
సాక్షి, అమరావతి: నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి ఆలోచనలోంచి రూపుదిద్దుకున్న పథకం దేశంలో పొదుపు వ్యవస్థలో విప్లవం సృష్టించింది. మహిళల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు దిక్సూచిగా నిలిచింది. అదే పావలా వడ్డీ పథకం. ఆ పథకం రూపకర్త మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అమలు చేసిన ఈ పథకం తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది.
కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుత విభిజిత ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం పొదుపు సంఘాల్లో మూడోవంతుకుపైగా 2004–08 మధ్య కాలంలో ఏర్పడినవే.
దీనికి పావలా వడ్డీ అమలే ప్రధాన కారణం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎనిమిది లక్షల వరకు పొదుపు సంఘాలున్నాయి. వీటిలో 2,90,928 సంఘాలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004–08 మధ్య ఏర్పడినవే. అదే సమయంలో పావలా వడ్డీ కార్యక్రమంతో అప్పట్లో పెద్దసంఖ్యలో మహిళలు రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో చేరారు. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని నిర్ణయించింది.
అభయహస్తంతో భరోసాకి దారి..: పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళల వయసు 60 ఏళ్ల దాటిన తర్వాత వారికి రుణాలిచ్చేందుకు అప్పట్లో చాలా బ్యాంకులు ఆసక్తి చూపేవి కాదు. ఈ నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన పొదుపు సంఘాల మహిళలకు ఆదాయ భద్రత, భరోసా కల్పించేందుకు రాజశేఖరరెడ్డి అప్పట్లో ‘అభయహస్తం’ అనే మరో విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
నేడు మళ్లీ జగన్ ‘ఆసరా’తో..: చంద్రబాబు హయాంలో మోసపోయిన డ్వాక్రా మహిళలకు ఆసరాగా నిలవాలని 2019లో ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిన వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాలు రూ.25,571 కోట్లను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం రూ.19,178 కోట్లు ఈ పథకం కింద చెల్లించింది. దీనికితోడు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా గత నాలుగేళ్లు సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు ఆ వడ్డీ డబ్బులను ఏ ఏడాదికి ఆ ఏడాదే నేరుగా వారికే ప్రభుత్వం అందజేస్తోంది.