Government treasury
-
‘దారి’ తప్పిన ఇసుక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక ‘దారి’ తప్పుతోంది. అటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా.. ఇటు జనానికి తక్కువ ధరకు దొరక్కుండా.. కాంట్రాక్టర్లు, దళారీల చేతిలో చిక్కుకుపోతోంది. ఇసుక విక్రయాల్లోని లొసుగులను వారు ఆసరాగా చేసుకుంటే.. అధికారుల కక్కుర్తి ఆ అవకతవకలకు తోడవుతోంది. అందులోనూ ప్రస్తుత వానాకాలంలో ఏర్పడిన ఇసుక కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ పనుల కోసమంటూ అడ్డగోలుగా బల్క్ అలాట్మెంట్లు చేయించుకుంటూ.. ఆ ఇసుకను వినియోగదారులకు అడ్డగోలుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జలమండలి పేరిట జరిగిన ‘బల్క్ అలాట్మెంట్’ వ్యవహారం దీనికి ఓ మచ్చుతునక మాత్రమే. లొసుగులను వాడుకుంటూ.. రాష్ట్రంలో ఇసుక విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.700 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఆన్లైన్లో ఇసుక విక్రయాల కోసం ‘శాండ్ సేల్ మేనేజ్మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఎస్ఎస్ఎంఎంఎస్)’ను అమలు చేస్తోంది. అందరికీ అందుబాటు ధరలో ఇసుక అందాలన్నదే దీని లక్ష్యం. కానీ రీచ్‌ల నుంచి ఇసుక వెలికితీసే కాంట్రాక్టర్ల నుంచి రవాణా, వేబ్రిడ్జీల దాకా జరుగుతున్న అక్రమాలు ఇసుక ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో వాగులు, నదుల్లో ప్రవాహాలతో ఇసుక తవ్వకాలు తగ్గిపోయాయి. ఈ కొరతను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ విభాగాలను కూడా వాడుకుంటుండటం గమనార్హం. కాంట్రాక్టర్ల గుప్పిట్లో స్టాక్ పాయింట్లు ప్రభుత్వం గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి వెలికితీసి, స్టాక్ పాయింట్లకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో అంతా తామే అన్నట్లుగా చక్రం తిప్పుతున్నారు. ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలో వీరి కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. శాండ్ సేల్ మేనేజ్మెంట్, మానిటరింగ్ విధానంలో కేవలం ఇసుక వెలికితీత, స్టాక్‌యార్డుకు తరలింపునకు మాత్రమే కాంట్రాక్టర్లు పరిమితం కావాలి. అయితే ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకున్న లారీల్లో ఇసుకను లోడ్ చేయాల్సిన సందర్భంలోనే.. కాంట్రాక్టర్లు వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ, అక్రమాలకు తెరలేపుతున్నారు. ఒక్కో లారీలో అదనంగా రెండు, మూడు టన్నులు లోడ్ చేస్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ(టీజీఎండీసీ) ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా లారీల్లో అక్రమంగా లోడ్ చేసే ఇసుక విలువ రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలపైనే ఉంటుందని అంచనా. ఇందులో కాంట్రాక్టర్లు, స్థానిక పోలీసులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, రాజకీయ నాయకుల వరకు ముడుపులు అందుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఇసుక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని 16 మంది పోలీసు సిబ్బంది సస్పెండ్ కావడం గమనార్హం. ఇసుక వెలికితీత, విక్రయాలను పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు.. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో మూడు, నాలుగు రెట్ల ధర ఆన్లైన్ విధానంలో ఒక్కో టన్ను ఇసుక ధర రూ.630 మాత్రమే. కానీ మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్నుకు రూ.1,900, దొడ్డు ఇసుక రూ.1,600పైనే పలుకుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో టన్ను ఇసుక ధర రూ.2,200కు కూడా చేరింది. రవాణా చార్జీలతోపాటు స్టాక్ పాయింట్ల నుంచి చివరికి చేర్చేదాకా.. వివిధ దశల్లో ఇవ్వాల్సిన ముడుపుల మూలంగా ఇసుక ధర భారీగా ఉంటోందని లారీల యజమానులు చెప్తున్నారు. ఇక కొందరు దళారులు, ఇసుక వ్యాపారులు వే బ్రిడ్జిల వారితో కుమ్మక్కై అదనంగా బరువు చూపుతూ కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. ఒక్కో లారీపై కొనుగోలుదారులు రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు నష్టపోతున్నట్టు అంచనా. బహిరంగ మార్కెట్‌కు బల్క్ అలాట్మెంట్లు రాష్ట్రంలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు బల్క్ అలాట్మెంట్ల పేరిట దండుకుంటున్నారు. టీజీఎండీసీ ఏటా సగటున కోటిన్నర క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను విక్రయిస్తుండగా.. అందులో సుమారు 10 నుంచి 15శాతం ప్రభుత్వ అవసరాల కోసం కేటాయిస్తోంది. ప్రభుత్వ శాఖల అధికారులు టీజీఎండీసీ వద్ద ఆన్లైన్ ఖాతాను సృష్టించి, తమ లాగిన్ ద్వారా ప్రభుత్వ పనులకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేసి, ఎంత మొత్తంలో ఇసుక అవసరమో పేర్కొనాల్సి ఉంటుంది. టీజీఎండీసీ ఆ పత్రాలను పరిశీలించి, ఏకమొత్తంలో ఇసుక కేటాయింపు (బల్క్ అలాట్మెంట్) చేస్తుంది. అయితే కొందరు అక్రమార్కులు ప్రభుత్వ శాఖల లాగిన్‌ను కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు ఇటీవల జలమండలి పేరిట జరిగిన దందాతో వెల్లడైంది. 90లక్షల టన్నుల ఇసుక జలమండలి లాగిన్ ద్వారా కమర్షియల్ మార్కెట్‌కు చేరినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీజీఎండీసీ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై టీజీఎండీసీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుండటంతో పూర్తి వివరాలు వెల్లడించేందుకు టీజీఎండీసీ అధికారులు సుముఖత చూపడం లేదు. -
టీడీపీ నేతల గ్రానైట్ దందా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్ కంపెనీకి చెందిన ఇన్వాయిస్, మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్‌పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్‌ను క్యూబిక్ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్ లారీలను తరలించారు. దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్‌ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్‌ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. 270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. -
భూమి విలువ పెరగనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువ సవరణ ఈ ఏడాదీ జరిగే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు జరగని ప్రక్రియకు ఈ ఏడాదైనా అనుమతి వస్తుందని భావించినా, ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రావాల్సిన సవరణ విలువలు వచ్చేలా లేవు. ఇప్పుడు అనుమతినిచ్చినా ప్రక్రియ పూర్తికి 3నెలలు పడుతుందని, అక్టోబర్ నాటికి సవరించిన విలువలు అందుబాటులోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నా.. భూముల మార్కెట్ విలువలను సవరించే ప్రక్రియపై సర్కారు ఏమీ తేల్చకపోవడంతో ఈ ఏడాదీ సవరణలు జరిగే అవకాశం లేదని వారు భావిస్తున్నారు. ఆరేళ్ల విలువల ఆధారంగానే.. భూముల క్రయ, విక్రయ లావాదేవీలతో పాటు నష్టపరిహారం చెల్లింపులోనూ మార్కెట్ విలువే కీలకం కానుంది. అయితే, ఉమ్మడి ఏపీలో ఆరేళ్ల క్రితం 2013లో మార్కెట్ విలువను సవరించగా అప్పటి నుంచి అవే ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, మార్పుల కారణంగా బహిరంగ మార్కెట్లో భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. ఆరేళ్ల నుంచి మార్కెట్ విలువలో హెచ్చుతగ్గులు లేకపోవడంతో కొన్ని భూములు, ఆస్తులకు రిజిస్ట్రేషన్ల విలువను రెండింతలు ఎక్కువగా వేసి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతో భూముల మార్కెట్ విలువలను సవరించి సహేతుక ధరలను నిర్ధారించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశలో నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ ఏడాదీ భూముల విలువలను సవరించే ప్రక్రియకు అనుమతినివ్వాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. 50 శాతం అదనపు ఆదాయం ఈ ఆరేళ్ల నుంచి కనీసం 2 సార్లు సవరణ జరగాల్సిన భూముల విలువలు ఆరేళ్ల క్రితం విలువలతోనే ఆగిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. మార్కెట్ విలువల సవరణలు జరిగితే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల ద్వారా 50శాతం ఆదాయం లభిస్తుందని అధికారులు చెపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.5,700 కోట్ల ఆదాయం రాగా, మార్కెట్ విలువలను సవరిస్తే అది రూ.8,500 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపి అక్టోబర్ నుంచి సవరించిన మార్కెట్ విలువలు వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని తెలుస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం భూముల విలువలను సవరించేందుకు ససేమిరా అంటుండడం గమనార్హం. సిద్ధమైనా.. పెద్ద కసరత్తే భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ, రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను నియమించుకోవాలి. వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, వ్యవసాయేతర భూములకు జాయింట్ కలెక్టర్లు కన్వీనర్లుగా కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల, గ్రామాల వారీగా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఆ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే, ప్రభుత్వ ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. అయితే, ఆనవాయితీ ప్రకారం భూముల మార్కెట్ విలువలు ఎప్పుడు సవరించినా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం అనుమతించినా ఆగస్టు1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. -
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఖజానా తాళం!
సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకతను కాపాడేందుకు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనైతిక చర్యలకు, కమీషన్లు దండుకోవడానికి వాడుకుంటోంది. టెక్నాలజీ పేరుతో ప్రభుత్వ ఫైళ్లు, బిల్లుల చెల్లింపులను ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టేసింది. సదరు ప్రైవేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. అందిన చోటల్లా కమీషన్లు మింగేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్) పేరిట సాగుతున్న అవినీతి అంతా ఇంతా కాదు. ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శులకు కూడా ఏం జరుగుతోందో తెలియకుండా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టడం ఎంత ప్రమాదమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లావాదేవీల్లో గోల్మాల్ ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు, పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థను(సీఎఫ్ఎంఎస్) తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించడంలో ఎన్ఐఐటీ అనే సంస్థ విఫలం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ఐఐటీని తప్పించి, ‘సాప్ ఇండియా’ అనే సంస్థకు సాఫ్ట్‌వేర్‌ను అందించే బాధ్యత అప్పగించారు. సాప్ ఇండియా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తోనే సీఎఫ్ఎంఎస్ కొనసాగుతోంది. అయితే, గత ఏడాదిన్నరగా సీఎఫ్ఎంఎస్ పేరుతో సాగుతున్న ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ పక్కదారి పట్టాయి. సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీఈవో) ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. దాంతో పెత్తనమంతా ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయింది. నిబంధనల ప్రకారం.. తొలుత వచ్చిన బిల్లులను తొలుత చెల్లించాలి. ప్రాధాన్యతా క్రమంలో అంటే అత్యవసరాలకు చెందిన బిల్లులను ముందుగా క్లియర్ చేయాలి. గత ఏడాదిన్నరగా ఈ రెండు నిబంధనలను అటుకెక్కించేశారు. స్వప్రయోజనాల కోసమే సీఎఫ్ఎంఎస్ రాష్ట్ర విభజనకు ముందు సీఎఫ్ఎంఎస్ ఇంకా అమల్లోకి రాకముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఫ్లాట్‌ఫాంపై కాంట్రాక్టర్లు ఎవ్వరూ కూడా బిల్లుల కోసం ఆర్థిక శాఖకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో బిల్లు మానటరింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవడంతో పీఏవో కార్యాలయానికి వెళ్లి బిల్లు సమర్పించి సీనియారిటీ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ బిల్లును ఆన్లైన్లో సమర్పిస్తే సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత బిల్లు సరిగ్గా ఉందా లేదా అనేది స్క్రూటినీ అయిన తర్వాత మళ్లీ సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ సీనియారిటీ నెంబర్ మేరకు బిల్లుల చెల్లింపు ఆన్లైన్లో జరిగిపోయేది. అయితే, ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ అమల్లోకి వచ్చాక బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పాతర వేశారు. కమీషన్లు ఇచ్చిన వారికే బిల్లులు సీనియారిటీ అనేది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్లు దండుకుని ఏ బిల్లుకు టిక్ పెడితే ఆ బిల్లులను చెల్లించేస్తున్నారు. పలుకుబడి లేని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల జరగడం లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆర్థిక శాఖ కార్యకలాపాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నిలిపివేశారు. ఆశ్రమ పాఠశాలల్లో డైట్ చార్జీలు, హోంగార్డుల వేతనాలను, పోలీసుల టీఏ, డీఏ బిల్లులను కూడా చెల్లించలేదు. ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి నుంచి పిల్లల వివాహాలు, ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. కేవలం చంద్రబాబు చెప్పిన వారికే బిల్లులు చెల్లించేలా సీఎఫ్ఎంస్ వ్యవస్థను దిగజార్చారు. ఏదైనా ఒక రంగంలో ఎంత వ్యయం చేశారో సీఎఫ్ఎంఎస్లో వివరాలుండాలి. కానీ, ఎక్కడా కనిపించడం లేదు. ఒక పద్దు నుంచి మరో పద్దుకు ఇష్టానుసారంగా నిధులను మార్చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి చేతిలో రాష్ట్ర ఖజానా చంద్రబాబు చెప్పిన ఏ బిల్లులు చెల్లించాలో ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర సీఎఫ్ఎంఎస్ సీఈవోకు చెప్పేవారు. అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రకు మాత్రమే తెలియాల్సిన లాగిన్, పాస్‌వర్డ్‌ను ప్రవేట్ వ్యక్తి అయిన సీఈవోకు ఇచ్చేశారు. దీంతో రవిచంద్ర చెప్పిన బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులను కూడా కమీషన్లు తీసుకుని సీఈవో, మరో ముగ్గురు వ్యక్తులు చెల్లించేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఆర్థిక శాఖతో పాటు ట్రెజరీ, పీఏవో విభాగాలు డమ్మీగా మారిపోయాయి. ఆర్థిక శాఖ రెగ్యులర్ ఉద్యోగులు చేయాల్సిన పనులన్నీ సీఈవోకు అప్పగించారు. సీఎఫ్ఎంఎస్ పూర్తిగా సీఈవో కనుసన్నల్లో చంద్రబాబు చెప్పినట్లు, రవిచంద్ర చెప్పినట్లు కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులకే తెలియకుండా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్లకు చెందిన నిధులను సీఎఫ్ఎంఎస్లోకి తీసుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన రంగాలకు ఆయా నిధులను చెల్లించేశారు. దీంతో ఆయా కార్పొరేషన్లలోని ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు నిధుల్లేకుండా పోయాయి. తప్పుడు వ్యవస్థకు రూ.168 కోట్లా? ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే సీఎఫ్ఎంఎస్ నిర్వహణకు ఏకంగా రూ.168 కోట్లు వ్యయం చేశారు. ఇప్పటివరకు రూ.104 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.64 కోట్ల బకాయిలున్నాయి. అంతేకాకుండా అనధికారికంగా మరికొన్ని రూ.వందల కోట్లను సీఎఫ్ఎంఎస్ నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగికి రెండుసార్లు వేతనాలు కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండుసార్లు వేతనాల రూపంలో రూ.200 కోట్లు చెల్లించారంటే సీఎఫ్ఎంఎస్ను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను నిలదీయడంతో మళ్లీ ఆ నిధులను వెనక్కి తెప్పించారు. డబుల్ ఎంట్రీల బిల్లులను అరికట్టడానికి రూపొందించిన సీఎఫ్ఎంఎస్ను పాలకుల అవసరాలకు అనుగుణంగా మార్చారు. సీఎఫ్ఎంఎస్లో పనిచేయడానికి వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై 42 మందిని తీసుకున్నారు. అలాగే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన 43 మందిని తీసుకున్నారు. ఆ తరువాత 145 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్లు పాటించలేదని, అలాగే మరో రెండు ఏజెన్సీల నుంచి కొంత మందిని ఔట్ సోర్సింగ్ కింద తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకుని, ఏ బిల్లులు చెల్లించాలో ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమే. -
అధికారాంతమునా బాబు చేతివాటం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు అధికారాంతంలోనూ చేతివాటం ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు తన దోపిడీ పథకానికి మరింత పదును పెట్టింది. ప్రభుత్వ ఖజానాను దోచేసి.. పార్టీకి మరింత ఇం‘ధనం’ సమకూర్చిపెట్టడం ద్వారా ఎన్నికల్లో వెదజల్లడానికి పన్నాగం వేయడమేగాక దీన్ని కేవలం నెలరోజుల్లోనే అమలు చేసింది. ఎన్నికలకు ముందు ఆగమేఘాలపై 17 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి విషయంలో చర్యలు చేపట్టింది. ఆర్థికశాఖ అభ్యంతరాల్ని సైతం తోసిరాజని సాక్షాత్తూ ముఖ్యమంత్రే సంతకం చేసి ఆమోదముద్ర వేయడం గమనార్హం. అంతేగాక జీవో 94ను తుంగలో తొక్కుతూ టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.18,648.71 కోట్ల విలువైన పనులను తన కోటరీకి చెందిన నలుగురు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఇందుకోసం జలవనరుల శాఖను పావుగా వాడుకున్నారు. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19% నుంచి కనిష్టంగా 3.52% ఎక్సెస్(అధిక) ధరకు కోట్ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.ఆరువేల కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారినట్టు సమాచారం. సీఎం ‘దోపిడీ’ వ్యూహంలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పావుగా మారారని, నిబంధనల ప్రకారం అంచనా వ్యయాన్ని నిర్ణయించి, టెండర్లు నిర్వహించి ఉంటే రూ. ఆరువేల కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యేదని ఆ శాఖ సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అంతా దోపిడే..: రాష్ట్రంలో కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేస్తామని జూలై 28, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల పనులకు 64,334 కోట్లు ఖర్చుచేసినా.. ఒక్క పెండింగ్ ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు.. ఈ వ్యవహారంలో రూ. 25 వేల కోట్లకుపైగా బాబు అండ్ కో దోచేసినట్టు అధికారవర్గాలే కోడై కూస్తున్నాయి. ఆర్థిక శాఖ అభ్యంతరాలు తుంగలోకి..: ఏదైనా సాగునీటి ప్రాజెక్టు పనులకు పరిపాలన అనుమతివ్వాలంటే.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్), హైడ్రలాజికల్ క్లియరెన్స్‌లు తప్పనిసరి. కానీ ఆ రెండు లేకుండానే కేవలం లైన్ ఎస్టిమేట్లు(ఉజ్జాయింపు అంచనాలు) ఆధారంగా గోదావరి–పెన్నా నదుల తొలిదశ అనుసంధానం, వైకుంఠపురం బ్యారేజీ, వంశధార–బాహుదా అనుసంధానం, వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడికాలువ, సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండోదశ, ముక్త్యాల ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–యోగివేమన రిజర్వాయర్–హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ తదితర పనులకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకపోవడం.. కొన్ని ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం.. కనీసం డీపీఆర్ లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ ఆ ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ప్రాజెక్టులకు అనుమతిచ్చే ఫైళ్లపై సీఎం నేరుగా సంతకం చేశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాల రూపకల్పనలోనే వంచనకు పాల్పడిన సీఎం.. వాటికి టెండర్ నోటిఫికేషన్ చేయకముందే కోటరీ కాంట్రాక్టర్లతో బేరసారాలకు దిగారు. కమీషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా..: వాస్తవానికి టెండర్లను జూలై 1, 2003న జారీ చేసిన 94 జీవో ప్రకారమే నిర్వహించాలి. కానీ 2014లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ జీవోను తుంగలో తొక్కుతూ వచ్చింది. ఎన్నికలకు ముందు చేపట్టే ప్రాజెక్టుల పనులను కోటరీ కాంట్రాక్టర్లకే కట్టబెట్టే వ్యూహంలో భాగంగా.. జీవో 94కు విరుద్ధంగా టెండర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సీఈలను హెచ్చరిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో తొలుత అంతర్గత ఉత్తర్వులు జారీ చేయించారు. తర్వాత నెలరోజుల వ్యవధిలోనే 17 ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి.. వారిని కుమ్మక్కు చేసిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుల పనులను పంచేశారు. అనంతరం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ ఆ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లపై సీఎం ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన సీఈలు జీవో 94కు విరుద్ధంగా నిబంధనలను రూపొందించి.. టెండర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. అక్రమాలను సక్రమం చేశారనడానికి ఆధారాలు ఇవిగో.. - వైకుంఠపురం బ్యారేజీ పనులకు 13.19 శాతం ఎక్సెస్‌కు నవయుగ–ఆర్వీఆర్(జేవీ) షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఐదుశాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూలు కోట్ చేస్తే టెండర్ రద్దు చేయాలి. కానీ కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చి.. వాటిని ఆమోదించేందుకు సీవోటీకి పంపారు. ఈలోగా ఐదు శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేస్తే టెండర్ రద్దు చేయాలన్న నిబంధన నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. తర్వాత టెండర్‌పై సీవోటీ ఆమోదముద్ర వేసింది. - వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడటం) పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధన పెట్టారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చునని నిబంధన పెట్టారు. దీన్ని ఆమోదిస్తూ జలవనరులశాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. - కోటపాడు–చానుబండ– విస్సన్నపేట ఎత్తిపోతల పనుల్ని ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడానికి జీవో 94కు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది నిబంధనలను టెండర్ నోటిఫికేషన్లోచేర్చారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాక.. వాటికి జీవో 94 నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. - గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ,వంశధార–బాహుదా నదుల అనుసంధానం నుంచి ముక్త్యాల ఎత్తిపోతల వరకూ 17 ప్రాజెక్టుల పనుల టెండర్లలోనూ ఇదే కథ కొనసాగింది. పనులన్నీ నలుగురు కాంట్రాక్టర్లకే 2014కు ముందు సాగునీటి ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించడంవల్ల గరిష్టంగా 27 శాతం నుంచి కనిష్టంగా 8.77 శాతం లెస్(తక్కువ) ధరలకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. దీనివల్ల అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయ్యింది. కానీ ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలో 17 ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో నలుగురు కాంట్రాక్టర్లకే రూ.18,648.71 కోట్ల విలువైన పనులు దక్కాయి. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19 శాతం నుంచి కనిష్టంగా 3.52 శాతం ఎక్సెస్(అధిక) ధరకు కోట్ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల ఖజానాకు భారీగా నష్టం చేకూరింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన టెండర్లను సీవోటీ రద్దు చేస్తుంది. అయితే సీవోటీ నిర్ణయం తీసుకోక ముందే.. టెండర్లలో పెట్టిన నిబంధనలకు జీవో 94 నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. దాంతో ఆ పనుల టెండర్లను సీవోటీ ఆమోదించింది. ఈ పనులను ఆగమేఘాలపై కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జలవనరులశాఖ ఒప్పందాలు చేసుకుంది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే దిశగా పావులు కదుపుతున్నారు. -
నిఘా.. నిద్ర నటిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము వస్తుందా? రాకుంటే ఎందుకు రావడం లేదు, దాని వెనకున్న కారణాలేంటి? ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అధికార యంత్రాంగం లేదా కాంట్రాక్టర్ల వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తోందా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాల్సిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గాడితప్పినట్టు కనిపిస్తోంది. గతంలో విజిలెన్స్ విభాగం నుంచి నివేదిక వచ్చిందంటే సంబంధిత అధికారులుగానీ, కాంట్రాక్టర్లుగానీ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిగా నత్తనడకన సాగుతోందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చేయి తడిపితే చాలు.. హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించే బిల్డర్లు, నిర్మాణాలు చేస్తున్న యజమానుల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏ ప్రణాళికైనా వారి జేబులు నింపుకోవడానికే పరిమితమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి డివిజన్‌పరిధిలో భవనాలు నిర్మిస్తున్న ఓ బిల్డర్ నిబంధనలు అతిక్రమించి కట్టడాలు సాగిస్తున్నాడని జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసులు స్వీకరించిన సంబంధిత బిల్డర్లు అధికారులకు ఎంతో కొంత సమర్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదే బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కంగారుపడ్డ సంబంధిత బిల్డర్ జీహెచ్ఎంసీ అధికారిని ఫోన్లో ఆరా తీయగా, తమకు ఇచ్చినట్టుగానే విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తే నిర్మాణం సక్రమంగా సాగుతుందని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారికి రూ. 3 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇలా హైదరాబాద్‌లోని వందలాదిమంది బిల్డర్లు, సంబంధిత యజమానులకు ఇదే రీతిలో నోటీసులు జారీచేయడం, వాటి పేరున దండుకోవడం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రీతిలో రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లకు అమ్ముతున్నారని రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి రెండు లారీలను శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు తెలిసింది. ఈ రెండు ఘటనలే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే గుట్టుగా సాగిపోవడానికి విజిలెన్స్ అధికారుల ఆమ్యామ్యాల వ్యవహారమే కారణమని చర్చ జరుగుతోంది. గతంలో నల్లగొండ విజిలెన్స్ అధికారి భాస్కర్‌రావు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా, ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఉన్నతాధికారులనే కలవరానికి గురిచేస్తుంది. రిపోర్టులేవి..? ప్రభుత్వాలకు పథకాల అమలు, అమలులో ఉన్న సమస్యలు, అవినీతి వ్యవహారాలు, పక్కదారి పట్టిస్తున్న అధికారుల వివరాలతో కూడిన నివేదికలను ప్రతినెలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న అధికార వ్యవస్థ ఎక్కడా కూడా ఏ పథకాలపైగానీ, ఏ ప్రాజెక్టుపైగానీ, లోపభూయిష్టమైన ఏ వ్యవస్థపైనా ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా పంపిన దాఖలాల్లేవని సచివాలయ వర్గాలు చెబుతున్నా యి. పైగా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవతలి వ్యక్తికి సమాచారమిచ్చి వసూళ్లు చేసుకుం టున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలెదుర్కుంటున్న సంస్థలు, ఆయా వ్యక్తులకు మేలు చేకూర్చేలా నివేదికలివ్వడాన్ని ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పాలన గాడి తప్పినట్టేనా? ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ హోదా అధికారి ఉండి అజమాయిషీ చేసేవారు. కానీ ఇప్పుడు డీజీ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు రావడం, సమీక్షించే సమయం కూడా లేకపోవడంతో విజిలెన్స్ విభాగం గాడితప్పినట్టు ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో విజిలెన్స్ నివేదికలపై ఏ ఒక్క సంస్థపైగానీ, అధికారిపైగానీ చర్యలు తీసుకోలేదంటే పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ త్రివేది వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్ త్రివేది హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఈ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పనిఒత్తిడితో సచివాలయానికే పరిమితం కావడం వల్ల విజిలెన్స్ విభాగం గాడితప్పుతున్నట్టు స్వంత విభాగంలోనే చర్చించుకుంటున్నారు. -
లే అవుట్ లు
జిల్లాలో అడ్డగోలుగా ‘ప్లాట్ల’ దందా రూ. కోట్లలో సర్కారు ఖజానాకు గండి నిజామాబాద్, కామారెడ్డిల్లో లేఅవుట్ లేని ప్లాట్ల విక్రయాలు పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది అండదండలతో.. పట్టింపులేని అధికార యంత్రాంగం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ‘మాయ’ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం మళ్లీ జోరందుకుంటోంది. ఇంతకాలం మందకొడిగా సాగ గా... ఇటీవల మళ్లీ లేఅవుట్ల దందా మొదలైంది. కొంత పెట్టుబడి... నేతల అండ ఉంటే చాలు వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా మారిపోతున్నాయి. వ్యవసా య పొలాలను నివేశన స్థలాలుగా మారుస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది చేయి తడిపి రూ.లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారు నిజామాబాద్, కామారెడ్డి, సదాశివనగర్లతో పాటు నిజామాబాద్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ప్లాట్లు చేస్తున్నారు. బైపాస్‌రోడ్డు ప్రారంభం కావడంతో ఈ రోడ్డు చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వెలుస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలతో మధ్య తరగతి వాసులను ఆకట్టుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్మును రూ.కోట్లలో ఎగ్గొడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో అధికారులు ‘అమ్యామ్యాలు’ పుచ్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న భూములను వ్యవసాయ క్షేత్రాలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు.. నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాల శివారులతో పాటు జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నా కనీస చర్యలు లేవు. గతేడాది జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు సానుకూలంగా స్పందించడం కామారెడ్డి ప్రాంతంలో ఈ వ్యాపారానికి తెర తీసినట్లయ్యింది. కామారెడ్డి-హైదరాబాద్ మధ్యన ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కామారెడ్డి చుట్టూ అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. నిజామాబాద్-కామారెడ్డి మధ్యన జాతీయ రహదారి పొడువునా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నచోట కూడ లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లకు తెరతీశాయి. నిజామాబాద్ నగర శివారులో ఓ బడానేత అండదండలతో అక్రమ నిర్మాణాలే కాదు అక్రమ వెంచర్లు కూడ వెలిశా యి. ఇలా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 22 చోట్ల స్థిరాస్తి వ్యాపారం కోసం అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేయగా పంచాయతీ, నగర/పట్టణ పాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 1200 ఎకరాలకు పైగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు అధికారవర్గాల అంచనా. నిబంధనలను పాటించని వ్యాపారులు... ప్లాట్ల వ్యాపారం చేస్తున్న వారు కనీస నిబంధనలను పాటించడం లేదు. లేఅవుట్ వేసేందేకు ముందుగా పంచాయతీ ఆమోదం, నగరాలు, పట్టణాల్లో మున్సిపాల్టీ తీర్మానం చేయాల్సి ఉంది. లేఅవుట్ వేస్తున్న భూమిని భూ మార్పిడి కింద (వ్యవసాయేతర వినియోగం) రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇందుకు గాను భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం సొమ్మును రుసుము కింద చెల్లించాలి. పదెకరాల్లో లేఅవుట్ వేస్తే దాని రిజిస్ట్రేషన్ విలువను బట్టి 10 శాతం రుసుము ఉంటుంది. ఉదాహరణకు ఎకరా రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తే... రూ.3 లక్షలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్‌కు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని అనుమతి పొందాలి. లేఅవుట్ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజోపయోగానికి వదిలివేయాలి. గ్రామ పంచాయతీ అయితే పంచాయతీకి, పట్టణాల్లో అయితే మున్సిపాల్టీలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. అనుమతి పొందిన లేఅవుట్లో ప్రణాళికా విభాగం సూచించిన స్థలాన్నే ప్రజోపయోగానికి వదిలి వే యాలి. ఈ స్థలాల్లో సామాజిక భవనం, పాఠశాలలు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టే వీలుంటుంది. కానీ ఎక్కడా వీటిని పాటించడం లేదు. రూ.కోట్లలో ఎగవేస్తున్నరియల్ ఎస్టేట్ వ్యాపారులు... జిల్లాలో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆరు నెలల్లో దాదాపు 200 పైగా లేఅవుట్లు వెలిశాయి. ఈ భూమి ఎకరాకు కనీసం రూ.30 లక్షల వంతున విలువ రూ.300 కోట్లు. ఇందులో 10 శాతం రుసుము ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే వ్యాపారులు, అధికారులు కూడబలుక్కొని రూ.30 కోట్ల వరకు ఎగవేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లే అవుట్లలో 10 శాతం స్థలాన్ని కూడా వదల్లేదు. కొన్నింటికీ గ్రామ పంచాయతీల తీర్మానాలు, ఆమోదం లేవు. ♦ నిజామాబాద్ శివారులో గ్రామీణ మండలం పరిధిలోని వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా సుమారు 50 ఎకరాల్లో అక్రమంగా 10 దాకా లేఅవుట్లు వెలిశాయి. అందులో చాలా వాటికి నగరపాలక సంస్థ, పంచాయతీల ఆమోదం లేదు. ♦ కామారెడ్డి పట్టణంతో పాటు పట్టణ శివారులో జాతీయ రహదారికి ఇరువైపులా లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అటు మున్సిపాలిటీ, ఇటు సంబంధిత పంచాయతీ ఆమోదం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్న సీఎం హామీతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. ♦ నిజామాబాద్ - డిచ్పల్లి బైపాస్ రోడ్డులో నిజామాబాద్‌లో బ్రిడ్జిని ఆనుకుని ఓ వెంచర్ వెలిసింది. ఈ వెంచర్లో పూర్తిగా కాల్వను ఆనుకుని చేశారు. పట్టాభూమిలోనే ప్లాట్లు ఏర్పాటు చేశామని చెప్తున్నా డీటీసీపీ నిబంధనలు తుంగలో తొక్కారు. రెవెన్యూ, మున్సిప ల్ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లే దు. జిల్లా వ్యాప్తంగా ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. -
చెల్లింపులకు కళ్లెం!
ప్రభుత్వ ఖజానాపై ఆంక్షలు - ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లే చెల్లింపు - మిగతావి నిలిపివేయాలని స్పష్టీకరణ - జిల్లాలో నిలిచిన అభివృద్ధి పనులు - గ్రామపంచాయతీల్లో గందరగోళం ప్రభుత్వ ఖజానాకు కళ్లెం పడింది. ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల పంపిణీ మినహా.. మిగతా చెల్లింపులన్నీ నిలిపివేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన చెల్లింపులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఖజానాపై ఆంక్షలు విధించడం గమనార్హం. గతంలో ఆర్థిక సంవత్సరం చివరలోనో.. లేదా అర్ధవార్షికం ముగింపు సమయాల్లోనే ఇలా ఖజానాపై ఆంక్షలు విధించేవారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత సకాలంలో బిల్లులు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. అర్ధంతరంగా ఖజానాపై ఫ్రీజింగ్ విధించడం విశేషం. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలే కావస్తోంది. ఈ సమయంలో కార్యాలయ నిర్వహణతోపాటు ఇతరత్రా చెల్లింపుల్లో కొంత వేగం పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు పెట్టడంతో వీటన్నింటిపై తీవ్ర ప్రభావమే పడుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు ముందస్తు చెల్లింపులకోసం బిల్లు పెట్టుకుంటారు. ఇలా దాదాపు వందకుపైగా ఫైళ్లు జిల్లా ఖజానా కార్యాల యంలో ఉన్నాయి. అదేవిధంగా విద్యాసంవత్సరం ప్రారంభంతో స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులుండడంతో ఉద్యోగుల భవిష్యనిధి నుంచి రుణా లు తీసుకునే సమయం కూడా ఇదే. ఇలాంటివి కూడా డీటీఓ వద్ద పెద్ద సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. తాజాగా ఫ్రీజింగ్ విధించడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. పనులపై ప్రభావం.. గత వార్షిక సంవత్సరం చివరలో పంచాయతీ శాఖ భారీగా ఆస్తిపన్ను వసూళ్ల డ్రైవ్ చేపట్టింది. ఉద్యోగులు పూర్తిస్థాయి కసరత్తు చేయడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు వసూలయ్యాయి. తాజాగా ఈ నిధులనుంచి పంచాయతీలు పలు కేటగిరీల్లో పనులు చేపట్టగా.. ఖజానాపై ఆంక్షలు విధించడంతో ఈ పనులకు సంబంధించిన చెల్లింపులకు బ్రేకు పడింది. దీంతో గ్రామ పంచాయతీల్లో అయోమయం నెలకొంది. ముక్కుపిండిమరీ ఆస్తి పన్ను వసూలు చేసిన అధికారులు.. స్థానికంగా సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తున్నారంటూ పలుచోట్ల ప్రజాప్రతినిధులకు నిలదీతలు ఎదురవుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. గత వార్షిక సంవత్సరం పనులు ఇప్పుడిప్పుడే ముగుస్తుండగా.. ప్రస్తుత ఏడాదికి సంబంధించి పనులు ప్రారంభమవుతున్నాయి. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అదేవిధంగా ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించిన నిర్వహణ, డైట్ చార్టీలు, విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలు తదితర కార్యక్రమాలపైనా ఆంక్షల ప్రభావం పడింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కనిష్టంగా రూ.50కోట్ల చెల్లింపులు నిలిచిపోయినట్లు అంచనా. -
యూఎల్‌సీకి మంగళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యూఎల్సీ (పట్టణ భూ గరిష్ట పరిమితి) భూములపై నెలకొన్న వివాదాలన్నిటికీ చరమగీతం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైనవారందరికీ రెగ్యులరైజ్ చేయడం.. తక్కినవాటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోనే అత్యంత విలువైన, అత్యధిక భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా సీలింగ్ భూములతో విసుగెత్తి వే సారిన భూ యజమానులకు కొంత ఊరట.. మరోపక్క ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. నగర శివార్లలోని 11 మండలాల్లో 3,453.70 ఎకరాల యూఎల్సీ భూములను కాపాడడం సర్కారుకు తలనొప్పిగా తయారైంది. ఇబ్బడిముబ్బడిగా ఆక్రమణలు జరుగుతుండడం.. వీటిని అరికట్టాల్సిన యూఎల్సీ విభాగానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ లేకపోవడంతో జిల్లా యంత్రాంగానికి గుదిబండగా మారింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడం.. అక్రమార్కులు కోర్టులను ఆశ్రయిస్తుండడంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎల్సీ స్థలాలను వీలైనంత మేర క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది. ఉభయ ప్రయోజనం.. బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ సర్కారు.. భూముల అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సమకూర్చుకుంటామని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ, సీలింగ్ భూములను క్ర మబద్ధీకరించాలని నిర్ణయించింది. మరీ ముఖ్యంగా విలువైన యూఎల్‌సీకి చెందిన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడం... వీటిని తొలగించడం ఆషామాషీ కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఘట్కేసర్ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన సర్కారు.. ఈ జాగాల క్రమబద్ధీకరణకు మొగ్గు చూపుతోంది. తద్వారా ఖజానా నింపుకోవడమేకాకుండా ఏళ్ల తరబడి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులకు ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది. ధరల నిర్ధారణపై మల్లగుల్లాలు క్రమబద్ధీకరణతో దాదాపు యూఎల్సీ స్థలాల కథకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న సర్కారు... కోర్టు కేసులకు కూడా త్వరితగతిన ముగింపు పలకాలని నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు పోగా మిగిలిన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఖరారు చేయాల్సిన ధరలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూఎల్సీ స్థలాలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. కనీస ధర నిర్ధారణపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే, ప్రస్తుత కనీస (బేసిక్ మార్కెట్ వాల్యూ) ధరలు భారీగా పలుకుతున్నందున.. 2008 ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. యూఎల్సీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఏ ధరలను వర్తింపజేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ⇒మాదాపూర్‌లో 2003లో చదరపు గజం (బేసిక్ మార్కెట్ వాల్యూ) కనీస ధర రూ.2వేలు పలకగా, 2008లో రూ.13వేలు.. ఇప్పుడు రూ.20వేలు పలుకుతుంది. ⇒గచ్చిబౌలిలో 2003లో చదరపు గజం కనీస ధర రూ.ఒక వెయ్యి కాగా, 2008లో రూ.12వేలు.. తాజాగా రూ.15వేలుగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేస్తోంది. ⇒రాయదుర్గంలో 2003లో చ.గజం కనీస ధర రూ.1000 ఉండగా, 2008లో రూ.11వేలు.. ప్రస్తుతం రూ.20వేలు ఉంది. 2008 ప్రభుత్వ కనీస మార్కెట్ విలువ ఆధారంగా రూ.7,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. క్రమబద్ధీకరణ ప్రక్రియను చకచకా పూర్తి చేయాలని భావిస్తోంది. ⇒ఈ నెల 16న జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం నిర్దేశిత ధరను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. -
వ్యాట్ కే పోటు
చక్రం తిప్పుతున్న రిటైర్డ్ అధికారి వరంగల్ బిజినెస్ : విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టంలోని లొసుగులు, వ్యాపారుల ధనదాహం, వాణిజ్య శాఖ అధికారుల అవినీతి వెరసి.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. జిల్లాలోని వ్యాపార సంస్థలు ప్రతి వస్తువుపై ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్ను వసూలు చేస్తున్నప్పటికీ... అవి ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు. మామూళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు తప్పుడు లెక్కలతో పన్ను మినహారుుంపు పొందుతున్నారు. వ్యాట్ ద్వారా ఏటా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. చట్టంలోని సెక్షన్ 16(3-ఎఫ్) ప్రకారం వ్యాపారులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మితే... మొదట చెల్లించిన పన్నును తిరిగిపొందే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సిమెంట్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, మందులు, కన్జ్యూమర్ వస్తువులు, కంప్యూటర్, ఇనుము, యంత్రములు, సౌందర్య వస్తువుల వంటి వ్యాపారాలను నిర్వహిస్తున్న బడా వ్యాపారులు తక్కువ ధరకు విక్రయించినట్లు లెక్కలు చూపి ఆదాయం మిగుల్చుకుంటున్నారు. అరుుతే... ప్రభుత్వ ఖజానాను భర్తీ చేసే వాటిల్లో వాణిజ్య పన్నుల శాఖది కీలకపాత్ర. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, వ్యాపారులు సక్రమంగా పన్ను కట్టేలా చూడాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంది. కానీ.. వారు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. చక్రం తిప్పుతున్న రిటైర్డ్ అధికారి జిల్లాలో వ్యాట్ చెల్లింపుల్లో అక్రమాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసి కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన ఓ అధికారి దందా నడిపిస్తున్నట్లు సమాచారం. వ్యాపారులకు మేలు చేయడంతోపాటు అధికారులు, సిబ్బంది జేబులు నింపి.. తానూ లాభపడుతున్నాడు. తప్పుడు లెక్కలతో పన్ను మినహారుుంపు పొందుతున్న వ్యాపారుల నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి ద్వారా అతడు ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తుంటాడు. వచ్చిన సొమ్మును వాటాల వారీగా పంచుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు ఉద్యోగులపై ఉన్నతాధికారులు కక్షసాధింపు చర్యలకు దిగినట్లు ఆ శాఖ ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. వ్యాపారులకే మేలు వరంగల్ పరిధిలోని ఫోర్ట్ రోడ్, బీట్‌బజార్, రామన్నపేట్, బట్టల బజార్, జనగాం. నర్సంపేట, మహబూబాబాద్ వ్యాపార డివిజన్లు ఉన్నారుు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా ప్రభుత్వానికి రూ.432.61 కోట్లు సమకూరింది. 2013-2014 లో రూ.483.25 కోట్లు వసూలైంది. వాస్తవానికి ఇంకా రూ.100 కోట్ల మేర వ్యాట్ వసూలు కావాల్సి ఉంది. నిజారుుతీగా వ్యవహరించిన కొందరు అధికారులు పలు వ్యాపార సంస్థలపై పన్నులు వేశారు. అయితే దానిని అప్పీలు అధికారులు నిర్ధారించకపోవడంతో వ్యాపారులకే మేలు జరిగింది. -
ఫలిస్తున్న ‘ఏరివేత’
ఇప్పటికే 4 లక్షల 25 వేల బోగస్ రేషన్ కార్డుల సరెండర్ హైదరాబాద్ : రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్న బోగస్ కార్డులను ఉపేక్షించేది లేదంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న హెచ్చరికలు బలంగా పనిచేస్తున్నాయి. క్రిమినల్ కేసుల భయంతో రేషన్ డీలర్లు ఓ పక్క బోగస్ కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తుండగా, మరోపక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటింటి సర్వేతో అధికార యంత్రాంగం అనర్హత కలిగిన వినియోగదారులను ఏరివేసే పనిలో నిర్విఘ్నంగా పనిచేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన ఏరివేతలో డీలర్లు 4 లక్షల 25 వేల కార్డులు స్వయంగా సరెండర్ చేయగా, ఈ-పీడీఎస్‌కు ఆధార్ అనుసంధానంతో మరో 25 లక్షల అనర్హులను ఏరివేశారు. ఆగస్టు 15 నాటికి మరో 5 లక్షల కార్డులు సరెండర్ కావడంతోపాటు, 40 లక్షల మంది అనర్హులను గుర్తించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని, అనర్హత కలిగిన లభ్ధిదారులు సైతం 50 లక్షల పైగా ఉంటారని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బోగస్ రేషన్ కార్డుల కారణంగా ఖజానాకు రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. -
సేల్స్ డౌన్
తగ్గుముఖం పట్టిన పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జోరు తగ్గిన సీమాంధ్ర వాహనాల రాకపోకలు శివారు బంకులపైనే అధిక ప్రభావం హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ వినియోగంలో సింహభాగమైన గ్రేటర్లో వీటి అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో దీని ప్రభావం పెద్దగా లేనప్పటికీ శివారు ప్రాంతాల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు తదితర కారణాలతో శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయి. గత మూడునెలల నుంచి సగటున 20శాతం వరకు అమ్మకాలు (సేల్స్) పడిపోయినట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులే ధ్రువీకరిస్తున్నారు. రాష్ట్రంలోనే పెట్రో ఉత్పత్తుల వినియోగంలో సగంవాటా ఉన్న నగరంలో అమ్మకాలు తగ్గడం ప్రభుత్వ ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదీ లెక్క: మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోలు, డీజిల్ బంకులు ఉన్నాయి. డిమాం డ్‌ను బట్టి సంబంధిత ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతినిత్యం 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంటోంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తం బంకుల ద్వారా ప్రతి రోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33 లక్షలలీటర్ల డీజిల్ విక్రయవుతుందని అంచనా. నగర ంలోని 40 లక్షల వివిధ రకాల వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే సుమారు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి. అయితే గత మూడునెలలుగా రాజకీయ అనిశ్చితి, ఎన్నికల హడావుడి, వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటవుతుండడం తదితర కారణాలతో సీమాంధ్ర ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలు తగ్గాయని తెలుస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా శివారు ప్రాంతాల్లోని బంకులపై పడింది. ఫలితంగా సుమారు 22 శాతం పెట్రోలు, 18 శాతం డీజిల్ అమ్మకాలు పడిపోయినట్లు ఆయిల్ కంపెనీల మార్కెటింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాపై ప్రభావం: మహానగరంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గుదల ప్రభా వం రాష్ట్ర ఖజానాపై చూపుతోంది. పెట్రోలు అమ్మకంపై 31 శాతం, డీజిల్ అమ్మకంపై 22 శాతం వ్యాట్ రూపంలో డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఖజానాకు కల్పవృక్షమైన వాణిజ్యపన్నులశాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74శాతం వరకు ఇక్కడనుంచే జమవుతోంది. వాణిజ్యపన్నులశాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రధానమైనది. ప్రస్తుతం నెల కొన్న పరిస్థితులతో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గి వ్యాట్ వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టడంతో శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతియేటా ప్రభుత్వం టార్గెట్లు విధించి ఆదాయాన్ని పెంచాలని కోరుతుంటే.. ఇందుకు భిన్నంగా ఆదాయం తగ్గుతోందని అంటున్నారు. -
ఖజానాకు కళ్లెం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ఖజానాకు కళ్లెం పడింది. ఉద్యోగుల వేతనాలు మినహా ఎలాంటి చెల్లింపులు చేపట్టొద్దని ప్రభుత్వం ఆ విభాగానికి తేల్చి చెప్పింది. దీంతో గత వారం రోజులుగా చెల్లింపుల తంతు నిలిచిపోగా.. శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమం లాంటి అత్యవసర నిధుల విడుదల ప్రక్రియ కూడా ఆగిపోయింది. సాధారణంగా విడుదలయ్యే కార్యాలయ నిర్వహణ ఖర్చులతోపాటు ఇతర పనులకు సంబంధించి నిధుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవ త్సరం ముగియనున్న నేపథ్యంలో ఖజానా చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం నిషేదం విధించడం కార్యాలయ నిర్వాహకుల్లో కలవరం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఖజానాను సర్దుబాటుచేసే క్రమంలో అడపాదడపా నిధుల విడుదలపై ప్రభుత్వం నిషేదం విధించి.. తర్వాత యథావిధిగా చెల్లింపుల ప్రక్రియ చేపడుతుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో నిషేదాజ్ఞలు లేకుండా అన్ని విభాగాలకు పూర్తిస్థాయి చెల్లింపులు చేపట్టాలి. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసినట్లైతే.. ఆ ఏడాదికి సంబంధించిన చెల్లింపులు కొత్త సంవత్సరంలో చేపట్టే వీలు లేదు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రస్తుతం ఖజానా విభాగానికి చేరాయి. అయితే నిధుల విడుదలపై నిషేదం విధించడంతో ఆ ఫైళ్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.22కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సర్కారు వెంటనే నిషేదం ఎత్తివేయకుంటే ఈ ఫైళ్లకు సంబంధించి చె ల్లింపులకు మోక్షం కలిగే అవకాశం లేదు. ఖజానా విభాగం అనుమతి లేకపోవడంతో ఆయా శాఖల వద్ద అందుబాటులో ఉన్న నిధులు కూడా మురిగిపోయే ప్రమాదం ఉంది. -
రికార్డుల్లో 90.. ఉన్నది ఇద్దరు..!
గోదావరిఖనిటౌన్, న్యూస్‌లైన్ : ఉంటున్నది ఇద్దరే విద్యార్థులు.. రికార్డుల్లో మాత్రం 90 మంది నమోదు.. ప్రతి నెలా అదే సంఖ్యలో బిల్లులు తయారు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. ఇదీ గోదావరిఖనిలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ నిర్వాకం. ఈమెను ఉన్నతాధికారులు వేరే ప్రాంతానికి బదిలీ చేసినా.. కొత్తగా వచ్చిన వార్డెన్‌కు రికార్డులు అప్పగించకపోవడం గమనార్హం. స్థానిక పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల ప్ర భుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ అక్రమాలకు నిలయంగా మా రింది. విద్యార్థుల రిజిస్టర్లో 90 మంది ఉన్నట్లు రికార్డులు చెబతున్నా.. వసతి గృహంలో ఉంటుంది మాత్రం కేవలం ఇద్దరే విద్యార్థులు. వార్డెన్ నిర్వాహకంపై పలు ఆరోపణలు రావడంతో జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి మంగళవారం హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈక్రమంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. హాస్టల్లో రెండేళ్ల క్రితం సుమారు 200 వరకు విద్యార్థులుండేవారు. అయితే వారికి సరిపడా సేవలందించడంలో వార్డెన్ రాణి నిర్లక్ష్యం వహించడం వలన క్రమంగా వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకున్న వార్డెన్ విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ బిల్లులు తీసుకుంటూ వచ్చింది. నెలకు సుమారు రూ.60 వేల వరకు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సా ధారణ బదిలీల్లో భా గంగా ఈమెను ఉన్నతాధికారులు వేరే చోటికి బదిలీ చేశారు. హైదరాబాద్‌లో పని చేసిన వరుణను ఇక్కడికి పంపారు. ఈ నెల 8న వరుణ విధుల్లో చేరగా.. హాస్టల్ రికార్డులను అందిం చడంలో రాణి నిరాకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వరుణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించి జిల్లా సహాయ సంక్షేమశాఖ అధికారిని విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో హాస్టల్లో జరుగుతున్న పరిణామాలపై ఏఎస్వోడబ్ల్యూ రాజేశ్వరి మంగళవారం తనిఖీ చేశారు. గతంలో పని చేసిన వార్డెన్ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. విద్యార్థుల సంఖ్య తగ్గడం, భోజనంలో నాణ్యత లోపిం చడంతో పాటు పలు ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏఎస్వోడబ్ల్యూ తెలిపారు. లెక్కల్లో అయోమయం విద్యార్థులు హాస్టల్లో లేకున్నా యథావిధిగా 90 మంది ఉన్న ట్లు బిల్లులు మాత్రం పాస్ అవుతున్నాయి. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు భోజనం కోసం రూ. 750, కాస్మోటిక్స్ పేరుతో మరో రూ.25లను అందిస్తోంది. ఈ లెక్కల ప్రకా రం 90 మంది విద్యార్థులకు నెలకు సుమారు రూ.70 వేల వరకు మేయింటనెన్స్ కింద బిల్లులు అందుతున్నాయి. అయితే విద్యార్థులు లేకున్నా.. ఈ బిల్లులు ఎటు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి అవకతవకలను పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.