హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్‌లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్‌లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి.
ముందంజలో సామ్‌సంగ్..
ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్‌లో 48.7 శాతం వాటాతో సామ్‌సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్‌లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్‌సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.
ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్‌కు నాసా కాంట్రాక్టు
ఈ ఏడాది 20 శాతం వృద్ధి..
భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్‌లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment