పేమెంట్ సిస్టమ్స్ యాక్సెస్ సాధించిన మస్క్
అనవసర చెల్లింపులపై కోత పెట్టే ఛాన్స్
వాషింగ్టన్: సామాజిక భద్రత మొదలు ఆరోగ్య సంరక్షణ దాకా అమెరికా ప్రభుత్వ ఖజానా నుంచి జరిగే ప్రతి నగదు చెల్లింపుపై సమీక్ష జరిపే అధికారం ప్రపంచ కుబేరుడు, నూతన ప్రభుత్వ దక్షత (ఎఫీషియన్సీ) శాఖ అధినేత ఎలాన్ మస్క్ కు దఖలుపడింది. ఈ మేరకు ట్రెజరీ పేమెంట్ సిస్టమ్స్‌పై యాక్సెస్ చేసే సదుపాయం మస్క్ బృందానికి కల్పించారు.
దీంతో ఏ మంత్రిత్వశాఖకు, సంస్థకు, ప్రభుత్వ కాంట్రాక్టర్‌కు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఎంతెంత మొత్తాలు అమెరికా ప్రభుత్వ ఖాజానా నుంచి చెల్లిస్తున్నారో అంతా మస్క్ కు తెలియనుంది. ఈ వివరాలను న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ప్రచురించింది. ‘‘ అత్యంత రహస్యమైన ప్రభుత్వ చెల్లింపుల విధానం డేటా మొత్తం మస్క్ బృందం చేతిలో పెట్టడం సముచితంకాదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెల్లింపులనూ ఈ బృందం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టే ప్రమాదముంది.
రాజకీయ దురుద్దేశంతో, అనవసర జోక్యంతో చెల్లింపులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపొద్దు. ఏదైనా సంస్థ లేదంటే లబ్ధిదారులకు చెల్లింపులు అర్థంతరంగా ఆగిపోతే ఆ ప్రభావం నేరుగా దేశంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది ’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌కు రాసిన లేఖలో సెనేటర్ రాన్ వైడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక శాఖ తాత్కాలిక ఉప మంత్రిగా చేసిన ప్రభుత్వ అధికారి డేవిడ్ లెబ్‌రిక్ రాజీనామా చేసిన రోజునే ఈ లేఖ వెలుగులోకి రావడం గమనార్హం. అత్యంత సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే అవకాశం కోసం మస్క్ బృందం ఒత్తిడి వల్లే డేవిడ్ రాజీనామా చేసినట్లు శుక్రవారం వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment