రీచ్‌ల నుంచి మార్కెట్ దాకా అమ్మకాల్లో మాయాజాలం
చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు.. అధికారుల సహకారం
వినియోగదారులకు మూడు, నాలుగు రెట్లు అధిక ధరకు అమ్మకాలు
మరోవైపు కమర్షియల్ మార్కెట్‌కు తరలుతున్న బల్క్ అలాట్‌మెంట్లు
ప్రభుత్వ పనుల పేరిట దరఖాస్తులు.. తీసుకెళ్లి బయట విక్రయాలు
వర్షాలతో వాగులు, నదుల్లో ప్రవాహాలు పెరిగి ఇసుకకు కొరత
దీన్ని భారీగా సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు
జల మండలి ఘటనతో అప్రమత్తమైన టీజీఎండీసీ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక ‘దారి’ తప్పుతోంది. అటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా.. ఇటు జనానికి తక్కువ ధరకు దొరక్కుండా.. కాంట్రాక్టర్లు, దళారీల చేతిలో చిక్కుకుపోతోంది. ఇసుక విక్రయాల్లోని లొసుగులను వారు ఆసరాగా చేసుకుంటే.. అధికారుల కక్కుర్తి ఆ అవకతవకలకు తోడవుతోంది. అందులోనూ ప్రస్తుత వానాకాలంలో ఏర్పడిన ఇసుక కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ పనుల కోసమంటూ అడ్డగోలుగా బల్క్ అలాట్‌మెంట్లు చేయించుకుంటూ.. ఆ ఇసుకను వినియోగదారులకు అడ్డగోలుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జలమండలి పేరిట జరిగిన ‘బల్క్ అలాట్‌మెంట్’ వ్యవహారం దీనికి ఓ మచ్చుతునక మాత్రమే.
లొసుగులను వాడుకుంటూ..
రాష్ట్రంలో ఇసుక విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.700 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాల కోసం ‘శాండ్ సేల్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఎస్‌ఎస్‌ఎంఎంఎస్)’ను అమలు చేస్తోంది. అందరికీ అందుబాటు ధరలో ఇసుక అందాలన్నదే దీని లక్ష్యం. కానీ రీచ్‌ల నుంచి ఇసుక వెలికితీసే కాంట్రాక్టర్ల నుంచి రవాణా, వేబ్రిడ్జీల దాకా జరుగుతున్న అక్రమాలు ఇసుక ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో వాగులు, నదుల్లో ప్రవాహాలతో ఇసుక తవ్వకాలు తగ్గిపోయాయి. ఈ కొరతను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ విభాగాలను కూడా వాడుకుంటుండటం గమనార్హం.
కాంట్రాక్టర్ల గుప్పిట్లో స్టాక్ పాయింట్లు
ప్రభుత్వం గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి వెలికితీసి, స్టాక్ పాయింట్లకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో అంతా తామే అన్నట్లుగా చక్రం తిప్పుతున్నారు. ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలో వీరి కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
శాండ్ సేల్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ విధానంలో కేవలం ఇసుక వెలికితీత, స్టాక్‌యార్డుకు తరలింపునకు మాత్రమే కాంట్రాక్టర్లు పరిమితం కావాలి. అయితే ఆన్‌లైన్ విధానంలో బుక్ చేసుకున్న లారీల్లో ఇసుకను లోడ్ చేయాల్సిన సందర్భంలోనే.. కాంట్రాక్టర్లు వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ, అక్రమాలకు తెరలేపుతున్నారు. ఒక్కో లారీలో అదనంగా రెండు, మూడు టన్నులు లోడ్ చేస్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ(టీజీఎండీసీ) ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఇలా లారీల్లో అక్రమంగా లోడ్ చేసే ఇసుక విలువ రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలపైనే ఉంటుందని అంచనా. ఇందులో కాంట్రాక్టర్లు, స్థానిక పోలీసులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, రాజకీయ నాయకుల వరకు ముడుపులు అందుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఇసుక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని 16 మంది పోలీసు సిబ్బంది సస్పెండ్ కావడం గమనార్హం. ఇసుక వెలికితీత, విక్రయాలను పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు.. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
బహిరంగ మార్కెట్లో మూడు, నాలుగు రెట్ల ధర
ఆన్‌లైన్ విధానంలో ఒక్కో టన్ను ఇసుక ధర రూ.630 మాత్రమే. కానీ మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్నుకు రూ.1,900, దొడ్డు ఇసుక రూ.1,600పైనే పలుకుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో టన్ను ఇసుక ధర రూ.2,200కు కూడా చేరింది.
రవాణా చార్జీలతోపాటు స్టాక్ పాయింట్ల నుంచి చివరికి చేర్చేదాకా.. వివిధ దశల్లో ఇవ్వాల్సిన ముడుపుల మూలంగా ఇసుక ధర భారీగా ఉంటోందని లారీల యజమానులు చెప్తున్నారు. ఇక కొందరు దళారులు, ఇసుక వ్యాపారులు వే బ్రిడ్జిల వారితో కుమ్మక్కై అదనంగా బరువు చూపుతూ కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. ఒక్కో లారీపై కొనుగోలుదారులు రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు నష్టపోతున్నట్టు అంచనా.
బహిరంగ మార్కెట్‌కు బల్క్ అలాట్‌మెంట్లు
రాష్ట్రంలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు బల్క్ అలాట్‌మెంట్ల పేరిట దండుకుంటున్నారు. టీజీఎండీసీ ఏటా సగటున కోటిన్నర క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను విక్రయిస్తుండగా.. అందులో సుమారు 10 నుంచి 15శాతం ప్రభుత్వ అవసరాల కోసం కేటాయిస్తోంది.
ప్రభుత్వ శాఖల అధికారులు టీజీఎండీసీ వద్ద ఆన్‌లైన్ ఖాతాను సృష్టించి, తమ లాగిన్ ద్వారా ప్రభుత్వ పనులకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఎంత మొత్తంలో ఇసుక అవసరమో పేర్కొనాల్సి ఉంటుంది. టీజీఎండీసీ ఆ పత్రాలను పరిశీలించి, ఏకమొత్తంలో ఇసుక కేటాయింపు (బల్క్ అలాట్‌మెంట్) చేస్తుంది. అయితే కొందరు అక్రమార్కులు ప్రభుత్వ శాఖల లాగిన్‌ను కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు ఇటీవల జలమండలి పేరిట జరిగిన దందాతో వెల్లడైంది.
90లక్షల టన్నుల ఇసుక జలమండలి లాగిన్ ద్వారా కమర్షియల్ మార్కెట్‌కు చేరినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీజీఎండీసీ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై టీజీఎండీసీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుండటంతో పూర్తి వివరాలు వెల్లడించేందుకు టీజీఎండీసీ అధికారులు సుముఖత చూపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment