స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ çసున్నా వడ్డీ చెల్లింపుల చెక్కుతో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు, లబ్ధిదారులు
‘‘మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా తెలియజేస్తున్నా’’ ‘‘ఒక సమాజంలో మానవ హక్కులు అమలవుతున్నాయా? స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయా? రాజ్యాంగపరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? ఈ సమాజంలో రక్షణ ఉందా?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. ఇవన్నీ మహిళలకు ఏ సమాజంలో పూర్తిగా లభిస్తున్నాయో అక్కడ మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్నీ ఉన్నట్లే.. అన్నీ బాగున్నట్లే. అలాంటి సమాజాన్ని నిర్మించుకునేందుకు మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 23 నెలలుగా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం’’
– ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సీఎం ఆకాంక్షించారు. ‘ప్రతి అమ్మాయి కనీసం గ్రాడ్యుయేట్ కావాలి. ప్రతి అక్కచెల్లెమ్మ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారి కావాలి. ప్రతి మహిళ గౌరవప్రదంగా పూర్తి రక్షణతో జీవించే పరిస్థితి కల్పించాలి. లింగ వివక్షతను రూపుమాపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది’ అని సీఎం తెలిపారు. ఆర్థిక స్వావలంబనతో మొదలయ్యే ఈ ప్రయాణం సామాజికంగా, రాజకీయంగా కూడా మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టే పరిస్థితి రావాలన్నారు. మహిళా సాధికారత కోసం ఈ 23 నెలల్లో పలు అడుగులు వేశామని, గర్భంలో ఉన్న శిశువు మొదలు అవ్వల వరకు ప్రతి అడుగులో వారికి అండగా నిలబడ్డామని సీఎం తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మంది పొదుపు మహిళలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లను సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సెర్ప్ సీఈవో రాజబాబు, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ కేవీ నాంచారయ్య, ఎస్‌ఎల్‌బీసీ ప్రతినిధిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రమేష్ వేగేతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన సంఘాల సభ్యులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ..
మనపై నమ్మకానికి నిదర్శనం..
ఇవాళ మళ్లీ ఒక మంచి కార్యక్రమం. 9.34 లక్షల స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషిస్తున్నా. దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం ఒక అంశమైతే.. రెండో అంశం అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. అవి బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రుణాలు సకాలంలో చెల్లించిన 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుస్తూ వారి రుణ ఖాతాల్లో రూ.1,109 కోట్లు జమ చేస్తున్నాం. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 8.71 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇవాళ 9.34 లక్షలకు చేరాయి. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా మాట తప్పకుండా అటు ఆసరా పథకంలో రూ.6,792 కోట్లు వారి చేతిలో పెట్టడం వల్ల కానివ్వండి, 2019–20లో సున్నా వడ్డీ కోసం చేసిన చెల్లింపుల వల్ల కానివ్వండి.. మొత్తంగా అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం మీద కలిగిన నమ్మకానికి పొదుపు సంఘాల సంఖ్య పెరుగుదలే ఒక పెద్ద నిదర్శనం.
గత సర్కారు మోసంతో చక్రవడ్డీలు..
2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ మాట దేవుడెరుగు. అప్పటివరకు ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా 2016 నుంచి రద్దు చేసింది. ఈ మోసం వల్ల ‘ఏ’ గ్రేడ్ సంఘాలు ‘బీ’ గ్రేడ్, ‘సీ’ గ్రేడ్‌కు పడిపోగా, ‘బీ’ గ్రేడ్, ‘సీ’ గ్రేడ్ సంఘాలు అప్పుల పాలై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక మూతబడే స్థితికి చేరాయి. అంతేకాకుండా అక్కచెల్లెమ్మలు అప్పట్లో అక్షరాలా రూ.3 వేల కోట్ల వడ్డీ రాయితీకి అర్హత కోల్పోయే పరిస్థితి కూడా చూశాం. వారు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సి వచ్చింది.
మనందరి ప్రభుత్వ హయాంలో..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8.71 లక్షల సంఘాలకు చెందిన 87 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద దాదాపు రూ.1,400 కోట్లు వారి రుణ ఖాతాల కింద ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత ఆసరా కింద మరో రూ.6,792 కోట్లు కూడా ఇచ్చాం.
వడ్డీ భారం కూడా తగ్గించాం..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాలలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.3 లక్షల రుణ పరిమితి వరకు 7 శాతం వడ్డీ చొప్పున, మిగిలిన ఏడు జిల్లాలలో 12.5 శాతం నుంచి 13.5 శాతం వరకు వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మనం అధికారంలోకి రాగానే బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారాన్ని 12.5 – 13.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగలిగాం. దీనివల్ల దాదాపు రూ.590 కోట్ల భారం అక్కచెల్లెమ్మలకు తగ్గింది. వారి రుణాల వడ్డీ కింద ఇప్పుడు రూ.1,109 కోట్లు జమ చేస్తున్నాం.
మహిళా సాధికారత కోసం ఏం చేశామంటే..
గత 23 నెలల కాలంలో మహిళల సాధికారత కోసం ప్రతి అడుగులో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాం. అమ్మ ఒడి ద్వారా దాదాపు 44.5 లక్షల మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ఒక్కొకరికి ఏటా రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.6,500 కోట్లు వంతున రెండేళ్లలో ఇప్పటికే దాదాపు రూ,13.023 కోట్లు ఒక అన్నగా అందజేశాం.
► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఇస్తున్న 61 లక్షల పెన్షన్లలో 36.73 లక్షలు మంది అవ్వలు, మహిళా దివ్యాంగులు, వితంతువులున్నారు. వారికి పెన్షన్ కింద అందజేసిన మొత్తం రూ.16,444 కోట్లు.
► వైఎస్సార్ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా బృందాలలో 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మనం అధికారంలోకి వచ్చే నాటికి వారికి ఉన్న రుణం రూ.27,168 కోట్ల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడతగా రూ.6,792 కోట్లు గత ఏడాది సెప్టెంబరు 11న జమ చేశాం. రెండో విడతగా రూ.6,792 కోట్లు ఈ సెప్టెంబరులో జమ చేస్తాం.
► వైఎస్సార్ చేయూత ద్వారా 4.56 లక్షల మంది 45 – 60 మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద అక్క చెల్లెమ్మలకు ఒకొక్కరికి రూ.18,750 చొప్పున మొదటి విడతగా 2020 ఆగస్టులో రూ.4,604 కోట్లు లబ్ధి చేకూర్చాం. నాలుగు విడతల్లో అందించే మొత్తం దాదాపు రూ.18,500 కోట్లు అని ఒక అన్నగా, తమ్ముడిగా సగర్వంగా చెబుతున్నా.
► వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హెచ్‌యూఎల్, రిలయన్స్, అల్లానా లాంటి ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల్లో భాగంగా వారికి వ్యాపారంలో తోడుగా నిలిచేలా ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అక్కచెల్లెమ్మలకు వ్యాపారపరమైన నైపుణ్యాలు, మార్కెటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రభుత్వ సాయంతో ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 69 వేల షాపులు ఏర్పాటయ్యాయని గర్వంగా చెబుతున్నా.
► జగనన్న జీవక్రాంతి ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచేందుకు చేయూత, ఆసరా పథకాలను అనుసంధానం చేస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్నాం. పాల ఉత్పత్తిలో అమూల్‌తో ఒప్పందం చేసుకుని లీటరు పాలకు రూ.5 నుంచి రూ.7 వరకు అధికంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
► జగనన్న పాలవెల్లువ పథకంలో ఆవులు, గేదెలకు సంబంధించి 1.12 లక్షల యూనిట్లు కావాలని అక్క చెల్లెమ్మలు కోరారు. వాటిని అందజేస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నాం. మేకలు, గొర్రెలు 72,179 యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. ఒక్కో యూనిట్‌లో 15 మేకలు, ఒక మేకపోతు ఉంటాయి. వాటిని కూడా చేయూత, ఆసరా కింద ఇస్తున్నాం.
► వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న దాదాపు నాలుగు లక్షల మంది అగ్రవర్ణాల పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో ఒక్కొక్కరికి రూ.45 వేల చొప్పున ఇచ్చేందుకు ఈ ఏడాది నుంచి రూ.600 కోట్లు కేటాయించాం. వచ్చే మూడేళ్లలో రూ.1,800 కోట్లు వారికి ఇస్తాం.
► వైఎస్సార్ జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, గృహ నిర్మాణాల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి కలిగిస్తున్నాం. అంటే ఇది రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి మేలు చేసే కార్యక్రమం. ఇప్పటికే ఇళ్ల స్థలాలు పంచడమే కాకుండా మొదటి దశ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాం. అన్ని వసతుల కల్పన ద్వారా ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఆ విధంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచబోతున్నాం.
► జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్) ద్వారా 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా, అక్క చెల్లెమ్మల చేతిలో నేరుగా డబ్బులు పెడుతున్నాం. నాలుగు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.2,800 కోట్లు వారి చేతిలో పెడుతున్నాం. అందులో తొలి త్రైమాసిక ఫీజుల కింద మొన్ననే వారి చేతికి రూ.671 కోట్లు ఇచ్చాం.
► జగనన్న వసతి దీవెన కింద పిల్లల హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రెండు దఫాల్లో రూ.20 వేల వరకు ఇసున్నాం. ఇప్పటివరకు రూ.1,221 కోట్లు అందజేశాం. ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ప్రతి విద్యార్థికి మేలు జరిగేలా ఈనెల 28న దాదాపు మరో రూ.1,200 కోట్లు తల్లుల ఖాతాల్లో వేస్తాం.
► వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పుడు ఇస్తున్న రూ.1,109 కోట్లు కూడా కలిపితే ఇప్పటివరకు దాదాపు రూ.2,509 కోట్లు ఈ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం.
► వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రూ.1,863 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనిపై గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే వ్యయం చేసేవారు. ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. 55,607 అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం.
► నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నాం. ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు బాలికల సంఖ్య పెంచి స్కూళ్లకు వచ్చే విధంగా ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తున్నాం.
► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.492 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తంతో 82 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.384 కోట్లు, వైఎస్సార్ బీమా ద్వారా 17,03,703 మంది మహిళలకు రూ.176 కోట్లు. వైఎస్సార్ వాహనమిత్రతో 24 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.45.7 కోట్లు, జగనన్న చేదోడు పథకం ద్వారా 1.36 లక్షల అక్క చెల్లెమ్మలకు రూ.136 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2.73 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.824 కోట్లు, ఆరోగ్య ఆసరా ద్వారా 94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.50.66 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా 21.67 లక్షల మంది చిట్టి తల్లులకు రూ.335 కోట్ల మేర సహాయం అందించాం.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రతి అడుగులోనూ ప్రాధాన్యం..
ఇవాళ ప్రతి అడుగులో అక్కచెల్లెమ్మల బాగు కోసం చేస్తున్న కృషి కనిపిస్తోంది. చివరకు మంత్రివర్గాన్ని చూసినా ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వగా, హోంమంత్రి కూడా మహిళకే ఇచ్చాం. మున్సిపల్ పదవుల్లో కూడా మహిళలకు 61 శాతం ఇచ్చామని గర్వంగా చెబుతున్నా. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో సగం మహిళలకు ఇస్తూ చట్టాలు చేశాం. బీసీ కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, చివరకు ఆలయాల బోర్డులలో కూడా సగం మహిళలే కనిపిస్తారని సగర్వంగా తెలియజేస్తున్నా.
దిశ చట్టం – యాప్..
శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ దేశంలోనే విప్లవాత్మక పరిణామంగా ఏపీ దిశ చట్టాన్ని చేసి కేంద్రానికి పంపాం. ఇçప్పటికే 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 18 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, దిశ యాప్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.
900 పెట్రోలింగ్ వాహనాలు: మహిళా కానిస్టేబుళ్ల పెట్రోలింగ్ కోసం కొత్తగా 900 వాహనాల కొనుగోలు చేసి జీపీఎస్ అనుసంధానం చేశాం. వారు పోలీసు కంట్రోల్ రూమ్‌తో పాటు డివిజన్ స్థాయి కార్యాలయంతో అనుసంధానమై ఉంటారు. విద్యార్థినిలపై నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న మార్కెట్ ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీల వద్ద పక్కాగా పెట్రోలింగ్ ఏర్పాట్లు చేశాం.
సహాయక డెస్కులు
మహిళలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా సహాయక డెస్కులు ఏర్పాటు చేశాం. వాటిలో మహిళలే పని చేస్తారు. బాధిత మహిళల సమస్య వినడం మొదలు ఫిర్యాదు చేసేవరకు సహాయం చేస్తారు. ఇంకా సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం.
దశలవారీగా మద్య నియంత్రణ..
మహిళల సాధికారత, సంతోషంగా ఉండేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. దాదాపు 4,380 పర్మిట్ రూమ్‌లను కూడా రద్దు చేశాం. దీనివల్ల మహిళలకు మరింత భద్రత ఏర్పడిందని గర్వంగా చెబుతున్నా. గతంలో మద్యం షాపులు రాత్రి 11 వరకు ఉండగా ఇప్పుడు రాత్రి 8 గంటలకే మూసివేయిస్తున్నాం. ఉదయం 11 గంటలకు మాత్రమే తెరుస్తూ వాటిని ప్రభుత్వమే నడుపుతోంది. మద్యం షాపులను మూడో వంతు తగ్గించడంతో ఇప్పుడు కేవలం 2,966 షాపులు మాత్రమే మిగిలాయి. ధరలు బాగా పెంచడం వల్ల మద్యం అమ్మకాలు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చాలా తగ్గాయి. 2018–19లో 3.80 కోట్ల కేసుల లిక్కర్ అమ్మితే ఇవాళ (2020–21లో) 1.87 కోట్ల కేసులకు లిక్కర్ అమ్మకాలు తగ్గాయి. అంటే దాదాపు 51 శాతం తగ్గాయి. 2018–19లో 2.90 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోతే 2020–21లో కేవలం 57.02 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడు పోయాయి. అంటే దాదాపు 80 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇలా ప్రతి మహిళకు సంతోషం కలిగించాలన్న తాపత్రయం, తపనతో ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లికి అన్నగా అడుగులు వేస్తున్నానని సగర్వంగా చెబుతున్నా.
నిజమైన హీరో మీరే..
‘దివంగత వైఎస్సార్ పావలావడ్డీ ప్రవేశపెట్టి మహిళా సంఘాలకు ప్రాణం పోస్తే మీరు వైఎస్సార్ సున్నా వడ్డీ తెచ్చి ఆర్థిక చేయూత అందిస్తున్నారు. గత ఏడాది మేం కట్టాల్సిన వడ్డీని మా బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి మనసున్న సీఎంగా నిలిచారు. బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాల మహిళలకు వడ్డీని 12.5% నుంచి 9.5 శాతానికి తగ్గించిన ఘనత మీదే. మీ పథకాల వల్ల మాకు సంఘంలో గౌరవం పెరిగింది. సినిమాల్లో హీరో ఎన్నో చేస్తాడు.. కానీ నిజ జీవితంలో ఇన్ని కోట్ల మందికి మేలు చేస్తున్న మీరు రియల్ హీరో. మా పిల్లలకు మీరే రోల్ మోడల్. పది కాలాల పాటు మీరే సీఎంగా ఉండాలి’
– మల్లేశ్వరి. బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా
కుటుంబాలు బాగు పడుతున్నాయి..
‘నాడు పావలా వడ్డీతో వైఎస్సార్ ఆదుకుంటే మీరు మరో అడుగు ముందుకు వేసి వైఎస్సార్ సున్నా వడ్డీని అమలు చేస్తున్నారు. నవరత్నాలను మాట తప్పకుండా అమలు చేస్తూ ప్రతి పథకాన్ని మహిళలకే అందచేస్తున్నారు. దీనివల్ల కుటుంబాలు చాలా బాగు పడుతున్నాయి. గత ప్రభుత్వం సున్నా వడ్డీ, రుణమాఫీ పేరుతో మోసం చేసింది. మీరు అందిస్తున్న భరోసాతో చీరల వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ.20 వేలు సంపాదించుకుంటున్నా. మహిళలకు ఇంత మేలు చేస్తున్న జగనన్న ఎప్పుడూ సీఎంగా ఉండాలి’
– మౌలానీ, కొత్తపల్లి మండలం, కర్నూలు జిల్లా
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం?
‘మా సంఘానికి బ్యాంకు నుంచి రూ.9 లక్షల రుణం వచ్చింది. వడ్డీ భారాన్ని పొదుపు సంఘాల ఖాతాకు ప్రభుత్వమే జమ చేసింది. కరోనా విపత్కర పరిస్థితిలోనూ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు. మీరు ఇస్తున్న భరోసాతో నేను, మా అత్త ఫ్యాన్సీ, కిరాణా షాప్ పెట్టుకుని నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి?’
– కృష్ణవేణి, మద్దూరు, కృష్ణా జిలా
మహిళా పక్షపాత ప్రభుత్వం
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
‘సీఎం జగన్‌ది విలక్షణ పాలన. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. దేశంలో ఏ సీఎం కూడా అలా చేయలేదు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. ఇది మహిళ పక్షపాత ప్రభుత్వం. దాదాపు 20 పథకాలలో వారికే ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. గత ఏడాది కంటే రుణాల సంఖ్య పెరిగినా వెనుకంజ వేయలేదు. బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీని తగ్గించడం వల్ల మహిళలపై రూ.590 కోట్ల వడ్డీ భారం తగ్గింది. ఒక క్యాలెండర్ ప్రకటించి పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఏ ఒక్క పథకం విషయంలోనూ వెనుకంజ వేయడం లేదు. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో దాదాపు 4.65 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా వారికి మేలు జరుగుతోంది’
నాడు మహిళలు బంగారం అమ్ముకున్నారు
– బొత్స సత్యనారాయణ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
‘వైఎస్సార్ సున్నా వడ్డీ కింద గత ఏడాది రూ.1,400 కోట్లు ఇవ్వగా ఈసారి రుణాల సంఖ్య పెరిగినా రూ.1,109 కోట్లు ఇస్తున్నామంటే అందుకు కారణం బ్యాంకులు వడ్డీని 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించడమే. చంద్రబాబు మాట ఇచ్చి డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయకపోగా చివరకు సున్నా వడ్డీని కూడా అమలు చేయలేదు. దీంతో కొందరు డ్వాక్రా మహిళలు చివరకు బంగారం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ డబ్బులు జమ చేయడం సంతోషకరం’
తోబుట్టువులు లేని లోటు తీరుస్తున్నారు
మాకు తోబుట్టువులు లేని లోటును మీరు తీరుస్తున్నారు. ఒక కుమార్తెకు తండ్రిలా.. ఒక చెల్లెకు అన్నలా అండగా నిలుస్తున్నారు. మేం చేసిన రుణాలను మీరు తీరుస్తున్నారు. నాకు ఈ ఏడాది రూ.3,500 సున్నా వడ్డీ రాయితీ లభించింది. గత ఏడాది సున్నా వడ్డీని ప్రకటించి ఆదుకున్నారు. ఆనాడు మైక్రోఫైనాన్స్ కబంధ హస్తాల నుంచి
వైఎస్సార్ మమ్మల్ని రక్షించారు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుడిలా ఆదుకుంటున్నారు.
– పి.సాయిలీల, ప్రశాంతి మహిళా సంఘం, పుట్టపర్తి, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment