సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్, పోలవరం ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ (పీఎంయూ) చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్న రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్‌ఈసీ) సమావేశం కానుంది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించనుంది. వీటికి కమిటీ ఆమోద ముద్ర వేస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
ఆ తర్వాత వీటిని కేంద్ర కేబినెట్‌కు పంపుతారు. చివరగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నిని చల్లార్చేందుకు పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని వంద శాతం భరించి.. పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో కేంద్రం సూచించినా స్పందించలేదు కదా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తమకే అప్పగించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 2016 సెప్టెంబరు 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి.. 2014 ఏప్రిల్ 1 తర్వాత నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే తిరిగిస్తామని కేంద్రం షరతు విధించింది.
అక్రమాలే అడ్డంకి
పీపీఏ నియమావళిలో సెక్షన్ 9(1) ప్రకారం అనుమతి తీసుకోకుండా అంచనా వ్యయం పెంచడం.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేయడం.. కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించడం గానీ చేయకూడదు. కానీ.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న తర్వాత 2016 సెప్టెంబర్ 8న హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,535.91 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనులను రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ అదే ఏడాది డిసెంబర్ 6న చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేయించారు. తొలుత సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కమీషన్లు దండుకున్న చంద్రబాబు.. అధికారంతమున పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. రూ.7,984.93 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యుర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే నామినేషన్ పద్ధతిలో లంప్సమ్ (ఎల్‌ఎస్)–ఓపెన్ విధానంలో పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోనూ భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారు. విడుదల చేసిన నిధులకు యూసీలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) పంపితే.. అక్రమాలు బట్టబయలవుతాయనే ఉద్దేశంతో వాటిని పంపకుండా మోకాలడ్డారు. దాంతో నిధుల విడుదల విషయంలో కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది. 2018 జూలై 26న తుది సారిగా కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ స్టేట్‌మెంట్ పంపాలని జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో కేంద్రం ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.
ప్రతిపాదనలు పంపడానికి 30 నెలలా!
పీపీఏ మొదటి సర్వసభ్య సమావేశం 2015 మార్చి 12న హైదరాబాద్‌లో జరిగింది. అప్పటి సీఈవో దినేష్‌కుమార్ పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం తాజా ధరల మేరకు ఎంతో తేల్చి.. సంబంధిత ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. 30 నెలల తర్వాత రూ.57,940.86 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ 2017 ఆగస్టు 16న పీపీఏ ద్వారా కేంద్ర జల వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో కేంద్ర జల వనరుల శాఖ అనేక మార్లు వీటిని సమీక్షించింది. చివరకు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు కుదించారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఫిబ్రవరి 11న కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించి.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. వీటిని కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. వీటిపై చర్చించడానికి మంగళవారం ఆర్‌ఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.
పారదర్శకతకు పెద్దపీట వేయడంతో..
సీఎం ప్రమాణ స్వీకారం చేయక ముందే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సత్వరమే నిధులు ఇవ్వాలని కోరారు. విడుదల చేసిన నిధులకు యూసీలను ఎప్పటికప్పుడు పంపుతామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలను సహించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఈనెల 15న నీతి అయోగ్ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈనెల 20న పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సందర్భంలోనూ అక్రమాలను సహించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోగా పోలవరం పనులపై ఆడిట్ నిర్వహించి.. అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే ఈనెల 22న నిపుణుల కమిటీతో సమా వేశమైన సీఎం వైఎస్ జగన్ తక్షణమే పోలవరం పనులపై విచారణ చేయాలని సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటంతో ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల వ్యవహారాన్ని తక్షణమే తేల్చాలని కేంద్ర ఆర్థిక శాఖను ప్రధాని ఆదేశించారు.
సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు
రాజ్యసభలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి కటారియా జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు. వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మహ్మద్ అలీఖాన్ సోమవారం రాజ్యసభలో అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘గతేడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను 2013–14, 2017–18 ధరల సూచీకి అనుగుణంగా వరుసగా రూ.57,941 కోట్లు, రూ.57,297.42 కోట్ల మేర కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించింది. జలవనరుల శాఖలోని సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల విభాగం సలహా కమిటీ.. ఫిబ్రవరి 11న జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. 2017–18 ధరల ప్రాతిపదికన సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించింది. దీని ప్రకారం.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,202.69 కోట్లు, హెడ్‌వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్‌హౌస్ పనులకు రూ.4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్ల మేర ఆమోదం తెలిపింది’ అని మంత్రి వివరించారు.
అమరావతి రింగ్ రోడ్డు ఎంవోయూకు సిద్ధం
విజయవాడ, అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ‘అమరావతిలో రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌కు మేం ఏనాడో ఆమోదం తెలిపాం. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ వ్యయంలో 50 శాతం కేంద్రమే భరించాలని కోరింది. ఈ ప్రతిపాదనకు మేం అంగీకరించాం. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ముందుకు వస్తే ఎంవోయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.
అలాగే అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్రమే భరించాలని కేంద్రం చెబుతోందని, రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అనుగుణంగా లేనందున కేంద్రం భరించాలని విజయసాయిరెడ్డి కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే మార్గం చూడాలన్నారు. అనంతపురం జిల్లా జంతలూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు కేంద్ర మంత్రిమండలి గతేడాది మేలో ఆమోదం తెలిపిందని, అయితే దీనికి సెంట్రల్ యూనివర్సిటీ (సవరణ) బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment