జడ్జీలకూ ఝలక్‌! | TDP Govt Shock Also To The Judges | Sakshi
Sakshi News home page

జడ్జీలకూ ఝలక్‌!

Published Tue, May 14 2019 4:44 AM | Last Updated on Tue, May 14 2019 11:06 AM

TDP Govt Shock Also To The Judges - Sakshi

కోడూరు చైతన్య.. బెంగళూరులోని ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌. సొంతూరు విజయవాడ వస్తుండగా 2012లో చిలకలూరిపేట వద్ద లారీ ఢీ కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కనీసం కూర్చోలేరు. ఏం కావాలన్నా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఈ పరిస్థితుల్లో భర్త కూడా దూరమయ్యారు. ప్రమాద బీమా కోసం న్యాయ పోరాటం చేశారు. 2017లో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ రూ.65 లక్షలను పరిహారంగా చెల్లించాలని  ఆదేశించింది. బీమా కంపెనీ పీడీ ఖాతాలో జమ చేసిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో ఇప్పటివరకు ఆమెకు పరిహారం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ దీనయ్య 2003లో ప్రమాదానికి గురయ్యాడు. కింది కోర్టు రూ.1.20 లక్షలను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. బాధితుడు హైకోర్టులో పోరాటం చేయడంతో పరిహారం మొత్తాన్ని న్యాయస్థానం రూ.1.50 లక్షలకు పెంచింది. 2017లో కోర్టు దీనయ్యకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని జడ్జీ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం ఆ డబ్బులను సొంతానికి వాడుకోవడంతో దీనయ్యకు ఒక్క పైసా కూడా అందలేదు.

విశాఖకు చెందిన సుబ్బారావు దంపతుల కుమారుడు, కోడలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనువడు, మనవరాలిని పోషించే భారం వారిపైనే పడింది. పరిహారం కింద రూ.42 లక్షలు చెల్లించాలన్న కోర్టు ఆదేశాల మేరకు బీమా కంపెనీ ఆ డబ్బును జిల్లా జడ్జి ఖాతాల్లో జమ చేసింది. అయితే పరిహారం డబ్బులను కూడా ప్రభుత్వం తన్నుకుపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

సాక్షి, అమరావతి: సాఫీగా సాగిపోతున్న ప్రమాద బీమా పరిహారం చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం సంక్లిష్టంగా మార్చేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం ద్వారా కోర్టు ఉత్తర్వుల మేరకు బీమా కంపెనీలు అందచేసిన పరిహారం సొమ్ము దాదాపు రూ.400 కోట్లకుపైగా పరిహారాన్ని బాధితులకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల బారినపడి జీవనోపాధి, కుటుంబ సభ్యులను పోగొట్టున్న బాధితులు ఎంతో మంది ఉన్నారు. వీరు పరిహారం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సానుకూల ఉత్తర్వులు పొందినా రాష్ట్ర ప్రభుత్వం కనికరించకపోవడంతో గత డిసెంబర్‌ నుంచి డబ్బులు పొందలేకపోతున్నారు.  
పరిహారం సొమ్ము ప్రభుత్వానిది కాదు..
వాస్తవానికి ప్రమాద బీమా పరిహారం చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రమాద బీమా కేసులు కోర్టుకు, బీమా కంపెనీలకు, బాధితులకు మాత్రమే సంబంధించినవి. బీమా కంపెనీలు జిల్లా జడ్జీల నియంత్రణలో ఉండే ఖాతాల్లో డబ్బు జమ చేస్తాయి. కక్షిదారులు కూడా కోర్టు ఫీజుల కింద జడ్జీల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఖాతాల్లోకి ఎంత డబ్బు వచ్చింది? ఎంత వెళ్లిందనే విషయాలను ట్రెజరీ విభాగం పరిశీలిస్తుంది. 

ఎన్నికల ముందు రూ.వందల కోట్లు దారి మళ్లింపు..
ఎన్నికల ముందు ఈ ఖాతాల్లోని సొమ్ములపై కన్నేసిన టీడీపీ సర్కారు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)ను అడ్డం పెట్టుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు దీని ద్వారా జడ్జీల ఖాతాలన్నింటినీ స్తంభింప చేసి రూ.వందల కోట్లను దారి మళ్లించింది. కోటరీ కాంట్రాక్టర్లకు, ఎన్నికల తాయితాల కోసం పందేరం చేసింది. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు బాధితులు, న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. 

ఏ ప్రభుత్వమూ ఈ సొమ్మును తాకలేదు..
జడ్జీల పేరు మీద ఉండే ఖాతాల్లోని డబ్బు సర్కారుది కాదు. అదంతా  కక్షిదారులు, బీమా కంపెనీలు జమ చేసిన సొమ్ము. దానికీ, ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకున్నా అక్రమ పద్ధతుల్లో సీఎఫ్‌ఎంసీ ద్వారా ఇష్టానుసారంగా ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమాద బీమా పరిహారం సొమ్ము జోలికి వెళ్లలేదని విశ్రాంత న్యాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం డబ్బులను ప్రభుత్వం సొంత సొమ్ములా ఖర్చు చేయడమే కాకుండా తిరిగి చెల్లించకపోవడం దారుణమని పేర్కొంటున్నారు.

న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో..
ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో ఓ కక్షిదారుడి తరఫున రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, మోటారు వాహనాల ప్రమాద కేసుల్లో అనుభవజ్ఞుడైన వొట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి ఈ వ్యవహారాన్ని తెచ్చారు. మద్దు ఈశ్వర్‌రెడ్డి అనే కక్షిదారుడికి కోర్టు ఆదేశాల మేరకు పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ దీనిపై వివరణకు ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై ఈశ్వర్‌రెడ్డికి పరిహారం చెల్లించారు. ఇలా ఎంతమంది కక్షిదారులు ఈశ్వర్‌రెడ్డిలా తిరిగి న్యాయపోరాటం చేయగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి పరిహార ఉత్తర్వులు పొందిన బాధితులు మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించలేక కుమిలిపోతున్నారు. దీనిపై సీఎఫ్‌ఎంఎస్‌ అధికారుల వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు.

కోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించడం లేదు
న్యాయాన్యాయాలను చెప్పే న్యాయస్థానాలకే అన్యాయం జరుగుతోంది. కోర్టు తీర్పులను ప్రభుత్వమే గౌరవించడం లేదు. బాధితుల కోసం బీమా కంపెనీలు ఇచ్చిన సొమ్మును దారి మళ్లించడం దుర్మార్గం. ప్రభుత్వం శృతిమించి జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బాధితులకు న్యాయం చేసేందుకు మోటారు వాహనాల చట్టాన్ని తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల లక్ష్యం నీరుగారుతోంది. కక్షిదారులకు చెల్లించాల్సిన డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడం దారుణం. దీనిపై న్యాయ పోరాటం చేస్తా.
    – వి.బ్రహ్మారెడ్డి (ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement