వ్యాట్ కే పోటు
చక్రం తిప్పుతున్న రిటైర్డ్ అధికారి
వరంగల్ బిజినెస్ : విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టంలోని లొసుగులు, వ్యాపారుల ధనదాహం, వాణిజ్య శాఖ అధికారుల అవినీతి వెరసి.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. జిల్లాలోని వ్యాపార సంస్థలు ప్రతి వస్తువుపై ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్ను వసూలు చేస్తున్నప్పటికీ... అవి ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు.
మామూళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు తప్పుడు లెక్కలతో పన్ను మినహారుుంపు పొందుతున్నారు. వ్యాట్ ద్వారా ఏటా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. చట్టంలోని సెక్షన్ 16(3-ఎఫ్) ప్రకారం వ్యాపారులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మితే... మొదట చెల్లించిన పన్నును తిరిగిపొందే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సిమెంట్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, మందులు,
కన్జ్యూమర్ వస్తువులు, కంప్యూటర్, ఇనుము, యంత్రములు, సౌందర్య వస్తువుల వంటి వ్యాపారాలను నిర్వహిస్తున్న బడా వ్యాపారులు తక్కువ ధరకు విక్రయించినట్లు లెక్కలు చూపి ఆదాయం మిగుల్చుకుంటున్నారు. అరుుతే... ప్రభుత్వ ఖజానాను భర్తీ చేసే వాటిల్లో వాణిజ్య పన్నుల శాఖది కీలకపాత్ర. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, వ్యాపారులు సక్రమంగా పన్ను కట్టేలా చూడాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంది. కానీ.. వారు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.
చక్రం తిప్పుతున్న రిటైర్డ్ అధికారి
జిల్లాలో వ్యాట్ చెల్లింపుల్లో అక్రమాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసి కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన ఓ అధికారి దందా నడిపిస్తున్నట్లు సమాచారం. వ్యాపారులకు మేలు చేయడంతోపాటు అధికారులు, సిబ్బంది జేబులు నింపి.. తానూ లాభపడుతున్నాడు. తప్పుడు లెక్కలతో పన్ను మినహారుుంపు పొందుతున్న వ్యాపారుల నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి ద్వారా అతడు ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తుంటాడు. వచ్చిన సొమ్మును వాటాల వారీగా పంచుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు ఉద్యోగులపై ఉన్నతాధికారులు కక్షసాధింపు చర్యలకు దిగినట్లు ఆ శాఖ ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది.
వ్యాపారులకే మేలు
వరంగల్ పరిధిలోని ఫోర్ట్ రోడ్, బీట్‌బజార్, రామన్నపేట్, బట్టల బజార్, జనగాం. నర్సంపేట, మహబూబాబాద్ వ్యాపార డివిజన్లు ఉన్నారుు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా ప్రభుత్వానికి రూ.432.61 కోట్లు సమకూరింది. 2013-2014 లో రూ.483.25 కోట్లు వసూలైంది. వాస్తవానికి ఇంకా రూ.100 కోట్ల మేర వ్యాట్ వసూలు కావాల్సి ఉంది. నిజారుుతీగా వ్యవహరించిన కొందరు అధికారులు పలు వ్యాపార సంస్థలపై పన్నులు వేశారు. అయితే దానిని అప్పీలు అధికారులు నిర్ధారించకపోవడంతో వ్యాపారులకే మేలు జరిగింది.