వైఎస్‌ జగన్‌: విశాఖ, తిరుపతి, అనంత ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు | YS Jagan Review Meeting with IT and Electronics Communication Department Officials - Sakshi
Sakshi News home page

విశాఖ, తిరుపతి, అనంత ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు

Published Thu, Nov 21 2019 3:05 AM | Last Updated on Thu, Nov 21 2019 10:44 AM

CM YS Jagan Comments in IT and Electronics Communications Department review - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలను తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా ఆలోచించాలని చెప్పారు. అమెరికాలోని ఇండియానాలో ఉన్న కొలంబియా సిటీని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశిష్ట శైలి నిర్మాణాలన్నీ ఆ సిటీలో కనిపిస్తాయని, ఆ తరహాలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి, హై ఎండ్‌ టెక్నాలజీకి చిరునామాగా ఈ సిటీలు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు.

కంపెనీ సామర్థ్యం, సైజును బట్టి అక్కడ భూములు కేటాయిద్దామన్నారు. పరిశ్రమలు పెట్టదలుచుకున్న వారికి వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, అవినీతి లేకుండా పారదర్శక విధానంలో వారికి వసతులు సమకూరుస్తామన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీళ్లు, కరెంటు ఇద్దామని సీఎం చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా మంచి మానవ వనరులను అందిద్దామన్నారు. గత ప్రభుత్వంలో పాలసీల పేరు చెప్పి ప్రచారం చేసుకున్నారంటూ.. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల రాయితీలు/ప్రోత్సాహకాలను  చంద్రబాబు పూర్తిగా ఎగ్గొట్టడాన్ని సీఎం ఆక్షేపించారు. ఇప్పుడు అదే చంద్రబాబు పరిశ్రమల గురించి, పారిశ్రామికాభివృద్ధి గురించి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

సచివాలయాల్లో బలమైన ఐటీ వ్యవస్థ 
పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు.. వలంటీర్ల వ్యవస్థను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించి పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నేరుగా కలెక్టర్‌కు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం ఉండాలన్నారు. ఈ మేరకు సమాచార సాంకేతిక వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పరిపాలన వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే అవినీతిని తగ్గించవచ్చన్నారు. గ్రామ, వార్డు సచివాలయానికి వచ్చే వినతులు, ఆర్జీలు ఏ దశలో ఉన్నాయో నేరుగా కంప్యూటర్లో చూసే అవకాశం ఉండాలన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్డులను గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి ఇవ్వాలని సూచించారు.

ఇప్పటికే సచివాలయాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు, స్కానర్లతో పాటు వలంటీర్లకు సెల్‌ఫోన్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, ఇవి వచ్చాక వీటిని సక్రమంగా వినియోగించుకునేలా కొత్త అప్లికేషన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, పారదర్శకతతో పాటు పథకాల అమల్లో సంతృప్త స్థాయి తీసుకురావాలని చెప్పారు. అవినీతి, పక్షపాతం లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు చేరాలన్నారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన, బలమైన ఐటీ వ్యవస్థ ఉండాలన్నారు.

తిరుపతిలో టీసీఎస్‌ క్యాంపస్‌
తిరుపతిలో క్యాంపస్‌ పెట్టడానికి టీసీఎస్‌ సానుకూలంగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ పక్కనే హై ఎండ్‌ స్కిల్స్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న నూతన విధానాలు, పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై బోధన, శిక్షణకు సంస్థను ఏర్పాటు చేయడంపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. స్టార్టప్‌ల కోసం ఇదే ప్రాంగణంలో మరొక నిర్మాణం చేయాలన్నారు. 

ఐటీ విభాగంలోని సదుపాయాలను వినియోగించుకోవాలి
ఐటీ శాఖ పరిధిలో ఉన్న అనేక విభాగాలు నిర్వర్తిస్తున్న విధుల గురించి సీఎం ఆరా తీశారు. ఒకే పనిని రెండు మూడు విభాగాలు చేస్తుండటం వల్ల ఓవర్‌ ల్యాపింగ్‌ అవుతున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక అప్లికేషన్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చినా, ప్రభుత్వ విభాగాలతో సరైన సమన్వయం లేక.. ఆయా శాఖలు కొత్త అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నాయని వివరించారు. దీనివల్ల ప్రభుత్వ పరంగా ఉన్న వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామని చెప్పారు.

ఇతర శాఖలు తయారు చేయించుకుంటున్న అప్లికేషన్లలో సెక్యూరిటీ పరమైన లోపాలు కూడా ఉంటున్నాయని సీఎంకు వివరించారు. వీటిపై సీఎం స్పందిస్తూ.. ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్‌ కావాల్సి వచ్చినా తొలుత ఐటీ విభాగం అనుమతి ఇచ్చాకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సర్క్యులర్‌ జారీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఐటీ విభాగంలో ఉన్న సదుపాయాలు, వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా డూప్లికేషన్‌ లేకుండా ఐటీ శాఖలోని ఒక్కో విభాగానికి ఒక్కో పని అప్పగించాలని సూచించారు. ఆర్టీజీఎస్‌కు అనాలిటిక్స్‌ బాధ్యతను అప్పగించడం ద్వారా పూర్తి స్థాయి సేవలు పొందవచ్చని అధికారులు సూచించగా.. అందుకు సీఎం అంగీకరించారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement