సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు.. 2021 మే 31.. గుడివాడకు చెందిన దారం మాణిక్యాలరావు మండవల్లి మండలం పోలుకొండలో ఎకరం భూమి కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్‌ను కలిశాడు. ఆ భూమి విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.90,250 కట్టాలని చెప్పడంతో ఆ డబ్బులు మాణిక్యాలరావు ఇచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ సీఎఫ్‌ఎంఎస్‌లో జమయ్యేలా ఆన్‌లైన్లో చలానా కట్టాడు. రూ.78,000, రూ.12,000, రూ.250 చొప్పున మూడు చలాన్ల ప్రింటవుట్లు తీసి డాక్యుమెంట్‌తో కలిపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపాడు. సబ్ రిజిస్ట్రార్ ఆ చలాన్ల ప్రింట్లు చూసి మొత్తం సొమ్ము కట్టినట్లు నిర్థారించుకుని రిజిస్ట్రేషన్ చేసేశారు. పని పూర్తయిపోయింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట
కానీ అక్కడ వాస్తవానికేం జరిగిందో తెలుసా..? చలాన్లు కట్టేటపుడే ఆ డాక్యుమెంట్ రైటర్ అతిపెద్ద కుట్రకు తెరతీశాడు. రూ.78,000 జమ చేసినట్లు మాణిక్యాలరావుకు ప్రింటవుట్ ఇచ్చినా... నిజానికి తను ఆన్‌లైన్లో చెల్లించింది రూ.780 మాత్రమే. కానీ కంప్యూటర్లో ఆ చలాన్ పీడీఎఫ్ కాపీని మార్ఫింగ్ చేశాడు. 780 పక్కన రెండు సున్నాలు చుట్టి రూ.78,000 చేసేశాడు. అదే ప్రింటవుట్‌ను తీసిచ్చాడు. దాన్నే సబ్ రిజిష్ట్రార్‌కు పంపాడు.
మరి సబ్ రిజిష్ట్రార్ ఎలా నమ్మారు? దాన్నెలా నిర్ధారించుకున్నారు? ఈ ప్రశ్నలు సహజం. అటు సీఎఫ్‌ఎంఎస్‌కు రకరకాల చెల్లింపులు వస్తుంటాయి కాబట్టి అక్కడెవరికీ వాస్తవంగా రావాల్సిందెంతో...ఎంత వచ్చిందో తెలిసే అవకాశం లేదు. సీఎఫ్‌ఎంఎస్‌కు నిజంగా ఎంత చెల్లించారో ఆన్‌లైన్లో చూసే అవకాశం ఈ సబ్ రిజిస్ట్రార్‌కు లేదు. ఇదిగో... ఈ వీక్‌పాయింట్‌నే డాక్యుమెంట్ రైటర్లు పట్టుకున్నారు. చలాన్లలో తాము చెల్లించిన సొమ్ము పక్కన సున్నాలు పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. ఆ డబ్బులన్నీ మింగేశారు. ఇలా ఒక్కరు కాదు... ఒక చోట కూడా కాదు.
డాక్యుమెంట్ రైటర్ల నెట్‌వర్క్ ఒకరి నుంచి మరొకరు ఈ మోసం ఎలా చేయాలో తెలుసుకున్నారు. అంతా గూడుపుఠానీ జరిపి కోట్లు కాజేశారు. తాజాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు జరపటంతో ఈ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎందుకు తెలుసుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో అధికారగణం కదిలింది.
ఇకపై ఇలాంటి మోసాలు జరగక్కుండా ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తేవటమే కాక... ఇప్పటివరకూ జరిగిన అక్రమ లావాదేవీలపై దృష్టిపెట్టింది. సబ్ రిజిస్ట్రార్లపైనా వేటు పడుతోంది. పోయిన సొమ్ము సైతం కొంత కొంతగా రికవరీ అవుతోంది. మున్ముందు మరింత భారీగా తనిఖీలు జరుపుతామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ కుంభకోణం పూర్వాపరాలివీ...
రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన ఈ కుంభకోణంలో ఇప్పటిదాకా రూ.5.85 కోట్లు పక్కదారి పట్టినట్లు తనిఖీల్లో వెల్లడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నకిలీ చలాన్ల బాగోతం వెలుగు చూసింది. ఒక్కొక్క కార్యాలయాన్నీ తనిఖీ చేస్తున్న కొద్దీ ఇది ఒక్కచోటికే పరిమితం కాలేదని, పలు ప్రాంతాలకు వ్యాపించిందని వెల్లడయింది. వ్యవహారం బయటపడ్డ వెంటనే అధికారులపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే లోపాలు సరిదిద్దాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి గండి పడిన ఆదాయాన్ని రికవరీ చేయాలని కూడాస్పష్టం చేశారాయన. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చురుగ్గా కదిలి డొంక మొత్తాన్ని కదిలించారు. రోజుల వ్యవధిలోనే కొన్ని లక్షల డాక్యుమెంట్లను పరిశీలించారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు
దారి మళ్లినట్లు కనుగొన్న మొత్తంలో ఇప్పటికే 2.86 కోట్లను రికవరీ చేశారు. ఇందులో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని తేలటంతో 10 మందిని సస్పెండ్ చేశారు. 12 క్రిమినల్ కేసులు పెట్టారు. అంతేకాదు! స్కామ్‌కు సూత్రధారులుగా ఉన్న పలువురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేయించారు. మొదట ఈ వ్యవహారం కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయటపడగా... అనుమానం వచ్చిన రిజిష్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం పలుచోట్ల తనిఖీలు జరపడంతో మరిన్ని చోట్ల అక్రమాలు బయటపడ్డాయి.
విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖ జిల్లా నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, కృష్ణాజిల్లా గాంధీనగర్, నందిగామ, గుణదల, పటమట, మండవల్లి, గుంటూరు జిల్లా మంగళగిరి, వైఎస్సార్ కడప జిల్లా కడప, కడప రూరల్, కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మార్ఫింగ్ వ్యవహారాలు బయటపడ్డాయి. అత్యధికంగా కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు వెల్లడయింది. చదవండి: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సీఎఫ్‌ఎంఎస్‌తో కార్డ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి
సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థకి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్) వ్యవస్థను పూర్తిగా అనుసంధానం చేయకపోవటమే ఈ కుంభకోణానికి కారణమైంది. ఎందుకంటే సీఎఫ్‌ఎంఎస్‌కు చలాన్ల ద్వారా ఎంత చెల్లించారన్నది సబ్ రిజిస్ట్రార్లకు కనిపించదు. భౌతికంగా తమ చేతికి వచ్చిన ప్రింటవుట్‌ను చూసి వారు నిర్ధారించుకునేవారు. ఇక్కడే డాక్యుమెంట్ రైటర్లు బడా మోసానికి తెరతీశారు.
తాజా కుంభకోణం నేపథ్యంలో ఈ తప్పు మళ్లీ జరక్కుండా వెంటనే సీఎఫ్‌ఎంఎస్‌కి చెల్లించే ఛలానాలు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ సిస్టమ్‌లో కనపడేలా నెట్‌వర్క్‌ని అనుసంధానించారు. తొలుత కార్వేటి నగరం, కుప్పం, చీరాల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 294 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీంతో తమ చేతిలో ఉన్న చలానా నెంబరు ప్రకారం అందులో పేర్కొన్న సొమ్ము సీఎఫ్‌ఎంఎస్‌కు జమయిందో లేదో రియల్‌టైమ్‌లో నిర్ధారించుకునే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు వచ్చింది. తేడాలేమైనా ఉంటే అక్కడే పట్టేసుకోవచ్చు.
డాక్యుమెంట్ రైటర్ల నెట్‌వర్కే మూలం!!
ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు డాక్యుమెంట్ రైటర్లేనని స్పష్టంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల వారికి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే ఆపరేటర్లు, సిబ్బంది తోడయ్యారు. అక్కడక్కడా సబ్ రిజిస్ట్రార్లు కూడా వారితో చేయి కలిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిజానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లదే హవా. ఎవరైనా వారి దగ్గరకే వెళ్లాలి. డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, చలానాలు తీయడం వంటి పనులు కష్టంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే సాధారణ వ్యక్తులు వీరిపైనే ఆధారపడుతున్నారు.
దీన్ని ఆసరాగా చేసుకుని అధికారులను కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మెల్లగా వీళ్లంతా ఒక నెట్‌వర్క్‌లా కూడా తయారయ్యారు. అందుకే చలానాల మార్ఫింగ్ కుంభకోణం ఒక్కచోటకే పరిమితం కాకుండా... అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. అధికారులు చురుగ్గా తనిఖీలు చేస్తుండటంతో ఇపుడు అక్రమార్కుల గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లోనూ చేపడతామని, రాండమ్‌గా భారీ ఎత్తున డాక్యుమెంట్లను తనిఖీ చేస్తామని, అవసరమైన చోట విస్తృత స్థాయి తనిఖీలకు దిగుతామని అధికారులు చెబుతున్నారు.
ఇక అవకతవకలకు ఆస్కారం ఉండదు
– ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ
ఛలానాల మార్ఫింగ్ వ్యవహారం బయటపడగానే అప్రమత్తమయ్యాం. అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేసి అక్రమాలు గుర్తించాం. వెంటనే కార్డ్ సిస్టమ్‌లో ఛలానాలు కనపడేలా మార్పులు చేశాం. ఇకపై మార్ఫింగ్‌కు అవకాశం ఉండదు. వాస్తవానికి గతంలోనే ఈ మార్పులు చేయాలని పైలెట్ ప్రాజెక్టు చేపట్టాం. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఈలోపు ఈ వ్యవహారాలు బయటపడడంతో ఎన్‌ఐసీ ద్వారా వెంటనే సీఎఫ్‌ఎంఎస్ ఛలానాల సాఫ్ట్‌వేర్‌ని కార్డ్ సిస్టమ్‌కి అనుసంధానించాం.
Comments
Please login to add a commentAdd a comment