వారంలోగా సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ | Check power to sarpanches during the week | Sakshi
Sakshi News home page

వారంలోగా సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

Published Tue, May 4 2021 3:30 AM | Last Updated on Tue, May 4 2021 11:53 AM

Check power to sarpanches during the week - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్‌లుగా గెలిచిన వారందరికీ చెక్‌ పవర్‌ను బదలాయించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌ల వివరాలను కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌)లో నమోదు చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం సోమవారం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుందని.. వారంలోగా సర్పంచ్‌లందరికీ చెక్‌ పవర్‌ కల్పిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

సీఎఫ్‌ఎంఎస్‌లో వివరాల నమోదుకు ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్‌ల గెలుపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్‌ సిగ్నేచర్‌ను అన్ని సబ్‌ ట్రెజరీ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ వివరాల నమోదు పూర్తయ్యాక జిల్లా ట్రెజరీ అధికారులు ఆమోదముద్ర వేయాలి. కాగా, గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా 2018 ఆగస్టు నుంచి ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన విషయం తెలిసిందే. ఏ గ్రామ పంచాయతీకి ఏ అధికారి ప్రత్యేకాధికారిగా కొనసాగారో వారికే చెక్‌ పవర్‌ అధికారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్‌ 3న పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్‌ పవర్‌ను బదలాయించే ప్రక్రియను పంచాయతీరాజ్‌ శాఖ వేగవంతం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement