మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే | CM YS Jagan letters to women in thrift societies | Sakshi
Sakshi News home page

మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే

Published Wed, Apr 22 2020 3:01 AM | Last Updated on Wed, Apr 22 2020 10:40 AM

CM YS Jagan letters to women in thrift societies - Sakshi

పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం నా కళ్లారా చూశాను. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. ఆ మేరకు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చిరునవ్వుతో భరిస్తూ ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ అమలు చేయబోతుందని చెప్పటానికి ఈ లేఖ రాస్తున్నాను.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు లేఖ రాస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. 

అన్ని సంఘాల ఖాతాల్లో ఒకే క్షణంలో డబ్బులు జమ 
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ఒక బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.
► 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతాయి. ఏ పొదుపు సంఘానికి వడ్డీ డబ్బులు ఎంత జమ చేసిందన్న వివరాలను సీఎం మహిళలకు రాసిన లేఖలో తెలియజేస్తారు. 
► డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు.  
► దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. అయితే 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిధులివ్వక పోవడంతో ఈ పథకం ఆగిపోయింది.  


స్వయం సహాయక సంçఘాల అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ  

స్వయం సహాయక సంఘ అక్కచెల్లెమ్మలకు..
గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ గ్రేడ్‌ సంఘాలు కూడా బీ, సీ, డీ గ్రేడులకు పడిపోయి.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలను నా 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. 

పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేయబోతోంది. 

అంతే కాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన, నామినేషన్‌పై కాంట్రాక్టులు – నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నాను.
ఇట్లు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement