. ఆడపిల్ల పుట్టలేదనే చింత ఇప్పటికీ! రాతలు ఆపేయమని చాలా గొడవపెట్టాడు మాలిక్. ఆయన, అత్తగారు వాళ్లంతా కలిసి పెద్ద యుద్ధమే చేశారు నాతో. నేను రాయడం మానేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు మాలిక్. నా మనసు రెక్కలు విరిగినట్టు ఫీలయ్యాను. ‘రజతి’ పేరుతో రాయడం మానేస్తాను అనుకున్నాను.
అజ్ఞాతంగా సల్మా
నా రచనాదాహం తీర్చుకోవడానికే సల్మా పుట్టింది! పొయిట్రీకే పరిమితమవకుండా ప్రోజ్‌కూడా రాయడం మొదలెట్టాను. ‘జిౌఠటట ఞ్చట్ట ఝజీఛీజీజజ్టి’ అనే నవలను రాశాను. దీన్ని మలయాళం, హిందీ, మరాఠీ, జర్మన్ భాషల్లోకి అనువదించారు. ఇది విమెన్ సెక్సువాలిటీకి సంబంధించింది. చాలా కాంట్రావర్స్ అయింది. ఇప్పుడు ‘టాయిలెట్’ అనే నవల రాస్తున్నాను. 2015లో రిలీజ్ అవుతుంది. ఇదీ ఉమన్ సబ్జెక్టే. దీన్నీ కాంట్రవర్సీ చేస్తారేమో! సల్మా.. నా వ్యక్తిత్వానికి ప్రతిరూపం. నా పోరాటానికి శక్తి. ఈ పేరుతో రాస్తున్నదీ నేనే అన్న విషయం కొన్నాళ్లకు మా ఆయనకు తెలిసింది. మళ్లీ చిన్నపాటి ఘర్షణ జరిగినా.. నా మొండితనం చూసి మిన్నకుండిపోయాడు. తర్వాత నుంచి వ్యతిరేకతా లేదు మద్దతూ లేదు. ఈ పరిణామక్రమంలోనే నా రాజకీయ ప్రవేశమూ జరిగింది.
నా జీవితమే నాకు స్ఫూర్తి. ముస్లిం, హిందూ అని తేడా లేకుండా ఏ మహిళ అయినా తన అస్తిత్వం కోసం పోరాడాల్సిందే. పేదరికం, నిరక్షరాస్యత మహిళలను అణచిపెట్టేస్తున్నాయి. వాటిని జయించాలి. మహిళలు చదువుకోవాలి, సాధికారత సాధించాలి. ముస్లిం మహిళల విషయానికి వస్తే.. ఇస్లాం ఎక్కడా ఆడవాళ్లు చదువుకోవద్దని చెప్పలేదు. చదువు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ప్రశ్నించడం నేర్పుతుంది. ఆ దిశగా మనం పయనించాలి!
నీరాజనాలు: ఈ తమిళ రచయిత్రి జీవితం ఆధారంగా ‘సల్మా’అనే తొంభై నిమిషాల డాక్యుమెంటరీ వచ్చింది. దీన్ని అమెరికాలోని పార్క్‌సిటీలో ఈమధ్యనే ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం సంభాషించడానికి వచ్చిన సల్మాకు ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్ లభించింది!
రజతి.. రొక్కయ్య.. సల్మా.. నా జీవితంలోని మూడు భిన్న పాత్రలు!
విభిన్న అనుభవాలు.. కాబట్టి ఈ మూడూ నా కిష్టమే!