ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల నిమిత్తం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించే చలానాలను నేరుగా సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)కు అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషగిరిబాబు తెలిపారు. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తొలుత కుప్పం, కార్వేటినగరం, చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీని అమలును పైలెట్‌గా చేపట్టారు. సోమవారం నుంచి అన్ని కార్యాలయాల్లోనూ అమల్లోకి తెచ్చారు.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసి కడపలో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించారు. ఈ విషయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకులో చలానా తీసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక కొందరు మళ్లీ దాన్ని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మాన్యువల్‌గా చలానాను స్వీకరించడం, దాన్ని పీడీఎఫ్‌గా అప్‌లోడ్ చేసే క్రమంలో దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే చలానాలు కట్టి రిజిస్ట్రేషన్‌కు రాకుండా వేచి ఉండేవారి చలానాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు చలానాలను నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేయడంతో ఇలాంటి తప్పులకు అవకాశం ఉండదని శేషగిరిబాబు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment