సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ఖజానాకు కళ్లెం పడింది. ఉద్యోగుల వేతనాలు మినహా ఎలాంటి చెల్లింపులు చేపట్టొద్దని ప్రభుత్వం ఆ విభాగానికి తేల్చి చెప్పింది. దీంతో గత వారం రోజులుగా చెల్లింపుల తంతు నిలిచిపోగా.. శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమం లాంటి అత్యవసర నిధుల విడుదల ప్రక్రియ కూడా ఆగిపోయింది. సాధారణంగా విడుదలయ్యే కార్యాలయ నిర్వహణ ఖర్చులతోపాటు ఇతర పనులకు సంబంధించి నిధుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవ త్సరం ముగియనున్న నేపథ్యంలో ఖజానా చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం నిషేదం విధించడం కార్యాలయ నిర్వాహకుల్లో కలవరం సృష్టిస్తోంది.
ప్రభుత్వ ఖజానాను సర్దుబాటుచేసే క్రమంలో అడపాదడపా నిధుల విడుదలపై ప్రభుత్వం నిషేదం విధించి.. తర్వాత యథావిధిగా చెల్లింపుల ప్రక్రియ చేపడుతుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో నిషేదాజ్ఞలు లేకుండా అన్ని విభాగాలకు పూర్తిస్థాయి చెల్లింపులు చేపట్టాలి. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసినట్లైతే.. ఆ ఏడాదికి సంబంధించిన చెల్లింపులు కొత్త సంవత్సరంలో చేపట్టే వీలు లేదు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రస్తుతం ఖజానా విభాగానికి చేరాయి. అయితే నిధుల విడుదలపై నిషేదం విధించడంతో ఆ ఫైళ్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.22కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సర్కారు వెంటనే నిషేదం ఎత్తివేయకుంటే ఈ ఫైళ్లకు సంబంధించి చె ల్లింపులకు మోక్షం కలిగే అవకాశం లేదు. ఖజానా విభాగం అనుమతి లేకపోవడంతో ఆయా శాఖల వద్ద అందుబాటులో ఉన్న నిధులు కూడా మురిగిపోయే ప్రమాదం ఉంది.
ఖజానాకు కళ్లెం!
Published Fri, Mar 21 2014 11:21 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement