చెల్లింపులకు కళ్లెం!
ప్రభుత్వ ఖజానాపై ఆంక్షలు
- ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లే చెల్లింపు
- మిగతావి నిలిపివేయాలని స్పష్టీకరణ
- జిల్లాలో నిలిచిన అభివృద్ధి పనులు
- గ్రామపంచాయతీల్లో గందరగోళం
ప్రభుత్వ ఖజానాకు కళ్లెం పడింది. ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల పంపిణీ మినహా.. మిగతా చెల్లింపులన్నీ నిలిపివేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన చెల్లింపులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఖజానాపై ఆంక్షలు విధించడం గమనార్హం. గతంలో ఆర్థిక సంవత్సరం చివరలోనో.. లేదా అర్ధవార్షికం ముగింపు సమయాల్లోనే ఇలా ఖజానాపై ఆంక్షలు విధించేవారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత సకాలంలో బిల్లులు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. అర్ధంతరంగా ఖజానాపై ఫ్రీజింగ్ విధించడం విశేషం.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలే కావస్తోంది. ఈ సమయంలో కార్యాలయ నిర్వహణతోపాటు ఇతరత్రా చెల్లింపుల్లో కొంత వేగం పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు పెట్టడంతో వీటన్నింటిపై తీవ్ర ప్రభావమే పడుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు ముందస్తు చెల్లింపులకోసం బిల్లు పెట్టుకుంటారు.
ఇలా దాదాపు వందకుపైగా ఫైళ్లు జిల్లా ఖజానా కార్యాల యంలో ఉన్నాయి. అదేవిధంగా విద్యాసంవత్సరం ప్రారంభంతో స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులుండడంతో ఉద్యోగుల భవిష్యనిధి నుంచి రుణా లు తీసుకునే సమయం కూడా ఇదే. ఇలాంటివి కూడా డీటీఓ వద్ద పెద్ద సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. తాజాగా ఫ్రీజింగ్ విధించడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి.
పనులపై ప్రభావం..
గత వార్షిక సంవత్సరం చివరలో పంచాయతీ శాఖ భారీగా ఆస్తిపన్ను వసూళ్ల డ్రైవ్ చేపట్టింది. ఉద్యోగులు పూర్తిస్థాయి కసరత్తు చేయడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు వసూలయ్యాయి. తాజాగా ఈ నిధులనుంచి పంచాయతీలు పలు కేటగిరీల్లో పనులు చేపట్టగా.. ఖజానాపై ఆంక్షలు విధించడంతో ఈ పనులకు సంబంధించిన చెల్లింపులకు బ్రేకు పడింది. దీంతో గ్రామ పంచాయతీల్లో అయోమయం నెలకొంది. ముక్కుపిండిమరీ ఆస్తి పన్ను వసూలు చేసిన అధికారులు.. స్థానికంగా సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తున్నారంటూ పలుచోట్ల ప్రజాప్రతినిధులకు నిలదీతలు ఎదురవుతున్నాయి.
మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. గత వార్షిక సంవత్సరం పనులు ఇప్పుడిప్పుడే ముగుస్తుండగా.. ప్రస్తుత ఏడాదికి సంబంధించి పనులు ప్రారంభమవుతున్నాయి. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అదేవిధంగా ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించిన నిర్వహణ, డైట్ చార్టీలు, విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలు తదితర కార్యక్రమాలపైనా ఆంక్షల ప్రభావం పడింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కనిష్టంగా రూ.50కోట్ల చెల్లింపులు నిలిచిపోయినట్లు అంచనా.