
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సీఈఓ ఎలాన్‌మస్క్(Elon Musk)కు చెందిన ఎక్స్‌ఏఐ తన చాట్‌బాట్ లేటెస్ట్ వర్షన్ గ్రోక్ 3ని ఇటీవల ఆవిష్కరించింది. యూజర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు గ్రోక్ 3లో ఏదైనా సమస్యలుంటే తెలియజేయండంటూ తాజాగా మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వారంలో దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ స్పందిస్తూ.. గ్రోక్(Grok 3) పురోగతికి అభినందనలు తెలిపారు. ఈ చాట్‌బాట్‌ను ప్రయత్నించాలని చూస్తున్నట్లు తెలిపారు.
ఓపెన్ఏఐకు చెందిన చాట్‌జీపీటీ, చైనా- డీప్‌సీక్, గూగుల్‌కు చెందిన జెమినీ వంటి ఇతర జనరేటివ్ ఏఐ మోడళ్లకు పోటీగా గ్రోక్ 3ను రూపొందించినట్లు మస్క్ ఇటీవల తెలిపారు. దాని మునుపటి వర్షన్ కంటే గ్రోక్ 3.. 10 రెట్లు అధిక సమర్థ్యంతో పని చేస్తుందని చెప్పారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ చాట్‌బాట్ సామర్థ్యాలను హైలైట్ చేశారు. కృత్రిమ మేధ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి 1,00,000 ఎన్విడియా జీపీయూ గంటలను ఉపయోగించే ఎక్స్ఏఐకి చెందిన కొలోసస్ సూపర్ కంప్యూటర్‌పై గ్రోక్ 3 చాట్‌బాట్ పనిచేస్తుందని తెలిపారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు మస్క్ పేర్కొన్నారు.
The @xAI Grok 3 release will improve rapidly every day this week.
Please report any issues as a reply to this post.— Elon Musk (@elonmusk) February 18, 2025
ఎవరికి అందుబాటులో ఉంటుందంటే..
ఎక్స్‌లో ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్లకు గ్రోక్ 3 అందుబాటులో ఉందని మస్క్ తెలిపారు. అన్ని అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండేందుకు ఎక్స్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. గ్రోక్ 3 ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలు ఈ చాట్‌బాట్ సొంతమని చెప్పారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
ప్రీమియ ధరలు పెంపు
ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి. ఇండియాలో ఇప్పటివరకు ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ.3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ.18,300 నుంచి రూ.34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ.244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ.650గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment