ఏపీ బడ్జెట్‌కు ముందే పీఆర్సీ | AP Govt postponed prc implementation | Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌కు ముందే పీఆర్సీ

Published Mon, Jan 19 2015 2:02 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

ఏపీ బడ్జెట్‌కు ముందే పీఆర్సీ - Sakshi

ఏపీ బడ్జెట్‌కు ముందే పీఆర్సీ

అమలుకు ఆర్థిక మంత్రి యనమల హామీ
పెదవి విరుస్తున్న ఉద్యోగులు


సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికే ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసులు అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. దానిని బడ్జెట్ సమావేశాల సమయానికి వాయిదా వేసింది. పీఆర్సీ సిఫారసులను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకన్నా ముందుగానే అమలు చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. అయితే ఒకసారి వాయిదా వేసిన ప్రభుత్వం మరోసారి వాయిదా వేయదనే నమ్మకం లేదని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.కాగా, ఆర్థిక మంత్రి ఈ నెల 21నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి వచ్చిన తరువాతగానీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం లేదు.

లోటుపై కేంద్రానికి నివేదిక..
ఇలా ఉండగా రెవెన్యూ లోటును రాబట్టుకునేందుకు ఉద్యోగుల జీత భత్యాలు, పీఆర్సీ అమలు భారం తదితర వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి నివేదిక పంపింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యతో సహా వారి జీతభత్యాలకయ్యే వ్యయాలను నివేదికలో పొందుపరిచారు. పీఆర్సీ సిఫారసులను గత ఏడాది జూలై నుంచి అమలు చేయాల్సి ఉందని కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలల కాలానికి పీఆర్సీ అమలు కారణంగా రూ. 3,111 కోట్ల అదనపు భారం పడుతోందని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీలో 60 శాతం ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉన్నారని, అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని నివేదికలో వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలలకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డు, అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల గౌరవ వేతనం, వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగుల వేతనాలకు రూ. 29,294 కోట్లు వ్యయం అవుతుందని నివేదికలో తెలిపింది. రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

13,500 కోట్లు తక్షణం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఏర్పడే రెవెన్యూ లోటు, పన్ను పరిహారం కింద రూ. 13,500 కోట్లను కేంద్రం నుంచి రాబట్టుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కేంద్రానికి ఓ నివేదిక సమర్పించింది.

వారి సూచనల మేరకే మార్చాం..!
13వ ఆర్థిక సంఘం సూచనల మేరకే ప్రణాళికా పద్దు కేటాయింపులను ప్రణాళికేతర పద్దులకు మార్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ప్రస్తుత బడ్జెట్‌లో రైతుల రుణ విముక్తికి ప్రణాళికలో రూ.4 వేల కోట్లను కేటాయించింది. ఇప్పుడు ఆ కేటాయింపులను ప్రణాళికేతర పద్దుకు మార్చింది. అలాగే.. ఇతరత్రాకు చెందిన రూ. 5,784 కోట్లను కూడా ప్రణాళికా పద్దు నుంచి మార్చినట్టు  వివరించింది.

పెండింగ్‌లో.. చెల్లింపులు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు చెల్లించాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని  తెలిపింది.  విభజనానంతరం ఆర్థిక సంవత్సరంలో 10 నెలల కాలానికి రూ. 12 వేల కోట్ల రెవెన్యూ లోటును, కేంద్ర అమ్మకం పన్ను పరిహారంగా రావాల్సిన రూ. 1500 కోట్లను మంజూరు చేయాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement