నచ్చిన వారికి మెచ్చిన చోటు! | Transfers at will in Registration Department: Telangana | Sakshi
Sakshi News home page

నచ్చిన వారికి మెచ్చిన చోటు!

Published Sat, Sep 21 2024 2:29 AM | Last Updated on Sat, Sep 21 2024 2:29 AM

Transfers at will in Registration Department: Telangana

రిజిస్ట్రేషన్ల శాఖలో ఇష్టారాజ్యంగా బదిలీలు

ఇద్దరు అధికారుల కనుసన్నల్లోనే అన్ని పోస్టింగులు

జూనియర్లయినా మంచి స్టేషన్లు ఆప్షన్లు తూచ్‌.. స్పౌజ్‌ కేసులూ పట్టించుకోని వైనం

అధికారులను నమ్మి బాధ్యత అప్పగించిన మంత్రి పొంగులేటి 

అడ్డగోలుగా బదిలీలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

వరంగల్‌ స్థానికత కలిగిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ మెదక్‌లో పనిచేస్తుండేవారు. ఆయన 317 జీవో కింద మహబూబ్‌నగర్‌ జిల్లాకు వెళ్లారు. ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో తనను స్పౌజ్‌ కోటా కింద పరిగణనలోకి తీసుకుని స్టేషన్‌ కేటాయించాలని, లేదంటే తనకు స్టేషన్‌ అవసరం లేదని, చిట్స్‌కయినా, ఆడిట్‌కయినా పంపాలని ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానానికి 100 కిలోమీటర్ల అవతలకు బదిలీ చేశారు.  

హైదరాబాద్‌కు సమీపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ జీవిత భాగస్వామి అదే జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులోని నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తనను స్పౌజ్‌ కోటా కింద పరిగణనలోకి తీసుకుని తగిన స్థానం ఇవ్వాలని సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ కోరారు. కానీ ఆయన్ను హైదరాబాద్‌కు మరింత 
దగ్గరగా బదిలీ చేశారు.  

సబ్‌ రిజిస్ట్రార్ల యూనియన్‌ పేరుతో చెలామణి అవుతున్న ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లకు వరుసగా మూడోసారి ఫోకల్‌ పోస్టింగులిచ్చి ఏ గ్రేడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు బదిలీ చేశారు. ఏసీబీ ట్రాప్‌ రికార్డులు కూడా పట్టించుకోకుండా కావాల్సిన స్థానానికి బదిలీ చేయడం గమనార్హం.

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ బదిలీల్లో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు అధికారుల కనుసన్నల్లో ఈ బదిలీల తంతు జరిగిందని, బదిలీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు విని్పస్తుండగా, తాజాగా నిఘా వర్గాల నివేదికతో బదిలీలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. ఆప్షన్లు ఒకచోటుకు పెడితే మరో చోటుకు బదిలీ చేశారని, సింగిల్‌ డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లను పంపి, జిల్లా కేంద్రాల్లో సీనియర్‌ అసిస్టెంట్లతో సరిపెట్టారని, స్పౌజ్‌ కేసులను పట్టించుకోలేదని, జీరో సరీ్వసు అంటూ అందరినీ బదిలీ చేస్తామని చెప్పి చివరకు పరిపాలనా అవసరాలంటూ పది స్టేషన్ల వరకు బదిలీలు చేయలేదని పలువురు సబ్‌ రిజిస్ట్రార్లు వాపోతున్నారు.

తమకు నచ్చిన వారికి మాత్రం వరుసగా మూడోసారి ఫోకల్‌ పోస్టింగులు ఇచ్చారని, చార్మినార్‌ జోన్‌ పేరుతో కొందరు సబ్‌ రిజిస్ట్రార్లను ఏ గ్రేడ్‌ స్టేషన్ల చుట్టూనే తిప్పుతున్నారని, ఇందుకోసం డబ్బులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. డీఐజీల స్థాయిలో సిద్ధమైన జాబితాకు, విడుదలైన బదిలీల జాబితాలకు పొంతన లేకుండా పోయిందని, ఆ ఇద్దరు అధికారులు చక్రం తిప్పి తమ ఇష్టారాజ్యంగా పేర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పైరవీలకు అస్కారమివ్వకుండా రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులకు బాధ్యత అప్పగిస్తే, అడ్డగోలుగా బదిలీలు చేసి అంతా బాగానే జరిగినట్టు ఆయన్ను నమ్మించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. బదిలీలకు కొద్దిరోజుల ముందే వచ్చిన కమిషనర్‌ను కూడా బురిడీ కొట్టించి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.

ఆప్షన్లు ఎందుకు అడిగినట్టో..? 
సాధారణ బదిలీల్లో భాగంగా సబ్‌ రిజిస్ట్రార్లను ఆప్షన్లు అడిగారు. ఈ ఆప్షన్ల వారీగా వారి ప్రాధాన్యతలను తెలుసుకోవడం ఎప్పుడూ జరిగే ప్రక్రియే. కాగా సబ్‌ రిజిస్ట్రార్లందరూ తమ అభీష్టం మేరకు ఆప్షన్లు ఇచ్చి ఆయా స్టేషన్‌లపై ఆశలు పెట్టుకున్నారు. తీరా బదిలీల జాబితా చూస్తే ఆప్షన్లు ఇచ్చిన స్టేషన్లకు, తమను బదిలీ చేసిన స్టేషన్‌కు అసలు పొంతన లేకపోవడంతో విస్తుపోవడం బాధిత సబ్‌ రిజిస్ట్రార్ల వంతయింది.  

నోడల్‌ జిల్లా రిజిస్ట్రార్లుగా జూనియర్‌ అసిస్టెంట్లు! 
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు జిల్లా రిజిస్ట్రార్లు లేరు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా రిజిస్ట్రార్లు పనిచేస్తుండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే సబ్‌ రిజిస్ట్రార్లు నోడల్‌ జిల్లా రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి జిల్లా కేంద్రాలకు జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లను ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్లుగా పంపడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు జిల్లా కేంద్రాలతో పాటు, కరీంనగర్‌ జిల్లా నుంచి విడిపోయిన మరో జిల్లా కేంద్రానికి బదిలీల తర్వాత కూడా ఇన్‌చార్జులే సబ్‌ రిజిస్ట్రార్లుగా కొనసాగుతుండగా, రోజుకు ఒకటో, రెండో డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు మాత్రం రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లను పంపారనే విమర్శలు ఉన్నాయి.  

సబ్‌ రిజిస్ట్రార్లుగా సన్నిహితులు! 
బదిలీల్లో అక్రమాలు, అన్యాయాల మాట అటుంచితే.. సాధారణ బదిలీల గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీగా ఉన్న ఏడెనిమిది కార్యాలయాలకు తమకు నచ్చిన జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లను పంపడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రం, హైదరాబాద్‌ తూర్పు దిక్కున అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే స్టేషన్, హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఇంకో స్టేషన్‌తో పాటు ఖాళీగా ఉన్న స్టేషన్‌లకు జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్‌పై పంపారని, వీరంతా బదిలీల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన అధికారులకు సన్నిహితులేననే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. సబ్‌ రిజిస్ట్రార్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్ల విషయంలోనూ ఇష్టారాజ్యంగా బదిలీలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement