cfms
-
‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’
సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. CFMS ప్రకారం చెల్లించడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందన్నారు మంత్రి. టీడీపీ ప్రభుత్వ హయాంలో CFMS విధానం తీసుకొచ్చారన్నారు. ‘స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ద్వారా 2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. పన్నుల విధానంలో సంస్కరణలతో మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగింది. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం పనులు చేపడుతోంది. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో గత సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పై చర్చ జరిగింది. జీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలకి పవర్ పాయింట్ ద్వారా వివరించాం. పాత పెన్షన్ వల్ల కలిగే నష్టాలు...జిపిఎస్ ఉపయోగాలు వివరించాం. ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ సమావేశంలో కూడా కీలక అంశాలపై చర్చ జరగనుంది’ అని పేర్కొన్నారు. -
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్‌లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
సీఎఫ్ఎంఎస్ చెల్లింపుల కేసులో స్టే
సాక్షి, అమరావతి: గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.5.63 లక్షలను ఇప్పటికే చెల్లించామని ప్రభుత్వం చెబుతోందని, ఈ ఒక్క కారణంతోనే సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణ వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలన్న ఆదేశాలను మాత్రమే నిలుపుదల చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అప్పీల్‌పై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు నేపథ్యమిదీ.. ప్రకాశం జిల్లా దర్శిలోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన సామగ్రి సరఫరా చేసినందుకు గాను తనకు రూ.5.63 లక్షలను చెల్లించడం లేదని, ఈ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బండి సుబ్బారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల విచారణ జరిపారు. బిల్లును సంబంధిత శాఖ క్లియర్ చేసినా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయిందని పిటిషనర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. 2021లో ఆమోదించిన బిల్లును ఇప్పటివరకు ఎందుకు క్లియర్ చేయలేదో తెలుసుకునేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు రావత్ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఆ నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్లో నిధులు లేవని, అందుకే చెల్లింపులు జరగలేదని రావత్ వివరించారు. ఇంత చిన్న మొత్తం చెల్లించేందుకు డబ్బు లేదనడం రాష్ట్ర ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రావత్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. అత్యవసర అప్పీల్ దాఖలు చేసిన రావత్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. రావత్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 15వ తేదీనే పిటిషనర్‌కు రూ.5.63 లక్షల్ని ప్రభుత్వం చెల్లించేసిందని వివరించారు. పిటిషనర్ కేవలం తన బిల్లు చెల్లింపు కోసమే పిటిషన్ వేశారని, కానీ.. న్యాయమూర్తి మాత్రం ఆ పిటిషన్ పరిధిని దాటి సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపుల వివరాలు కోరారని తెలిపారు. కేవలం ఆ నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్లో మాత్రమే నిధులు లేవని చెప్పారే తప్ప ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం సుబ్బారెడ్డి తరఫు న్యాయవాదిని వివరాలు కోరింది. ఆయన కూడా అదే విషయం చెప్పడంతో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం.. అప్పీల్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఎక్కడి జీతాలు అక్కడే..
మహారాణిపేట (విశాఖ దక్షిణ): జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఉద్యోగులకు అక్కడే జీతాలు ఇచ్చే పద్ధతికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిలాల్లగా విభజించి పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రెండు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల నుంచి స్థానిక ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల ట్రెజరీలకు కోడ్ కేటాయించారు. ఆ కోడ్ ప్రకారం వచ్చే బిల్లులను ట్రెజరీ సిబ్బంది సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. మంగళవారం నాటికి అన్ని బిల్లులు అప్లోడ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్న సమయంలో మొత్తం 91 ప్రభుత్వ శాఖలు ఉండేవి. ఇందులో మొత్తం 33,718మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసేవారు. 1299 మంది డీడీఓలు జీతాల ప్రక్రియ బిల్లులు పూర్తి చేసి ట్రెజరీకి పంపేవారు. అనకాపల్లి జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2100 మంది పనిచేస్తున్నారు. విభజన జిల్లాల్లోని ఉద్యోగులు, అధికారుల జీతాల బిల్లులు అక్కడే ఇవ్వగా, రిటైర్ అయిన ఉద్యోగుల పింఛన్లు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి ఇస్తున్నారు. విశాఖ జిల్లాకు 0201, అనకాపల్లి జిల్లాకు 90000039469, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 90000039468 కోడ్ నంబర్లుగా కేటాయించారు. సబ్ ట్రెజరీలు ఇవే.. విశాఖ జిల్లాలో సీతమ్మధార, భీమునిపట్నంలలో సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ఈస్టు, అనకాపల్లి వెస్టు, చోడవరం, యలమంచిలి, కోటవురట్ల, మాడుగుల, నక్కపల్లి, నర్సీపట్నం సబ్ ట్రెజరీలు ఉన్నాయి. అల్లూరి జిల్లా పరిధిలో పాడేరు, అరకు, చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరు సబ్ ట్రెజరీలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో అక్కడే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రకారం ఈ నెల నుంచి జీతాలు వస్తాయని విశాఖపట్నం జిల్లా ట్రెజరీ అధికారి టి.శివరామ ప్రసాద్ చెప్పారు. (చదవండి: అడ్డాకులకు అదిరే ధర) -
రైటర్లు రాసిన స్కామ్.. 10 మంది సబ్ రిజిస్ట్రార్లపై వేటు
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు.. 2021 మే 31.. గుడివాడకు చెందిన దారం మాణిక్యాలరావు మండవల్లి మండలం పోలుకొండలో ఎకరం భూమి కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్‌ను కలిశాడు. ఆ భూమి విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.90,250 కట్టాలని చెప్పడంతో ఆ డబ్బులు మాణిక్యాలరావు ఇచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ సీఎఫ్ఎంఎస్లో జమయ్యేలా ఆన్లైన్లో చలానా కట్టాడు. రూ.78,000, రూ.12,000, రూ.250 చొప్పున మూడు చలాన్ల ప్రింటవుట్లు తీసి డాక్యుమెంట్‌తో కలిపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపాడు. సబ్ రిజిస్ట్రార్ ఆ చలాన్ల ప్రింట్లు చూసి మొత్తం సొమ్ము కట్టినట్లు నిర్థారించుకుని రిజిస్ట్రేషన్ చేసేశారు. పని పూర్తయిపోయింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట కానీ అక్కడ వాస్తవానికేం జరిగిందో తెలుసా..? చలాన్లు కట్టేటపుడే ఆ డాక్యుమెంట్ రైటర్ అతిపెద్ద కుట్రకు తెరతీశాడు. రూ.78,000 జమ చేసినట్లు మాణిక్యాలరావుకు ప్రింటవుట్ ఇచ్చినా... నిజానికి తను ఆన్లైన్లో చెల్లించింది రూ.780 మాత్రమే. కానీ కంప్యూటర్లో ఆ చలాన్ పీడీఎఫ్ కాపీని మార్ఫింగ్ చేశాడు. 780 పక్కన రెండు సున్నాలు చుట్టి రూ.78,000 చేసేశాడు. అదే ప్రింటవుట్‌ను తీసిచ్చాడు. దాన్నే సబ్ రిజిష్ట్రార్‌కు పంపాడు. మరి సబ్ రిజిష్ట్రార్ ఎలా నమ్మారు? దాన్నెలా నిర్ధారించుకున్నారు? ఈ ప్రశ్నలు సహజం. అటు సీఎఫ్ఎంఎస్కు రకరకాల చెల్లింపులు వస్తుంటాయి కాబట్టి అక్కడెవరికీ వాస్తవంగా రావాల్సిందెంతో...ఎంత వచ్చిందో తెలిసే అవకాశం లేదు. సీఎఫ్ఎంఎస్కు నిజంగా ఎంత చెల్లించారో ఆన్లైన్లో చూసే అవకాశం ఈ సబ్ రిజిస్ట్రార్‌కు లేదు. ఇదిగో... ఈ వీక్పాయింట్నే డాక్యుమెంట్ రైటర్లు పట్టుకున్నారు. చలాన్లలో తాము చెల్లించిన సొమ్ము పక్కన సున్నాలు పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. ఆ డబ్బులన్నీ మింగేశారు. ఇలా ఒక్కరు కాదు... ఒక చోట కూడా కాదు. డాక్యుమెంట్ రైటర్ల నెట్వర్క్ ఒకరి నుంచి మరొకరు ఈ మోసం ఎలా చేయాలో తెలుసుకున్నారు. అంతా గూడుపుఠానీ జరిపి కోట్లు కాజేశారు. తాజాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు జరపటంతో ఈ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎందుకు తెలుసుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో అధికారగణం కదిలింది. ఇకపై ఇలాంటి మోసాలు జరగక్కుండా ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తేవటమే కాక... ఇప్పటివరకూ జరిగిన అక్రమ లావాదేవీలపై దృష్టిపెట్టింది. సబ్ రిజిస్ట్రార్లపైనా వేటు పడుతోంది. పోయిన సొమ్ము సైతం కొంత కొంతగా రికవరీ అవుతోంది. మున్ముందు మరింత భారీగా తనిఖీలు జరుపుతామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ కుంభకోణం పూర్వాపరాలివీ... రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన ఈ కుంభకోణంలో ఇప్పటిదాకా రూ.5.85 కోట్లు పక్కదారి పట్టినట్లు తనిఖీల్లో వెల్లడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నకిలీ చలాన్ల బాగోతం వెలుగు చూసింది. ఒక్కొక్క కార్యాలయాన్నీ తనిఖీ చేస్తున్న కొద్దీ ఇది ఒక్కచోటికే పరిమితం కాలేదని, పలు ప్రాంతాలకు వ్యాపించిందని వెల్లడయింది. వ్యవహారం బయటపడ్డ వెంటనే అధికారులపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే లోపాలు సరిదిద్దాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి గండి పడిన ఆదాయాన్ని రికవరీ చేయాలని కూడాస్పష్టం చేశారాయన. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చురుగ్గా కదిలి డొంక మొత్తాన్ని కదిలించారు. రోజుల వ్యవధిలోనే కొన్ని లక్షల డాక్యుమెంట్లను పరిశీలించారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు దారి మళ్లినట్లు కనుగొన్న మొత్తంలో ఇప్పటికే 2.86 కోట్లను రికవరీ చేశారు. ఇందులో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని తేలటంతో 10 మందిని సస్పెండ్ చేశారు. 12 క్రిమినల్ కేసులు పెట్టారు. అంతేకాదు! స్కామ్‌కు సూత్రధారులుగా ఉన్న పలువురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేయించారు. మొదట ఈ వ్యవహారం కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయటపడగా... అనుమానం వచ్చిన రిజిష్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం పలుచోట్ల తనిఖీలు జరపడంతో మరిన్ని చోట్ల అక్రమాలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖ జిల్లా నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, కృష్ణాజిల్లా గాంధీనగర్, నందిగామ, గుణదల, పటమట, మండవల్లి, గుంటూరు జిల్లా మంగళగిరి, వైఎస్సార్ కడప జిల్లా కడప, కడప రూరల్, కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మార్ఫింగ్ వ్యవహారాలు బయటపడ్డాయి. అత్యధికంగా కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు వెల్లడయింది. చదవండి: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు సీఎఫ్‌ఎంఎస్‌తో కార్డ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థకి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్) వ్యవస్థను పూర్తిగా అనుసంధానం చేయకపోవటమే ఈ కుంభకోణానికి కారణమైంది. ఎందుకంటే సీఎఫ్ఎంఎస్కు చలాన్ల ద్వారా ఎంత చెల్లించారన్నది సబ్ రిజిస్ట్రార్లకు కనిపించదు. భౌతికంగా తమ చేతికి వచ్చిన ప్రింటవుట్‌ను చూసి వారు నిర్ధారించుకునేవారు. ఇక్కడే డాక్యుమెంట్ రైటర్లు బడా మోసానికి తెరతీశారు. తాజా కుంభకోణం నేపథ్యంలో ఈ తప్పు మళ్లీ జరక్కుండా వెంటనే సీఎఫ్‌ఎంఎస్‌కి చెల్లించే ఛలానాలు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ సిస్టమ్‌లో కనపడేలా నెట్వర్క్ని అనుసంధానించారు. తొలుత కార్వేటి నగరం, కుప్పం, చీరాల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 294 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీంతో తమ చేతిలో ఉన్న చలానా నెంబరు ప్రకారం అందులో పేర్కొన్న సొమ్ము సీఎఫ్ఎంఎస్కు జమయిందో లేదో రియల్‌టైమ్‌లో నిర్ధారించుకునే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు వచ్చింది. తేడాలేమైనా ఉంటే అక్కడే పట్టేసుకోవచ్చు. డాక్యుమెంట్ రైటర్ల నెట్వర్కే మూలం!! ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు డాక్యుమెంట్ రైటర్లేనని స్పష్టంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల వారికి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే ఆపరేటర్లు, సిబ్బంది తోడయ్యారు. అక్కడక్కడా సబ్ రిజిస్ట్రార్లు కూడా వారితో చేయి కలిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిజానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లదే హవా. ఎవరైనా వారి దగ్గరకే వెళ్లాలి. డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, చలానాలు తీయడం వంటి పనులు కష్టంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే సాధారణ వ్యక్తులు వీరిపైనే ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అధికారులను కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మెల్లగా వీళ్లంతా ఒక నెట్వర్క్లా కూడా తయారయ్యారు. అందుకే చలానాల మార్ఫింగ్ కుంభకోణం ఒక్కచోటకే పరిమితం కాకుండా... అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. అధికారులు చురుగ్గా తనిఖీలు చేస్తుండటంతో ఇపుడు అక్రమార్కుల గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లోనూ చేపడతామని, రాండమ్‌గా భారీ ఎత్తున డాక్యుమెంట్లను తనిఖీ చేస్తామని, అవసరమైన చోట విస్తృత స్థాయి తనిఖీలకు దిగుతామని అధికారులు చెబుతున్నారు. ఇక అవకతవకలకు ఆస్కారం ఉండదు – ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఛలానాల మార్ఫింగ్ వ్యవహారం బయటపడగానే అప్రమత్తమయ్యాం. అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేసి అక్రమాలు గుర్తించాం. వెంటనే కార్డ్ సిస్టమ్‌లో ఛలానాలు కనపడేలా మార్పులు చేశాం. ఇకపై మార్ఫింగ్‌కు అవకాశం ఉండదు. వాస్తవానికి గతంలోనే ఈ మార్పులు చేయాలని పైలెట్ ప్రాజెక్టు చేపట్టాం. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఈలోపు ఈ వ్యవహారాలు బయటపడడంతో ఎన్ఐసీ ద్వారా వెంటనే సీఎఫ్ఎంఎస్ ఛలానాల సాఫ్ట్‌వేర్‌ని కార్డ్ సిస్టమ్‌కి అనుసంధానించాం. -
రిజిస్ట్రేషన్ల చలానాలు సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల నిమిత్తం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించే చలానాలను నేరుగా సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)కు అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషగిరిబాబు తెలిపారు. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తొలుత కుప్పం, కార్వేటినగరం, చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీని అమలును పైలెట్‌గా చేపట్టారు. సోమవారం నుంచి అన్ని కార్యాలయాల్లోనూ అమల్లోకి తెచ్చారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసి కడపలో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించారు. ఈ విషయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకులో చలానా తీసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక కొందరు మళ్లీ దాన్ని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మాన్యువల్‌గా చలానాను స్వీకరించడం, దాన్ని పీడీఎఫ్‌గా అప్లోడ్ చేసే క్రమంలో దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే చలానాలు కట్టి రిజిస్ట్రేషన్‌కు రాకుండా వేచి ఉండేవారి చలానాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు చలానాలను నేరుగా సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేయడంతో ఇలాంటి తప్పులకు అవకాశం ఉండదని శేషగిరిబాబు వివరించారు. -
వారంలోగా సర్పంచ్‌లకు చెక్ పవర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్‌లుగా గెలిచిన వారందరికీ చెక్ పవర్‌ను బదలాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్ల వివరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)లో నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుందని.. వారంలోగా సర్పంచ్‌లందరికీ చెక్ పవర్ కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. సీఎఫ్ఎంఎస్లో వివరాల నమోదుకు ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్ల గెలుపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్ సిగ్నేచర్‌ను అన్ని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ వివరాల నమోదు పూర్తయ్యాక జిల్లా ట్రెజరీ అధికారులు ఆమోదముద్ర వేయాలి. కాగా, గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా 2018 ఆగస్టు నుంచి ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన విషయం తెలిసిందే. ఏ గ్రామ పంచాయతీకి ఏ అధికారి ప్రత్యేకాధికారిగా కొనసాగారో వారికే చెక్ పవర్ అధికారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్ 3న పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్ పవర్‌ను బదలాయించే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ వేగవంతం చేసింది. -
పేదలకు అండగా..
-
మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే
పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం నా కళ్లారా చూశాను. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. ఆ మేరకు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చిరునవ్వుతో భరిస్తూ ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ అమలు చేయబోతుందని చెప్పటానికి ఈ లేఖ రాస్తున్నాను. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు లేఖ రాస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. అన్ని సంఘాల ఖాతాల్లో ఒకే క్షణంలో డబ్బులు జమ ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి 24వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ఒక బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. ► 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతాయి. ఏ పొదుపు సంఘానికి వడ్డీ డబ్బులు ఎంత జమ చేసిందన్న వివరాలను సీఎం మహిళలకు రాసిన లేఖలో తెలియజేస్తారు. ► డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. అయితే 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిధులివ్వక పోవడంతో ఈ పథకం ఆగిపోయింది. స్వయం సహాయక సంçఘాల అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ స్వయం సహాయక సంఘ అక్కచెల్లెమ్మలకు.. గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ గ్రేడ్ సంఘాలు కూడా బీ, సీ, డీ గ్రేడులకు పడిపోయి.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలను నా 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేయబోతోంది. అంతే కాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన, నామినేషన్‌పై కాంట్రాక్టులు – నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ -
సీఎఫ్ఎంఎస్ మాయాజాలం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో కొత్త కొత్త అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఒకే బిల్లుకు పలుమార్లు చెల్లింపులు చేయడం దుమారం రేపుతోంది. తొలుత రూ.200 కోట్ల మేర మాత్రమే ఒకే బిల్లుకు పలుమార్లు చెల్లింపులు చేసినట్టు బయటపడింది. అయితే.. లోతుగా పరిశీలించగా పలు రంగాలకు చెందిన బిల్లులకు ఇలా ఏకంగా రూ.1800 కోట్ల మేర చెల్లింపులు సాగినట్లు సీఎఫ్ఎంస్ వర్గాలే చెబుతున్నాయి. ఒకసారి పేమెంట్ బటన్ నొక్కితే అత్యధికంగా 42సార్లు చెల్లింపులు జరిగినట్లు వివరిస్తున్నాయి. ఉదాహరణకు మత్య్స శాఖలో రూ.65 లక్షలకు గాను సుమారు 50 బిల్లులను పెడితే అవి 2000 బిల్లులుగా దాదాపు రూ.6 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని అంటున్నాయి. ఈ మొత్తం పలువురు కాంట్రాక్టర్లకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు కూడా చెబుతుండటం గమనార్హం. ఇలాంటి అక్రమ చెల్లింపులు జరిగి నెలలు కావస్తున్నా తిరిగి ఆ మొత్తం ఖజానాకు జమ కాలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పారదర్శకత కోసం వందల కోట్ల రూపాయల వ్యయం చేసి సీఎఫ్ఎంఎస్ను తీసుకొస్తే పారదర్శకతకు అర్థమే లేకుండా పోతోందని వాపోతున్నాయి. అక్కడ అసలు ఏమి జరుగుతోందో ఆర్థిక శాఖ రెగ్యులర్ ఉద్యోగులకు కూడా తెలియడం లేదని చెబుతున్నాయి. కమీషన్లు ఇచ్చినవారికే బిల్లుల చెల్లింపు సీఎఫ్ఎంఎస్లో 65 మంది పనిచేయడానికి మాత్రమే అనుమతి ఉండగా ప్రస్తుతం 250 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సీఈవో తనకు నచ్చినవారిని నియమించేసుకున్నారు. సీఎఫ్ఎంఎస్కు ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున బడ్జెట్ కేటాయించారు. సీఎఫ్ఎంఎస్ ఏర్పాటై మూడేళ్లయినా ఆశించిన స్థాయిలో ఈ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్నికల ముందు ఒక విధానం లేకుండా చంద్రబాబు చెప్పినవారికి, అలాగే కమీషన్లు ఇచ్చినవారికి మాత్రమే బిల్లులను చెల్లించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. రాష్ట్ర ఖజానాను చంద్రబాబు సొంత ఖజానాగా వాడేసుకున్నారు. ఇందుకు సీఎఫ్ఎంఎస్ సీఈవోతోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శులు సహకారం అందించారు. ఒకే బిల్లులకు పలుమార్లు చెల్లింపులు జరగడం, ఆ మొత్తం ఇంకా ఖజానాకు వెనక్కు రాకపోవడం, పారదర్శకత లేకుండా అంతా గోప్యంగా ఉంచడంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆర్థిక శాఖ వర్గాలు కోరుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ను ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల నుంచి తొలగించి రెగ్యులర్ ఉద్యోగుల కిందకు తీసుకొస్తే తప్ప జవాబుదారీతనం, పారదర్శకత రాదని అంటున్నాయి. గత రెండేళ్ల సీఎఫ్ఎంఎస్ లావాదేవీలపై ప్రభుత్వం విచారణకు లేదా ఆడిట్‌కు ఆదేశించి, అక్రమాలను బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ‘సాప్’ పేరుతో కోట్ల రూపాయలను వ్యయం చేసిన సీఈవో.. ఇప్పుడు నిరుద్యోగులకు శిక్షణ పేరుతో మరిన్ని నిధులు కాజేసేందుకు ఎత్తుగడ వేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎఫ్ఎంఎస్ కారణంగా అన్ని శాఖలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గోల్మాల్ జరిగిందంటున్న ఆర్థిక శాఖ వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినప్పటికీ సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికీ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగానే ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయని అంటున్నాయి. అయితే.. ఎవరికి ఎంత చెల్లించింది తెలియకుండా గుట్టుగా ఉంచుతున్నారంటే ఇందులో ఏదో గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని చెబుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ సీఈవోగా ప్రైవేట్ వ్యక్తిని నియమించడంతో ఆయన ఇష్టానుసారం తనకు కావాల్సిన వారిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకున్నారని వివరిస్తున్నాయి. ఆర్థిక శాఖలో ఉన్నతాధికారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సీఈవో ఇష్టారాజ్యంగా సీఎఫ్ఎంఎస్ను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ రెగ్యులర్ ఉద్యోగులను కూడా పక్కన పెట్టేసి ప్రైవేట్ రాజ్యంగా సీఎఫ్ఎంఎస్ను కొనసాగిస్తున్నారని మండిపడుతున్నాయి. -
జడ్జీలకూ ఝలక్!
కోడూరు చైతన్య.. బెంగళూరులోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. సొంతూరు విజయవాడ వస్తుండగా 2012లో చిలకలూరిపేట వద్ద లారీ ఢీ కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కనీసం కూర్చోలేరు. ఏం కావాలన్నా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఈ పరిస్థితుల్లో భర్త కూడా దూరమయ్యారు. ప్రమాద బీమా కోసం న్యాయ పోరాటం చేశారు. 2017లో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ రూ.65 లక్షలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. బీమా కంపెనీ పీడీ ఖాతాలో జమ చేసిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో ఇప్పటివరకు ఆమెకు పరిహారం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ దీనయ్య 2003లో ప్రమాదానికి గురయ్యాడు. కింది కోర్టు రూ.1.20 లక్షలను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. బాధితుడు హైకోర్టులో పోరాటం చేయడంతో పరిహారం మొత్తాన్ని న్యాయస్థానం రూ.1.50 లక్షలకు పెంచింది. 2017లో కోర్టు దీనయ్యకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని జడ్జీ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం ఆ డబ్బులను సొంతానికి వాడుకోవడంతో దీనయ్యకు ఒక్క పైసా కూడా అందలేదు. విశాఖకు చెందిన సుబ్బారావు దంపతుల కుమారుడు, కోడలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనువడు, మనవరాలిని పోషించే భారం వారిపైనే పడింది. పరిహారం కింద రూ.42 లక్షలు చెల్లించాలన్న కోర్టు ఆదేశాల మేరకు బీమా కంపెనీ ఆ డబ్బును జిల్లా జడ్జి ఖాతాల్లో జమ చేసింది. అయితే పరిహారం డబ్బులను కూడా ప్రభుత్వం తన్నుకుపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాక్షి, అమరావతి: సాఫీగా సాగిపోతున్న ప్రమాద బీమా పరిహారం చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం సంక్లిష్టంగా మార్చేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం ద్వారా కోర్టు ఉత్తర్వుల మేరకు బీమా కంపెనీలు అందచేసిన పరిహారం సొమ్ము దాదాపు రూ.400 కోట్లకుపైగా పరిహారాన్ని బాధితులకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల బారినపడి జీవనోపాధి, కుటుంబ సభ్యులను పోగొట్టున్న బాధితులు ఎంతో మంది ఉన్నారు. వీరు పరిహారం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సానుకూల ఉత్తర్వులు పొందినా రాష్ట్ర ప్రభుత్వం కనికరించకపోవడంతో గత డిసెంబర్ నుంచి డబ్బులు పొందలేకపోతున్నారు. పరిహారం సొమ్ము ప్రభుత్వానిది కాదు.. వాస్తవానికి ప్రమాద బీమా పరిహారం చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రమాద బీమా కేసులు కోర్టుకు, బీమా కంపెనీలకు, బాధితులకు మాత్రమే సంబంధించినవి. బీమా కంపెనీలు జిల్లా జడ్జీల నియంత్రణలో ఉండే ఖాతాల్లో డబ్బు జమ చేస్తాయి. కక్షిదారులు కూడా కోర్టు ఫీజుల కింద జడ్జీల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఖాతాల్లోకి ఎంత డబ్బు వచ్చింది? ఎంత వెళ్లిందనే విషయాలను ట్రెజరీ విభాగం పరిశీలిస్తుంది. ఎన్నికల ముందు రూ.వందల కోట్లు దారి మళ్లింపు.. ఎన్నికల ముందు ఈ ఖాతాల్లోని సొమ్ములపై కన్నేసిన టీడీపీ సర్కారు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)ను అడ్డం పెట్టుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు దీని ద్వారా జడ్జీల ఖాతాలన్నింటినీ స్తంభింప చేసి రూ.వందల కోట్లను దారి మళ్లించింది. కోటరీ కాంట్రాక్టర్లకు, ఎన్నికల తాయితాల కోసం పందేరం చేసింది. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు బాధితులు, న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఏ ప్రభుత్వమూ ఈ సొమ్మును తాకలేదు.. జడ్జీల పేరు మీద ఉండే ఖాతాల్లోని డబ్బు సర్కారుది కాదు. అదంతా కక్షిదారులు, బీమా కంపెనీలు జమ చేసిన సొమ్ము. దానికీ, ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకున్నా అక్రమ పద్ధతుల్లో సీఎఫ్ఎంసీ ద్వారా ఇష్టానుసారంగా ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమాద బీమా పరిహారం సొమ్ము జోలికి వెళ్లలేదని విశ్రాంత న్యాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం డబ్బులను ప్రభుత్వం సొంత సొమ్ములా ఖర్చు చేయడమే కాకుండా తిరిగి చెల్లించకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో.. ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో ఓ కక్షిదారుడి తరఫున రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, మోటారు వాహనాల ప్రమాద కేసుల్లో అనుభవజ్ఞుడైన వొట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి ఈ వ్యవహారాన్ని తెచ్చారు. మద్దు ఈశ్వర్‌రెడ్డి అనే కక్షిదారుడికి కోర్టు ఆదేశాల మేరకు పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ దీనిపై వివరణకు ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై ఈశ్వర్‌రెడ్డికి పరిహారం చెల్లించారు. ఇలా ఎంతమంది కక్షిదారులు ఈశ్వర్రెడ్డిలా తిరిగి న్యాయపోరాటం చేయగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి పరిహార ఉత్తర్వులు పొందిన బాధితులు మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించలేక కుమిలిపోతున్నారు. దీనిపై సీఎఫ్ఎంఎస్ అధికారుల వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు. కోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించడం లేదు న్యాయాన్యాయాలను చెప్పే న్యాయస్థానాలకే అన్యాయం జరుగుతోంది. కోర్టు తీర్పులను ప్రభుత్వమే గౌరవించడం లేదు. బాధితుల కోసం బీమా కంపెనీలు ఇచ్చిన సొమ్మును దారి మళ్లించడం దుర్మార్గం. ప్రభుత్వం శృతిమించి జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బాధితులకు న్యాయం చేసేందుకు మోటారు వాహనాల చట్టాన్ని తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల లక్ష్యం నీరుగారుతోంది. కక్షిదారులకు చెల్లించాల్సిన డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడం దారుణం. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. – వి.బ్రహ్మారెడ్డి (ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు) -
కళ్లు మూసుకుని ‘బిల్లులు’ పాస్
సాక్షి, అమరావతి: సాక్షాత్తూ శాసనసభ ఆమోదించిన గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు అసెంబ్లీ ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కూడా అదే దుర్గతి పట్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు ఉన్న వాటికి రెగ్యులర్‌గా విడుదల చేయాల్సిన బిల్లులను నిలుపుదల చేయించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు బడ్జెట్ కేటాయింపులు లేని వాటికి సైతం బిల్లులను చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో రెగ్యులర్ బిల్లులను నిలిపివేసి, చంద్రబాబు సూచించిన రంగాల బిల్లులనే అధికారులు చెల్లించారు. దీంతో రెగ్యులర్‌గా చెల్లించాల్సిన రంగాల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిలో హోంగార్డుల వేతనాలు, డైట్ చార్జీలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) తదితర అత్యవసర రంగాల బిల్లులు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాల్సిన రూ.15 వేల కోట్ల బిల్లులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదిలీ అయ్యాయి. ఈ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ కార్యదర్శులు పీయూష్ కుమార్, సత్యనారాయణ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్), ట్రెజరీ, పేఅండ్‌అకౌంట్ ఆఫీస్, వర్క్ అండ్ ప్రాజెక్టు కార్యాలయ అధికారులతో మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత బడ్జెట్ నుంచి కొత్త కేటాయింపులు వద్దు గత ఆర్థిక సంవత్సరంలో నిధుల మళ్లింపు కారణంగా పెండింగ్‌లో పడిన బిల్లులు మొత్తం రూ.15 వేల కోట్లు ఉన్నాయని సమీక్షలో తేల్చారు. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన పెండింగ్ బిల్లున్నింటినీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించారు. ఇప్పుడు ఆ రూ.15 వేల కోట్ల బిల్లులు చెల్లింపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆదేశించారు. ఆ బిల్లులు చెల్లింపునకు ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా లేదా అనేది పరిశీలించాలన్నారు. కేటాయింపులు సరిపోని పక్షంలో అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయరాదని వెల్లడించారు. కొత్త బడ్జెట్ నుంచి పాత బడ్జెట్‌కు చెందిన బిల్లులు చెల్లించడానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. తిరస్కరించిన బిల్లులు మళ్లీ వచ్చాయెందుకు? కొన్ని రంగాలకు సంబంధించి డబుల్ బిల్లులు రావడాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శలు తప్పుపట్టారు. సరిగ్గా పరిశీలన(స్క్రూటినీ) చేయకుండానే బిల్లులను పంపిస్తున్నారని, అందువల్లే డబుల్ పేమెంట్లు జరిగాయని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపులో మార్చి నెలలో వచ్చిన రూ.8 వేల కోట్ల బిల్లులను తిరస్కరించామని, ఈ బిల్లులన్నీ మళ్లీ చెల్లింపుల కోసం వచ్చేశాయని పేర్కొన్నారు. బిల్లులను తిరస్కరించి నెల రోజులు కాకుండానే మళ్లీ ఎలా తిరిగి వచ్చాయని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆయా విభాగాల అధికారులను ప్రశ్నించారు. వీటిపై మరోసారి స్క్రూటినీ చేయాలని సూచించారు. కేంద్ర పథకాలకు మొండిచెయ్యి గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించిందని సమీక్షలో తేల్చారు. ఇప్పుడు ఆ రూ.3,000 కోట్లతోపాటు రాష్ట్ర వాటాను కూడా జోడించి ఆయా పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకే బడ్జెట్ కేటాయింపులు ఉండడంతో నిధులు సరిపోవని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాలకు నిధుల విడుదలను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలకు నిధులు వ్యయం చేసి, వినియోగ పత్రాలు సమర్పిస్తే గానీ తదుపరి నిధులను కేంద్ర సర్కారు విడుదల చేయదు. ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులను మరో ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దుస్థితి గతంలో ఎన్నడూ రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి తన సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని చెబుతున్నాయి. రూ.కోట్లు ఖర్చు చేసినా ‘సీఎఫ్ఎంఎస్’ నిష్ఫలమే! రూ.వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ఇప్పటికీ అక్కరకు రాలేదు. సీఎఫ్ఎంఎస్ పేరుతో ఇప్పటికే రూ.400 కోట్లు వ్యయం చేశారని, ఇప్పుడు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎఫ్ఎంఎస్ పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా లేదని ఆర్థిక శాఖ ఉద్యోగులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత మూడు బడ్జెట్ల చెల్లింపులను సీఎఫ్ఎంఎస్లోనే చేస్తామని చెబుతూ వచ్చినప్పటికీ ఆఖరికి పాత గుడ్ గవర్నెన్స్ పోగ్రామ్‌లోనే చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా మార్చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ పనితీరుపై ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మే 2న అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించాలని ఆర్థిక శాఖకార్యదర్శులు పీయూష్ కుమార్, సత్యనారాయణ నిర్ణయించారు. అయితే, అన్ని శాఖల కార్యదర్శులతో ఒకేసారి సమావేశం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, అందుకే నాలుగు విడతలుగా ఆర్థిక శాఖలోనే అంతర్గత సమావేశాలను నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. -
సీఎఫ్ఎంఎస్ పనితీరు ఇలాగేనా?
సాక్షి, అమరావతి: సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతోపాటు ఉద్యోగులకు వేతనాలు ఇంకా అందలేదని ఫిర్యాదులు రావడంతో వారం రోజుల వ్యవధిలోనే సీఎస్ రెండోసారి మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించడం, తరుచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడంపై సీఎస్ ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం తదితర అంశాలపై సమీక్షించారు. తరుచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో వివక్ష వద్దు తొలుత ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని, అలాగే రీపేమెంట్లు సకాలంలో చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 22వ తేదీ నాటికి రూ.17,413 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ పేర్కొన్నారు. అత్యవసర బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలోనే బిల్లులు చెల్లించాలని, ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపరాదని తేల్చిచెప్పారు. సీఎఫ్ఎంఎస్ సమస్య వల్ల బిల్లులు అందడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పనితీరు ఇలాగేనా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. -
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఖజానా తాళం!
సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకతను కాపాడేందుకు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనైతిక చర్యలకు, కమీషన్లు దండుకోవడానికి వాడుకుంటోంది. టెక్నాలజీ పేరుతో ప్రభుత్వ ఫైళ్లు, బిల్లుల చెల్లింపులను ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టేసింది. సదరు ప్రైవేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. అందిన చోటల్లా కమీషన్లు మింగేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్) పేరిట సాగుతున్న అవినీతి అంతా ఇంతా కాదు. ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శులకు కూడా ఏం జరుగుతోందో తెలియకుండా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టడం ఎంత ప్రమాదమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లావాదేవీల్లో గోల్మాల్ ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు, పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థను(సీఎఫ్ఎంఎస్) తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించడంలో ఎన్ఐఐటీ అనే సంస్థ విఫలం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ఐఐటీని తప్పించి, ‘సాప్ ఇండియా’ అనే సంస్థకు సాఫ్ట్‌వేర్‌ను అందించే బాధ్యత అప్పగించారు. సాప్ ఇండియా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తోనే సీఎఫ్ఎంఎస్ కొనసాగుతోంది. అయితే, గత ఏడాదిన్నరగా సీఎఫ్ఎంఎస్ పేరుతో సాగుతున్న ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ పక్కదారి పట్టాయి. సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీఈవో) ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. దాంతో పెత్తనమంతా ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయింది. నిబంధనల ప్రకారం.. తొలుత వచ్చిన బిల్లులను తొలుత చెల్లించాలి. ప్రాధాన్యతా క్రమంలో అంటే అత్యవసరాలకు చెందిన బిల్లులను ముందుగా క్లియర్ చేయాలి. గత ఏడాదిన్నరగా ఈ రెండు నిబంధనలను అటుకెక్కించేశారు. స్వప్రయోజనాల కోసమే సీఎఫ్ఎంఎస్ రాష్ట్ర విభజనకు ముందు సీఎఫ్ఎంఎస్ ఇంకా అమల్లోకి రాకముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఫ్లాట్‌ఫాంపై కాంట్రాక్టర్లు ఎవ్వరూ కూడా బిల్లుల కోసం ఆర్థిక శాఖకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో బిల్లు మానటరింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవడంతో పీఏవో కార్యాలయానికి వెళ్లి బిల్లు సమర్పించి సీనియారిటీ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ బిల్లును ఆన్లైన్లో సమర్పిస్తే సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత బిల్లు సరిగ్గా ఉందా లేదా అనేది స్క్రూటినీ అయిన తర్వాత మళ్లీ సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ సీనియారిటీ నెంబర్ మేరకు బిల్లుల చెల్లింపు ఆన్లైన్లో జరిగిపోయేది. అయితే, ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ అమల్లోకి వచ్చాక బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పాతర వేశారు. కమీషన్లు ఇచ్చిన వారికే బిల్లులు సీనియారిటీ అనేది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్లు దండుకుని ఏ బిల్లుకు టిక్ పెడితే ఆ బిల్లులను చెల్లించేస్తున్నారు. పలుకుబడి లేని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల జరగడం లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆర్థిక శాఖ కార్యకలాపాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నిలిపివేశారు. ఆశ్రమ పాఠశాలల్లో డైట్ చార్జీలు, హోంగార్డుల వేతనాలను, పోలీసుల టీఏ, డీఏ బిల్లులను కూడా చెల్లించలేదు. ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి నుంచి పిల్లల వివాహాలు, ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. కేవలం చంద్రబాబు చెప్పిన వారికే బిల్లులు చెల్లించేలా సీఎఫ్ఎంస్ వ్యవస్థను దిగజార్చారు. ఏదైనా ఒక రంగంలో ఎంత వ్యయం చేశారో సీఎఫ్ఎంఎస్లో వివరాలుండాలి. కానీ, ఎక్కడా కనిపించడం లేదు. ఒక పద్దు నుంచి మరో పద్దుకు ఇష్టానుసారంగా నిధులను మార్చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి చేతిలో రాష్ట్ర ఖజానా చంద్రబాబు చెప్పిన ఏ బిల్లులు చెల్లించాలో ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర సీఎఫ్ఎంఎస్ సీఈవోకు చెప్పేవారు. అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రకు మాత్రమే తెలియాల్సిన లాగిన్, పాస్‌వర్డ్‌ను ప్రవేట్ వ్యక్తి అయిన సీఈవోకు ఇచ్చేశారు. దీంతో రవిచంద్ర చెప్పిన బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులను కూడా కమీషన్లు తీసుకుని సీఈవో, మరో ముగ్గురు వ్యక్తులు చెల్లించేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఆర్థిక శాఖతో పాటు ట్రెజరీ, పీఏవో విభాగాలు డమ్మీగా మారిపోయాయి. ఆర్థిక శాఖ రెగ్యులర్ ఉద్యోగులు చేయాల్సిన పనులన్నీ సీఈవోకు అప్పగించారు. సీఎఫ్ఎంఎస్ పూర్తిగా సీఈవో కనుసన్నల్లో చంద్రబాబు చెప్పినట్లు, రవిచంద్ర చెప్పినట్లు కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులకే తెలియకుండా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్లకు చెందిన నిధులను సీఎఫ్ఎంఎస్లోకి తీసుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన రంగాలకు ఆయా నిధులను చెల్లించేశారు. దీంతో ఆయా కార్పొరేషన్లలోని ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు నిధుల్లేకుండా పోయాయి. తప్పుడు వ్యవస్థకు రూ.168 కోట్లా? ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే సీఎఫ్ఎంఎస్ నిర్వహణకు ఏకంగా రూ.168 కోట్లు వ్యయం చేశారు. ఇప్పటివరకు రూ.104 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.64 కోట్ల బకాయిలున్నాయి. అంతేకాకుండా అనధికారికంగా మరికొన్ని రూ.వందల కోట్లను సీఎఫ్ఎంఎస్ నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగికి రెండుసార్లు వేతనాలు కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండుసార్లు వేతనాల రూపంలో రూ.200 కోట్లు చెల్లించారంటే సీఎఫ్ఎంఎస్ను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను నిలదీయడంతో మళ్లీ ఆ నిధులను వెనక్కి తెప్పించారు. డబుల్ ఎంట్రీల బిల్లులను అరికట్టడానికి రూపొందించిన సీఎఫ్ఎంఎస్ను పాలకుల అవసరాలకు అనుగుణంగా మార్చారు. సీఎఫ్ఎంఎస్లో పనిచేయడానికి వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై 42 మందిని తీసుకున్నారు. అలాగే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన 43 మందిని తీసుకున్నారు. ఆ తరువాత 145 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్లు పాటించలేదని, అలాగే మరో రెండు ఏజెన్సీల నుంచి కొంత మందిని ఔట్ సోర్సింగ్ కింద తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకుని, ఏ బిల్లులు చెల్లించాలో ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమే. -
చలానా చిక్కులు..రిజిస్ట్రేషన్‌కు చుక్కలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్) ప్రజల నడ్డివిరుస్తోంది. ముఖ్యంగా ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల సందర్భంలో రిజిస్ట్రేషన్ చేయించుకునే కక్షిదారులకు ఈ విధానం తలనొప్పిగా పరిణమించింది. రిజిస్ట్రేషన్‌కు సంబం ధించి వివిధ రకాల రుసుములన్నీ కలిపి ఒకే చలానాలో కట్టే పాత పద్ధతి స్థానంలో సీఎఫ్ఎంఎస్ విధానం అమలు కావడంతో ఒక రిజిస్ట్రేషన్‌కు ఐదు చలానాలను విడివిడిగా కట్టాల్సి వస్తోంది. దీంతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో మరుసటి రోజు రిజిస్టర్డ్ దస్తావేజులను కక్షిదారులు తీసుకువెళ్లేవారు. ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ విధానంతో ఒక రోజంతా బ్యాంకుల్లో పడిగాపులు పడటంతో పాటు మరో రోజు రిజిస్ట్రేషన్ కోసం సమయం వెచ్చించాల్సి వస్తోంది. బ్యాంకుల్లో సర్వర్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, రద్దీ వంటి సమస్యలతో చలానా చెల్లింపు ఆలస్యమవుతోంది. దీంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ పని పూర్తి అయ్యేది. కొత్తగావచ్చిన సీఎఫ్ఎంఎస్ విధానంతో చలానాలు కట్టడానికి ఒక రోజు బ్యాంకుల చుట్టూ తిరగడం, అది ముగిసిన తర్వాత మరుసటి రోజు రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగడం కక్షిదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. అవినీతిని నిర్మూలించేందుకు ప్రారంభించిన సీఎఫ్ఎంఎస్ విధానం ఆహ్వానించదగినదే అయినా కక్షిదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్లు ఇలా.. జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను ఏలూరు, భీమవరం రిజిస్ట్రేషన్ జిల్లాలుగా విభజించారు. ఏలూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, భీమవరం జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఆ శాఖ కక్షిదారులకు అందుబాటులో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. గతేడాది జిల్లాలో రిజి స్ట్రేషన్లు జరిగిన తీరును గమనిస్తే ఏలూరు జిల్లాలోని 12 కార్యాలయాల ద్వారా 74,054 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. భీమవరం జిల్లా పరిధిలోని 15 రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 70,822 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లెక్కన నెలకు సుమారు 12 వేల దస్తావేజుల రిజి స్ట్రేషన్లు ఆయా కార్యాలయాల ద్వారా జరిగాయి. అయితే సీఎఫ్ఎంఎస్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా త గ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెలకు 8 వేల దస్తావేజులకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదని తెలుస్తోంది. అందరికీ కొత్తే.. సీఎఫ్ఎంఎస్ విధానం రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందికి, అధికారులకూ కొత్తగానే ఉంది. కొత్త నిబంధనలు అమలు చేయాల్సి రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, సర్‌చార్జీ తదితర రుసుములన్నీ ఒకే చలానాగా బ్యాంకుల్లో జమచేసేవారు. ఇప్పుడు విడివిడిగా రుసుంను చలానా కట్టాల్సి వస్తోంది. మొదటి రోజు నెట్ సెంటర్లో చలానా నమోదు చేసుకోవడం తర్వాత ఆ పత్రాలను బ్యాంకులో చూపితే ఈ చలానా అందజేస్తున్నారు. ఇందులో ఒక కాలమ్‌ను ఖాళీగా ఉంచి 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు ఈ–చలానాను ఆమోదిస్తున్నారు. ముప్పుతిప్పలు.. మూడు రోజులు గతంలో నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అ న్ని రకాల ఫీజులు వసూలు చేసి ఒక్కరోజులో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేవారు. ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ విధానంతో రిజిస్ట్రేషన్‌కు మూడు రోజుల సమయం పడుతోంది. మొబైల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న వారు ఫోన్ నుంచే నేరుగా చలానా చెల్లించ వచ్చు. అయితే ఎక్కువ మంది ఈ విధానాన్ని వినియోగించుకోవడం లేదు. ఆలస్యంపై ఫిర్యాదులు వస్తున్నాయి సీఎఫ్ఎంఎస్ విధానంలో చలానాలు చెల్లించడానికి బ్యాంకులకు వెళుతుంటే అక్కడ చలానాలు చెల్లించడానికి ఆలస్యమవుతోందనే ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. దీనిపై సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చించి చలానా చెల్లింపులో జరిగే జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటాం. అలాగే నూతన విధానం కావడంతో మా సిబ్బందిలో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వారు ఈ విధానానికి అలవాటుపడుతున్నారు. ఇకపై త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. – పి.విజయలక్ష్మి, ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ -
వేతనాల్లేవు..!
ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ విధానం అమలులో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో జీతాలు నిలిచిపోయాయి. మార్చి నెల నుంచి వేతనాలు అందక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్థిక గణాంకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా సీఎఫ్ఎంఎస్(కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌సిస్టం) విధానాన్ని ప్రవేశపెట్టింది. ట్రెజరీ ద్వారా మంజూరయ్యే బిల్లులన్నింటినీ ఈ విధానం ద్వారానే దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 37,790 మంది ఉద్యోగులు, 39 వేల మంది పింఛనర్లతోపాటు, ఇతర బిల్లులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పంపాలని, కాగిత రహిత విధానం అమలు చేయాలని స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ‘శాప్’ అనే ప్రైవేటు సంస్థ ద్వారా అన్ని శాఖల్లోని ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కొన్ని శాఖలకు సాంకేతికంగా అవసరమైన స్కానర్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాలు అందజేశారు. వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో బిల్లులు దాఖలు చేయడంలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా వేగంగా లేకపోవడంతో ఒక బిల్లు అప్లోడ్ చేయడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతోందని పలు శాఖల అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లు పూర్తి సామర్థ్యంతో పని చేయక పోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతీ నెల 18 నుంచి 25వ తేదీ మధ్య బిల్లులు ఖజానాశాఖకు సమర్పించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం కొన్ని శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు పొందుపర్చకపోవడంతో ఉద్యోగుల జీతాలపైన ప్రభావం చూపుతోంది. కొన్నిశాఖల అధికారులు బిల్లులు ఆలస్యంగా సమర్పించడం, ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులకు డబ్బులు చెల్లించాలా లేదా అనే విషయంలో అనుమతులు రాకపోవడంతో పెండింగ్‌లో ఉంచారు. ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలివే.. కొన్ని శాఖలలో ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సిస్టంలు, స్కానర్లు, ప్రింటర్లు, నెట్ స్పీడ్ లేకపోవడంతో జీతాల బిల్లులు ఆన్లైన్లో సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. డిపార్టుమెంట్ సంబంధించి అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వలేదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని శాఖల అధికారులు ఇంతవరకు శిక్షణ తీసుకోలేదు. దీంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలకు సంబంధించిన జీతాలు సైతం మార్కెటింగ్ శాఖతోపాటు, పలుశాఖల ఉద్యోగులకు రాలేదు. ఎయిడెడ్ ఉద్యోగులకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ విధానం గుదిబండగా మారింది. దీంతో ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్శాఖకు సంబంధించి పీఏవో ద్వారా జీతాలు తీసుకునేవారు. వారిలో హెచ్ఆర్ఎంఎస్ సిబ్బందికి చెక్కు ద్వారా జీతాలు చెల్లించేవారు. వీరికి సంబంధించి బ్యాంకుల్లో ఐడీలు లేకపోవడంతో ప్రభుత్వం ముందస్తుగా ఒక్కోక్కరికి రూ.75వేలు అడ్వాన్సును చెల్లించింది. మొత్తంగా ఏప్రిల్ నెల జీతాలు పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అందేలా చేసేందుకు ఆయా డిపార్టుమెంటల్ అధికారులు, ఖజానా సిబ్బంది పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఖజానా కార్యాలయానికి సీఎఫ్ఎంఎస్ విధానంలో 2,250 బిల్లులు రాగా 950 బిల్లులు పాస్ అయినట్లు సమాచారం. 600 బిల్లులు డీడీవోల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా బిల్లులు పాస్‌చేసేందుకు ఖజానా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఖజానా అధికారులు పేర్కొన్నారు. అందరికి జీతాలు అందేలా చేస్తాం జిల్లాలోని ఉద్యోగులు , పింఛనర్లు అందరికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్ధేశిత సమయం మించినప్పటికీ ఆన్లైన్ ద్వారా వస్తున్న వేతన బిల్లులను ఖచ్చితంగా పాస్ చేసేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం వల్ల చిన్న చిన్న సాంకేతిక సమస్యల తలెత్తుతున్న మాట వాస్తవం. కాని ఇందులోని బాలారిష్టాలను అధిగమించి బిల్లులతోపాటు, వేతనాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.– ఎన్.సదాశివరావు, ఉప సంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ -
నిలిచిన రూ.100 కోట్లు !
జిల్లాలో ఖజానా కార్యాలయం నుంచి డ్రాయింగ్ ఆఫీసర్స్ ఖాతాల్లో పడాల్సిన దాదాపు రూ.100 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుంచి ట్రెజరీలో ప్రవేశపెట్టిన కంప్రెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, మెడికల్, న్యాయ విభాగం, ఎల్ఐసీతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి రావాల్సిన డబ్బులు నిలిచిపోయాయి. దీంతో వారు ఆందోళనలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టూటౌన్ : ప్రభుత్వం ట్రెజరీలో కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం) సాంకేతిక సమస్యల (సాఫ్ట్వేర్ సమస్యలు) చిక్కు వీడలేదు. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న నూతన విధానంపై (సీఎఫ్ఎంఎస్) సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానంలోకి అనేక శాఖల ఉద్యోగుల్ని చేర్చడంలో సాఫ్ట్వేర్ సమస్యలు ఉండటంతో నూతన విధానం ముందుకు సాగడం లేదు. దీంతో జిల్లాలో వందలాది మంది ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎయిడెడ్ స్కూలు ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్ శాఖల్లో పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు ఇలా చాలామంది చిరుద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాని పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పంచాయతీల నిధులు, మండల పరిషత్ నిధులు, జిల్లా పరిషత్‌కు సంబంధించిన నిధులు, ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు ఇలా అన్నీ వరుసగా బ్రేక్ అయ్యాయి. ఈ శాఖలకు సంబంధించిన పీడీ అకౌంట్ (పబ్లిక్ అకౌంట్ పోర్టల్)లోకి చెక్కుల పర్మిషన్ నిలిచిపోవడంతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకుండా పోయింది. చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్స్, ఎంప్లాయిస్‌కు సంబంధించిన మట్టి ఖర్చులు, పెన్షన్ బకాయిలు రాలేదు. మార్చి నెలలో జీతాల బిల్లులు సకాలంలో పెట్టుకోని ఉద్యోగులకు నేటికీ జీతాలు రాని స్థితి ఉంది. దాదాపు 182 ప్రభుత్వ శాఖల వరకు ఉండగా వాటిలో ఇప్పటి వరకు కేవలం 95 శాఖలకే ఆయా శాఖాధిపతుల నుంచి ఉద్యోగుల డేటా కన్ఫ్ర్మేషన్ చేయడం (సీఎఫ్ఎంఎస్ విధానంలో)కోసం అనుమతి లభించిందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. సీఎఫ్ఎంఎస్ విధానంపై డ్రాయింగ్ ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ఇప్పటి వరకు ఏ బిల్లుకూ మోక్షం లభించడం లేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి: జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో సబ్ ట్రెజరీలు ఉన్నాయి. మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరు గాక ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతుంటారు. ప్రతి నెల రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వివిధ రకాల బిల్లులు వస్తుంటాయి. ఆయా బిల్లులకు కేటాయించిన సమయంలో బిల్లులను ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంకులకు ట్రెజరీ ఉద్యోగులు పంపించి, జీతాలు విడుదల చేసి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటుంది. నిలిచిన నిధులు ప్రస్తుతం ఏప్రిల్ నుంచి ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎంఎఫ్ఎస్)పై జిల్లాలోని డ్రాయింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆయా శాఖల ఉన్నతాధికారులు (హెచ్వోడీలు) నుంచి చాలా శాఖలకు అనుమతులు రాకపోవడం, సాంకేతిక సమస్యలు ఇలా పలు కారణాల వల్ల జిల్లాలో ఎంతో మంది ఉద్యోగులు, పెన్షనర్స్ 20 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులు కూడా నిలిచిపోయాయి. ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు: నిత్యం ఎంతో మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పటికీ జీతాలు రాక ట్రెజరీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా వివిధ రకాల నిధులు నిలిచిపోయినట్లు సమాచారం. ఏప్రిల్‌కు ముందు ట్రెజరీపై ఆంక్షలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు, ఇప్పుడు కొత్త విధానం అమలులో సాఫ్ట్వేర్ సమస్యలతో సీఎఫ్ఎంఎస్లోకి చేర్చక పోవడంతో జీతాలు పొందలేని పరిస్థితి నెలకొందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. రెండు నెలలుగా జీతాలు రావాలి జిల్లాలో 240 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. 960 మంది పనిచేస్తున్నారు. రెండునెలలుగా జీతాలు రావాలి. మార్చి నెల జీతం రాలేదు. ఏప్రెల్ నుంచి సీఎఫ్ఎంఎస్ విధానం వచ్చిన తరువాత ఈ నెల జీతం రాలేదు. ఇప్పటి వరకు కొత్త విధానంలోకి మా టీచర్స్ పేర్లు మారలేదు. దీంతో రెండు నెలల జీతాలు ఆగిపోయాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరితగతిన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – ప్రభాకర్‌రెడ్డి, ఏపీ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాఫ్ట్వేర్ సమస్య వల్లనే కొంత జాప్యం 182 డిపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 95 డిపార్టుమెంట్స్కే హెచ్‌వోడీల నుంచి పర్మిషన్ వచ్చింది. మిగిలిన శాఖలకు ఆయా శాఖల హెచ్వోడీలు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ వచ్చిన తరువాత పాస్వర్డ్ వస్తోంది. అప్పుడు ఆయా శాఖల ఉద్యోగుల డేటా సీఎప్ఎంఎస్ పద్ధతిలోకి మార్చాలి. సాఫ్ట్వేర్ సమస్యలు ఉండటం వలన కొంత జాప్యం జరుగుతోంది. కొద్ది రోజులలో సమస్య పరిష్కరమవుతుంది. – నారాయణ, ట్రెజరీ ఉద్యోగి -
ప్రస్తుత విధానంలోనే పీఆర్సీ
‘సీఎఫ్ఎంఎస్’ విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం) అమలు విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కితగ్గింది. పీఆర్సీ అమలు జీవోలు జారీ చేసిన రెండు నెలల తర్వాత.. సీఎఫ్ఎంఎస్ అమలు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది. సాధ్యం కాదని తెలిసినా.. సీఎఫ్ఎంఎస్ ద్వారానే పీఆర్సీ అమలు చేసి కొత్త వేతనాలు ఇవ్వాలని నిర్ణయించడం వెనక పీఆర్సీ అమలును జాప్యం చేయాలనే ‘సర్కారు దగా’ ఉందంటూ జీవోలు జారీ చేసిన రోజే ‘సాక్షి’ చెప్పింది. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం ప్రభుత్వంలో అంటకాగుతుండటం వల్ల ప్రభుత్వం కుట్ర మీద ఆలస్యంగా స్పందించిందనే విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. సీఎఫ్ఎంఎస్ వల్ల జాప్యం జరుగుతున్నందున ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్ఆర్ఎంఎస్ ద్వారానే జీతాలు చెల్లించాలని అశోక్‌బాబు, కత్తినరసింహారెడ్డి తదితరులతో కూడిన జేఏసీ ప్రతినిధి బృందం మంగళవారం చేసిన విజ్ఞప్తికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సానుకూలంగా స్పందించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ ఊరులో లేరని, నాలుగు రోజుల్లో.. ప్రస్తుత విధానంలో పీఆర్సీ అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త వేతనాలు ఆగస్టులోనే: ఈ నెలలో జీతాల బిల్లులను ట్రెజరీల్లో సమర్పించడానికి గడువు ముగిసినందున, పాత విధానంలోనే పీఆర్సీ అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చినా ప్రస్తుతానికి ప్రయోజనం ఉండదు. ఆగస్టు 1న అందనున్న జూలై జీతంలో పీఆర్సీ అమలు ప్రయోజనం కనిపిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు.. మూడు నెలల బకాయిలను జూలై జీతంతో పాటు చెల్లిస్తారు. పది రోజుల్లో ప్యాకేజీల ఖరారు హెల్త్‌కార్డుల పథకం ప్యాకేజీలను పది రోజుల్లో ఖరారు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల జేఏసీకి హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ, నగర ఆసుపత్రుల వారీగా ప్యాకేజీలు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదించాలని ఆసుపత్రుల ప్రతినిధులకు సూచించారు. -
పారదర్శకత కోసమే 'సీఎఫ్ఎంఎస్'
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో త్వరలో సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానాన్ని (సీఎఫ్ఎంఎస్) అన్ని స్థాయిల్లో అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప తెలిపారు. ఆరు జిల్లాలకు చెందిన ట్రెజరీ అధికారులు, సిబ్బందికి నూతన ఆర్థిక నిర్వహణ విధానంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలకు కేటాయించే నిధులను పూర్తి పారదర్శకతతో ఖర్చు చేయడానికి 'సీఎఫ్ఎంఎస్'ను అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనికి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల వివిధ శాఖలకు జరిపే చెల్లింపులు, పనితీరు ఆధారంగా నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానంలో జరిపే చెల్లింపులు నూరుశాతం సంబంధిత వ్యక్తి ఖాతాకే జమ కావడం ద్వారా అవినీతికి తావుండదని ఆమె తెలిపారు. జిల్లాల్లో డ్రాయింగ్ అధికారులు, వారి సిబ్బంది తమ పూర్తి వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలని చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు మాట్లాడుతూ ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయ వనరులు మిగలడంతో పాటుగా పనిలో వేగం పెరిగి తక్షణ చెల్లింపులు జరుగుతాయన్నారు.