అమ్మ పేరు పెట్టారని పింఛను ఆపేశారు
Published Mon, Dec 9 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
పాలకోడేరు, న్యూస్‌లైన్ :వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లు. ఇద్దరి పేర్లూ మరియమ్మ కావడం.. వారి పాలిట శాపమైంది. అధికారుల పుణ్యమాని కుమార్తె మరి యమ్మకు వికలాంగుల కోటాలో నెలనెలా ఇచ్చే రూ.500 పింఛను ఆగిపోయింది. ఇదేమని అధికారులను అడిగితే.. అదంతే అంటున్నారు. కుటుంబ పెద్ద మరణించాడు. తల్లికి ఒంట్లో శక్తి క్షీణించింది. ఏ పనీ చేయలేకపోతోంది. కుమార్తెను పోషించుకునే మార్గం లేక తల్లడిల్లిపోతోంది. వివరాల్లోకి వెళితే.. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన సన్నమండ్ర ఏసేబు కుమార్తె మరియమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. అతడు మరణించడంతో భార్య మరియమ్మకు రూ.200 వితంతు పిం ఛను ఇస్తున్నారు. ఆమె కుమార్తె మరియమ్మ వికలాంగురాలు కావడంతో గతంలో రూ. 500 పింఛను వచ్చేది.
ఆరు నెలల నుంచి ఆ మొత్తం ఇవ్వడం మానేశారు. ఆరాతీస్తే తల్లిపేరు, కుమార్తె పేరు ఒకటే కావడంతో ఆ యువతికి వికలాంగ పింఛను నిలిపివేసినట్టు తెలిసింది. ‘మా ఇంటాయన చనిపోయూడు. నా ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. కూలి పనులు చేయలేకపోతున్నాను. నా బిడ్డ వికలాంగురాలు. దానికొచ్చే పింఛను ఆగిపోయింది. నాకు ఇస్తున్న రూ. 200తో మేమిద్దరం ఎలా బతికేది’ అంటూ తల్లి మరియమ్మ విలపిస్తోంది. ఈ విషయమై గ్రామ కార్యదర్శి పి.నాగమణిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ఇద్దరి పేర్లు ఒకటే కావడం వల్ల గందరగోళం ఏర్పడి పింఛను నిలిచిపోయిందని చెప్పారు. వారిద్దరి ఆధార్ కార్డులను తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కారమయ్యే వరకూ సమరభేరి మోగించాలని ‘సాక్షి’ నిర్ణయించింది.
Advertisement
Advertisement