సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకతను కాపాడేందుకు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనైతిక చర్యలకు, కమీషన్లు దండుకోవడానికి వాడుకుంటోంది. టెక్నాలజీ పేరుతో ప్రభుత్వ ఫైళ్లు, బిల్లుల చెల్లింపులను ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టేసింది. సదరు ప్రైవేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. అందిన చోటల్లా కమీషన్లు మింగేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్) పేరిట సాగుతున్న అవినీతి అంతా ఇంతా కాదు. ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శులకు కూడా ఏం జరుగుతోందో తెలియకుండా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టడం ఎంత ప్రమాదమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
లావాదేవీల్లో గోల్‌మాల్
ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు, పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థను(సీఎఫ్‌ఎంఎస్) తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించడంలో ఎన్‌ఐఐటీ అనే సంస్థ విఫలం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్‌ఐఐటీని తప్పించి, ‘సాప్ ఇండియా’ అనే సంస్థకు సాఫ్ట్‌వేర్‌ను అందించే బాధ్యత అప్పగించారు. సాప్ ఇండియా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తోనే సీఎఫ్‌ఎంఎస్ కొనసాగుతోంది. అయితే, గత ఏడాదిన్నరగా సీఎఫ్‌ఎంఎస్ పేరుతో సాగుతున్న ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ పక్కదారి పట్టాయి. సీఎఫ్‌ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీఈవో) ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. దాంతో పెత్తనమంతా ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయింది. నిబంధనల ప్రకారం.. తొలుత వచ్చిన బిల్లులను తొలుత చెల్లించాలి. ప్రాధాన్యతా క్రమంలో అంటే అత్యవసరాలకు చెందిన బిల్లులను ముందుగా క్లియర్ చేయాలి. గత ఏడాదిన్నరగా ఈ రెండు నిబంధనలను అటుకెక్కించేశారు.
స్వప్రయోజనాల కోసమే సీఎఫ్‌ఎంఎస్
రాష్ట్ర విభజనకు ముందు సీఎఫ్‌ఎంఎస్ ఇంకా అమల్లోకి రాకముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఫ్లాట్‌ఫాంపై కాంట్రాక్టర్లు ఎవ్వరూ కూడా బిల్లుల కోసం ఆర్థిక శాఖకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో బిల్లు మానటరింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవడంతో పీఏవో కార్యాలయానికి వెళ్లి బిల్లు సమర్పించి సీనియారిటీ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ బిల్లును ఆన్‌లైన్‌లో సమర్పిస్తే సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత బిల్లు సరిగ్గా ఉందా లేదా అనేది స్క్రూటినీ అయిన తర్వాత మళ్లీ సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ సీనియారిటీ నెంబర్ మేరకు బిల్లుల చెల్లింపు ఆన్‌లైన్‌లో జరిగిపోయేది. అయితే, ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్ అమల్లోకి వచ్చాక బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పాతర వేశారు.
కమీషన్లు ఇచ్చిన వారికే బిల్లులు
సీనియారిటీ అనేది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్లు దండుకుని ఏ బిల్లుకు టిక్ పెడితే ఆ బిల్లులను చెల్లించేస్తున్నారు. పలుకుబడి లేని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల జరగడం లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆర్థిక శాఖ కార్యకలాపాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నిలిపివేశారు. ఆశ్రమ పాఠశాలల్లో డైట్ చార్జీలు, హోంగార్డుల వేతనాలను, పోలీసుల టీఏ, డీఏ బిల్లులను కూడా చెల్లించలేదు. ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి నుంచి పిల్లల వివాహాలు, ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. కేవలం చంద్రబాబు చెప్పిన వారికే బిల్లులు చెల్లించేలా సీఎఫ్‌ఎంస్ వ్యవస్థను దిగజార్చారు. ఏదైనా ఒక రంగంలో ఎంత వ్యయం చేశారో సీఎఫ్‌ఎంఎస్‌లో వివరాలుండాలి. కానీ, ఎక్కడా కనిపించడం లేదు. ఒక పద్దు నుంచి మరో పద్దుకు ఇష్టానుసారంగా నిధులను మార్చేస్తున్నారు.
ప్రైవేటు వ్యక్తి చేతిలో రాష్ట్ర ఖజానా
చంద్రబాబు చెప్పిన ఏ బిల్లులు చెల్లించాలో ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర సీఎఫ్‌ఎంఎస్ సీఈవోకు చెప్పేవారు. అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రకు మాత్రమే తెలియాల్సిన లాగిన్, పాస్‌వర్డ్‌ను ప్రవేట్ వ్యక్తి అయిన సీఈవోకు ఇచ్చేశారు. దీంతో రవిచంద్ర చెప్పిన బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులను కూడా కమీషన్లు తీసుకుని సీఈవో, మరో ముగ్గురు వ్యక్తులు చెల్లించేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఆర్థిక శాఖతో పాటు ట్రెజరీ, పీఏవో విభాగాలు డమ్మీగా మారిపోయాయి. ఆర్థిక శాఖ రెగ్యులర్ ఉద్యోగులు చేయాల్సిన పనులన్నీ సీఈవోకు అప్పగించారు. సీఎఫ్‌ఎంఎస్ పూర్తిగా సీఈవో కనుసన్నల్లో చంద్రబాబు చెప్పినట్లు, రవిచంద్ర చెప్పినట్లు కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులకే తెలియకుండా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్లకు చెందిన నిధులను సీఎఫ్‌ఎంఎస్‌లోకి తీసుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన రంగాలకు ఆయా నిధులను చెల్లించేశారు. దీంతో ఆయా కార్పొరేషన్లలోని ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు నిధుల్లేకుండా పోయాయి.
తప్పుడు వ్యవస్థకు రూ.168 కోట్లా?
ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే సీఎఫ్‌ఎంఎస్ నిర్వహణకు ఏకంగా రూ.168 కోట్లు వ్యయం చేశారు. ఇప్పటివరకు రూ.104 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.64 కోట్ల బకాయిలున్నాయి. అంతేకాకుండా అనధికారికంగా మరికొన్ని రూ.వందల కోట్లను సీఎఫ్‌ఎంఎస్ నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ఒక్కో ఉద్యోగికి రెండుసార్లు వేతనాలు
కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండుసార్లు వేతనాల రూపంలో రూ.200 కోట్లు చెల్లించారంటే సీఎఫ్‌ఎంఎస్‌ను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను నిలదీయడంతో మళ్లీ ఆ నిధులను వెనక్కి తెప్పించారు. డబుల్ ఎంట్రీల బిల్లులను అరికట్టడానికి రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్‌ను పాలకుల అవసరాలకు అనుగుణంగా మార్చారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పనిచేయడానికి వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై 42 మందిని తీసుకున్నారు. అలాగే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన 43 మందిని తీసుకున్నారు. ఆ తరువాత 145 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో రిజర్వేషన్లు పాటించలేదని, అలాగే మరో రెండు ఏజెన్సీల నుంచి కొంత మందిని ఔట్ సోర్సింగ్ కింద తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకుని, ఏ బిల్లులు చెల్లించాలో ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమే.
Comments
Please login to add a commentAdd a comment