సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము వస్తుందా? రాకుంటే ఎందుకు రావడం లేదు, దాని వెనకున్న కారణాలేంటి? ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అధికార యంత్రాంగం లేదా కాంట్రాక్టర్ల వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తోందా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాల్సిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గాడితప్పినట్టు కనిపిస్తోంది. గతంలో విజిలెన్స్ విభాగం నుంచి నివేదిక వచ్చిందంటే సంబంధిత అధికారులుగానీ, కాంట్రాక్టర్లుగానీ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పూర్తిగా నత్తనడకన సాగుతోందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చేయి తడిపితే చాలు..
హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించే బిల్డర్లు, నిర్మాణాలు చేస్తున్న యజమానుల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఏ ప్రణాళికైనా వారి జేబులు నింపుకోవడానికే పరిమితమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి డివిజన్‌పరిధిలో భవనాలు నిర్మిస్తున్న ఓ బిల్డర్ నిబంధనలు అతిక్రమించి కట్టడాలు సాగిస్తున్నాడని జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీచేసింది.
అయితే నోటీసులు స్వీకరించిన సంబంధిత బిల్డర్లు అధికారులకు ఎంతో కొంత సమర్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదే బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కంగారుపడ్డ సంబంధిత బిల్డర్ జీహెచ్‌ఎంసీ అధికారిని ఫోన్‌లో ఆరా తీయగా, తమకు ఇచ్చినట్టుగానే విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తే నిర్మాణం సక్రమంగా సాగుతుందని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారికి రూ. 3 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇలా హైదరాబాద్‌లోని వందలాదిమంది బిల్డర్లు, సంబంధిత యజమానులకు ఇదే రీతిలో నోటీసులు జారీచేయడం, వాటి పేరున దండుకోవడం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రీతిలో రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లకు అమ్ముతున్నారని రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి రెండు లారీలను శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు తెలిసింది. ఈ రెండు ఘటనలే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే గుట్టుగా సాగిపోవడానికి విజిలెన్స్ అధికారుల ఆమ్యామ్యాల వ్యవహారమే కారణమని చర్చ జరుగుతోంది. గతంలో నల్లగొండ విజిలెన్స్ అధికారి భాస్కర్‌రావు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా, ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఉన్నతాధికారులనే కలవరానికి గురిచేస్తుంది.
రిపోర్టులేవి..?
ప్రభుత్వాలకు పథకాల అమలు, అమలులో ఉన్న సమస్యలు, అవినీతి వ్యవహారాలు, పక్కదారి పట్టిస్తున్న అధికారుల వివరాలతో కూడిన నివేదికలను ప్రతినెలా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న అధికార వ్యవస్థ ఎక్కడా కూడా ఏ పథకాలపైగానీ, ఏ ప్రాజెక్టుపైగానీ, లోపభూయిష్టమైన ఏ వ్యవస్థపైనా ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా పంపిన దాఖలాల్లేవని సచివాలయ వర్గాలు చెబుతున్నా యి. పైగా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవతలి వ్యక్తికి సమాచారమిచ్చి వసూళ్లు చేసుకుం టున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలెదుర్కుంటున్న సంస్థలు, ఆయా వ్యక్తులకు మేలు చేకూర్చేలా నివేదికలివ్వడాన్ని ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
పాలన గాడి తప్పినట్టేనా?
ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ హోదా అధికారి ఉండి అజమాయిషీ చేసేవారు. కానీ ఇప్పుడు డీజీ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు రావడం, సమీక్షించే సమయం కూడా లేకపోవడంతో విజిలెన్స్ విభాగం గాడితప్పినట్టు ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో విజిలెన్స్ నివేదికలపై ఏ ఒక్క సంస్థపైగానీ, అధికారిపైగానీ చర్యలు తీసుకోలేదంటే పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ త్రివేది వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్ త్రివేది హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఈ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పనిఒత్తిడితో సచివాలయానికే పరిమితం కావడం వల్ల విజిలెన్స్ విభాగం గాడితప్పుతున్నట్టు స్వంత విభాగంలోనే చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment