‘సీఎఫ్‌ఎంఎస్’ విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం) అమలు విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కితగ్గింది. పీఆర్సీ అమలు జీవోలు జారీ చేసిన రెండు నెలల తర్వాత.. సీఎఫ్‌ఎంఎస్ అమలు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది. సాధ్యం కాదని తెలిసినా.. సీఎఫ్‌ఎంఎస్ ద్వారానే పీఆర్సీ అమలు చేసి కొత్త వేతనాలు ఇవ్వాలని నిర్ణయించడం వెనక పీఆర్సీ అమలును జాప్యం చేయాలనే ‘సర్కారు దగా’ ఉందంటూ జీవోలు జారీ చేసిన రోజే ‘సాక్షి’ చెప్పింది. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం ప్రభుత్వంలో అంటకాగుతుండటం వల్ల ప్రభుత్వం కుట్ర మీద ఆలస్యంగా స్పందించిందనే విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. సీఎఫ్‌ఎంఎస్ వల్ల జాప్యం జరుగుతున్నందున ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారానే జీతాలు చెల్లించాలని అశోక్‌బాబు, కత్తినరసింహారెడ్డి తదితరులతో కూడిన జేఏసీ ప్రతినిధి బృందం మంగళవారం చేసిన విజ్ఞప్తికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సానుకూలంగా స్పందించారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ ఊరులో లేరని, నాలుగు రోజుల్లో.. ప్రస్తుత విధానంలో పీఆర్సీ అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త వేతనాలు ఆగస్టులోనే: ఈ నెలలో జీతాల బిల్లులను ట్రెజరీల్లో సమర్పించడానికి గడువు ముగిసినందున, పాత విధానంలోనే పీఆర్సీ అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చినా ప్రస్తుతానికి ప్రయోజనం ఉండదు. ఆగస్టు 1న అందనున్న జూలై జీతంలో పీఆర్సీ అమలు ప్రయోజనం కనిపిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు.. మూడు నెలల బకాయిలను జూలై జీతంతో పాటు చెల్లిస్తారు.
పది రోజుల్లో ప్యాకేజీల ఖరారు
హెల్త్‌కార్డుల పథకం ప్యాకేజీలను పది రోజుల్లో ఖరారు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల జేఏసీకి హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ, నగర ఆసుపత్రుల వారీగా ప్యాకేజీలు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదించాలని ఆసుపత్రుల ప్రతినిధులకు సూచించారు.
ప్రస్తుత విధానంలోనే పీఆర్సీ
Published Wed, Jun 24 2015 12:53 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement