ఏపీలో సంక్రాంతికి పీఆర్సీ లేదు
ఉద్యోగుల డిమాండ్లు వినడానికే పరిమితమైన ఆర్థిక మంత్రి
అధికారులు, సీఎంతో చర్చించాక మళ్లీ చర్చలకు పిలుస్తానన్న యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వచ్చింది కానీ ఉద్యోగులకు పీఆర్సీ మాత్రం రాలేదు. సంక్రాంతికి పీఆర్సీ అంటూ ఊరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాటలు నీటి మూటలయ్యాయని ఉద్యోగులు ఆవేదన చెం దుతున్నారు. మంగళవారం ఉద్యోగ సంఘాల జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన భేటీ డిమాండ్లు వినడానికే పరిమితమైంది. ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పష్టత రాలేదు. అధికారులు, సీఎంతో చర్చించాక మళ్లీ చర్చలకు పిలుస్తానని యనమల చెప్పారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తికి గురయ్యారు. పండుగ వేళ ప్రభుత్వం నుంచి ఓ మంచిమాట వస్తుందన్న ఆశ గల్లంతై ఉద్యోగులు ఉస్సూరన్నారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ఏర్పాటైన ఉపసంఘంలో యనమలతోపాటు మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు సభ్యులుగా ఉన్నారు. మంగళవారం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల జేఏసీకి పంపించిన ఆహ్వానం.. ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ పేరిట ఉంది.
కానీ చర్చల్లో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పల్లె, కామినేని, గంటాతోపాటు పి.వి.రమేష్ కూడా పాల్గొనలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పీఆర్సీ అమలుపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని ఉపసంఘంలో సభ్యుల తీరు చెప్పకనే చెబుతోందని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యనమలతో జేఏసీ ప్రతినిధిబృందం, సచివాలయ ఉద్యోగుల సంఘం వేర్వేరుగా భేటీ అయ్యాయి. జేఏసీ బృందంతో 40 నిమిషాలపాటు సమావేశం సాగింది. గతంలో పీఆర్సీని తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసేవారని, స్థానిక, ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాలు, రెసిడెన్షియల్ సొసైటీ స్కూళ్ల సిబ్బందికి తర్వాత అమలు చేసే విధానం ఉండేదని, ఈసారి అలాగాక ఉద్యోగులందరికీ ఒకేదఫాలో పీఆర్సీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రతినిధిబృందం చేసిన విజ్ఞప్తికి యనమల సానుకూలంగా స్పందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, అయితే సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని మంత్రి వివరించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు ఇవ్వకపోవడం అన్యాయమన్న ఉద్యోగ సంఘాల వాదనతో మంత్రి ఏకీభవించారు. వారికి ప్రసూతి సెలవు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. ఫిట్‌మెంట్, కనీస వేతనం, ఇంక్రిమెంట్ రేట్, ఆర్థిక లబ్ధి.. తదితర ఉద్యోగుల అన్ని డిమాండ్లను వినడానికే ఆర్థికమంత్రి పరిమితమయ్యారు.
డిమాం డ్ల సాధ్యాసాధ్యాలపై మాట్లాడలేదు. అధికారులు, ముఖ్యమంత్రితో చర్చించాక జేఏసీని మళ్లీ పిలుస్తానని చెప్పారు. మళ్లీ ఎప్పుడు పిలుస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే మరో వారం రోజుల్లో చర్చలకు పిలిచే అవకాశముందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జేఏసీ ప్రతినిధిబృందంలో చైర్మన్ అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు, కోచైర్మన్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి, ఎన్.రఘురామిరెడ్డి, ఎం.కమలాకరరావు, యు.వి.భాస్కరరావు, వైస్ చైర్మన్లు కుళ్లాయప్ప, జి.శ్రీరాములు, రియాజ్ అహ్మద్, జి.రవికుమార్, బండి శ్రీనివాసరావు, టి.వి.ఫణిపేర్రాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ జి.హృదయరాజు, ఎన్.చంద్రశేఖరరెడ్డి తదితరులున్నారు. మరోవైపు ఉప సంఘంతో సమావేశమైన మురళీకృష్ణ నేతృత్వంలోని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధిబృందంలో రామకృష్ణ, వెంకటసుబ్బయ్య, రమణయ్య తదితరులు ఉన్నారు.
సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు
►ఏఎస్‌వో, ఎస్‌వోలకు గతంలో స్పెషల్ పే ఉండేది. ఇప్పుడు వాటిని కొనసాగించకుండా పదో పీఆర్సీలో తగ్గించారు. స్పెషల్ పే కొనసాగించాలి. ఏఎస్‌వోకు సూపరింటెండెంట్ స్కేల్ ఇవ్వాలి.
► సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి.
► ఫిట్‌మెంట్ విషయంలో పట్టువిడుపులకు సిద్ధం. 75 శాతం అడిగాం. 62 శాతం వరకు తగ్గడానికీ సిద్ధం.
► 2013 జూలైలో రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదు. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలి.
జేఏసీ ఉంచిన డిమాండ్లివీ..
► కనీస వేతనాన్ని రూ.13 వేల నుంచి రూ.15 వేలకు, గరిష్ట వేతనాన్ని రూ. 1,10,850 నుంచి 1,37,600కు పెంచాలి.
►పీఆర్సీ 29% ఫిట్‌మెంట్ సిఫారసు చేయడం పట్ల జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 69% ఫిట్‌మెంట్ ఇవ్వాలి.
► పీఆర్సీని 2013 నుంచి అమలు చేసి, అప్పట్నుంచే ఆర్థిక లబ్ధి ఇవ్వాలి.
► మున్సిపాల్టీల పరిధిని 15 కిలోమీటర్లుగా నిర్ణయించాలి.
► ఇంక్రిమెంట్ రేట్ 2.33 శాతం నుంచి 2.832 శాతానికి పెంచాలి.
► గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి.
► మచిలీపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు పట్టణాల్లో హెచ్‌ఆర్‌ఏ 20 శాతానికి పెంచాలి.
► ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ భత్యాన్ని గతంలో ఉద్యోగులకు ఇచ్చేవారు. దాన్ని పునరుద్ధరించాలి.
► జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్.. పే స్కేళ్లను సచివాలయ సిబ్బందితో సమానం చేయాలి.
► పదవీ విరమణ వయసు పెంపును ప్రభుత్వరంగ సంస్థలు, గ్రంథాలయ సంస్థలు, గురుకులాలు, సహకార సంఘాల సిబ్బందికీ అమలు చేయాలి. ళీ ఉద్యోగుల పిల్లల రీయింబర్స్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంచాలి.