భూవిలువల సవరణ ద్వారా సమకూరే అదనపు ఆదాయం
సవరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన రిజి్రస్టేషన్ల శాఖ
గ్రామీణ–పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ–వ్యవసాయేతర భూములు, నివాస–వాణిజ్య ప్రాంతాల ప్రాతిపదికగా పరిశీలన
గజం భూమి విలువ కనీసం రూ. 1,000 పెంచే అవకాశం
ప్రధాన రహదారులకు ఇరువైపులా 100 శాతం సవరించే యోచన
వ్యవసాయ భూముల విలువలపై రెవెన్యూ వర్గాలతో చర్చల తర్వాతే స్పష్టత
ఈనెల 29 కల్లా సవరణ
విలువలను నిర్ధారించనున్న కమిటీలు
మొత్తంమీద 20–35% వరకు ఆదాయం పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వర్గాలతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రాథమిక స్థాయి సమావేశాలను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో భూములు, ఆస్తుల విలువలను పెంచడం ద్వారా 20 నుంచి 35 శాతం వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశముందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలంటున్నాయి.
గజం రూ.1,000... ఎకరం రూ. 4లక్షలు పెంపు!
రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న సవరణ ప్రక్రియ అనంతరం గజం నివాస స్థలం విలువ కనీసం రూ.1,000 పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కనీస విలువతో పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాల విలువల పెంపు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వ వర్గాల ద్వారా రిజి్రస్టేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక, ఎకరం వ్యవసాయ భూమి కనీస విలువ ఏ మేరకు సవరించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల బహిరంగ మార్కెట్ విలువ ఎంతుందన్న దానిపై రెవెన్యూ వర్గాలతో చర్చించిన అనంతరం దీనిపై ఓ అంచనాకు రానున్నారు.
అయితే, రిజి్రస్టేషన్ల శాఖ అంచనా ప్రకారం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ప్రకారం రాష్ట్రంలో ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.4 లక్షల వరకు పెరగనుందని తెలుస్తోంది. ఇక, విలువల సవరణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య సముదాయాలను కేటగిరీలుగా తీసుకోనున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న నివాస, వాణిజ్య సముదాయాల ప్రభుత్వ విలువలను 100 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది.
ఈనెల 29 కల్లా కమిటీల సంతకాలు
విలువల సవరణ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నాటికి అన్ని రకాల భూములు, ఆస్తుల విలువల పెంపుపై సవరణ కమిటీలు సంతకాలు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జేసీ, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్లతో; పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్‌రిజి్రస్టార్లతో; హెచ్‌ఎండీఏ పరిధిలో కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్‌రిజి్రస్టార్లతో విలువల సవరణ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలు సంతకాలు చేసిన అనంతరం ప్రతిపాదిత విలువలను ఆన్‌లైన్‌లో ఉంచి 15 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుని జూలై 24 కల్లా విలువల సవరణకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరించి ఆగస్టు 1 నుంచి కొత్త విలువలను అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment