ఫలిస్తున్న ‘ఏరివేత’
ఇప్పటికే 4 లక్షల 25 వేల బోగస్ రేషన్ కార్డుల సరెండర్
హైదరాబాద్ : రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్న బోగస్ కార్డులను ఉపేక్షించేది లేదంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న హెచ్చరికలు బలంగా పనిచేస్తున్నాయి. క్రిమినల్ కేసుల భయంతో రేషన్ డీలర్లు ఓ పక్క బోగస్ కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తుండగా, మరోపక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటింటి సర్వేతో అధికార యంత్రాంగం అనర్హత కలిగిన వినియోగదారులను ఏరివేసే పనిలో నిర్విఘ్నంగా పనిచేస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన ఏరివేతలో డీలర్లు 4 లక్షల 25 వేల కార్డులు స్వయంగా సరెండర్ చేయగా, ఈ-పీడీఎస్‌కు ఆధార్ అనుసంధానంతో మరో 25 లక్షల అనర్హులను ఏరివేశారు. ఆగస్టు 15 నాటికి మరో 5 లక్షల కార్డులు సరెండర్ కావడంతోపాటు, 40 లక్షల మంది అనర్హులను గుర్తించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని, అనర్హత కలిగిన లభ్ధిదారులు సైతం 50 లక్షల పైగా ఉంటారని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బోగస్ రేషన్ కార్డుల కారణంగా ఖజానాకు రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది.