- ఆ రోజున మంత్రివర్గ ఉపసంఘం భేటీ
- సీఎంకు నివేదించిన వెంటనే పీఆర్సీని ప్రకటిస్తారని ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ అంశంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో రెండున్నర నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనప్పటికీ ఇప్పటివరకు తొలి సమావేశమే జరగలేదు. అయితే తెలంగాణ సర్కారు పీఆర్సీ ప్రకటన చేయడంతో ఏపీ ప్రభుత్వంలోనూ చలనం వచ్చింది.
సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ నెల 9న(సోమవారం) ఉపసంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి హాజరుకావాలంటూ ఆర్థికశాఖ నుంచి ఉపసంఘం సభ్యులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానాలు పంపించారు. తొలి సమావేశంలోనే ఉద్యోగుల డిమాండ్లపై చర్చించి సాధ్యాసాధ్యాలను వివరిస్తూ నివేదిక రూపొందించి.. వెంటనే సీఎంకు నివేదించనున్నారు. అదేరోజు సీఎం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో మాట్లాడి పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేననే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అయితే ఆర్థిక లబి ఎప్పటినుంచి అమలు చేయాలనే విషయంలోనే చర్చించి నిర్ణయానికి రావాల్సి ఉందని ఆ వర్గాలు భావిస్తున్నాయి.ఆర్థిక లబ్ధి విషయంలో రాజీ పడకూడదని, డిమాండ్ సాధనకు గట్టిగా పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. ఉపసంఘం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం ఆర్థిక మంత్రి యనమలను కలసి.. పీఆర్సీ ప్రయోజనాలను వెంటనే ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 10న భేటీ కానుంది.