మహారాణిపేట (విశాఖ దక్షిణ): జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఉద్యోగులకు అక్కడే జీతాలు ఇచ్చే పద్ధతికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిలాల్లగా విభజించి పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రెండు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల నుంచి స్థానిక ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల ట్రెజరీలకు కోడ్ కేటాయించారు. ఆ కోడ్ ప్రకారం వచ్చే బిల్లులను ట్రెజరీ సిబ్బంది సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశారు. మంగళవారం నాటికి అన్ని బిల్లులు అప్‌లోడ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్న సమయంలో మొత్తం 91 ప్రభుత్వ శాఖలు ఉండేవి. ఇందులో మొత్తం 33,718మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసేవారు. 1299 మంది డీడీఓలు జీతాల ప్రక్రియ బిల్లులు పూర్తి చేసి ట్రెజరీకి పంపేవారు.
అనకాపల్లి జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2100 మంది పనిచేస్తున్నారు. విభజన జిల్లాల్లోని ఉద్యోగులు, అధికారుల జీతాల బిల్లులు అక్కడే ఇవ్వగా, రిటైర్ అయిన ఉద్యోగుల పింఛన్లు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి ఇస్తున్నారు. విశాఖ జిల్లాకు 0201, అనకాపల్లి జిల్లాకు 90000039469, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 90000039468 కోడ్ నంబర్లుగా కేటాయించారు.
సబ్ ట్రెజరీలు ఇవే..
విశాఖ జిల్లాలో సీతమ్మధార, భీమునిపట్నంలలో సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ఈస్టు, అనకాపల్లి వెస్టు, చోడవరం, యలమంచిలి, కోటవురట్ల, మాడుగుల, నక్కపల్లి, నర్సీపట్నం సబ్ ట్రెజరీలు ఉన్నాయి. అల్లూరి జిల్లా పరిధిలో పాడేరు, అరకు, చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరు సబ్ ట్రెజరీలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో అక్కడే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రకారం ఈ నెల నుంచి జీతాలు వస్తాయని విశాఖపట్నం జిల్లా ట్రెజరీ అధికారి టి.శివరామ ప్రసాద్ చెప్పారు.
(చదవండి: అడ్డాకులకు అదిరే ధర)
Comments
Please login to add a commentAdd a comment