
సాక్షి, కాకినాడ: టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ నేత యనమల కృష్ణుడు. టీడీపీకి బలం లేకపోయినా అధికార జులుంతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని భావించారు. యనమల చెత్త రాజకీయంలో భాగంగానే ఇదంతా జరిగింది అని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పది మంది కౌన్సిలర్లతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని యనమల రామకృష్ణుడు భావించారు. టీడీపీ బలం లేకపోయినా.. అధికారం జులుంతో గెలవాలని అనుకున్నారు. దీనిని బట్టి యనమలకు ప్రజాస్వామ్యం ఎంత వరకు తెలుసు అనేది తుని ప్రజలకు అర్ధమైంది. యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలే చూపించి ఎన్టీఆర్‌ను పదవిలో నుంచి దించేశారు. ఆయన కన్నీరు పెట్టుకునేలా చేశారా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించినా.. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ బలం 17 మంది కౌన్సిలర్లు, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూశారు’ అంటూ కామెంట్స్ చేశారు.