పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్కీ ఇద్దామనుకున్నారు. సొంత జిల్లాలో పాదయాత్ర, సభ నిర్వహించారు. రేవంత్ వ్యతిరేక నేతలందరినీ కూడగట్టారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌కు దడ పుడుతుందని భ్రమించారు. కాని సీన్ రివర్సయింది. నాయకులు చాలా మంది వచ్చారు. కాని జనమే తక్కువ మంది వచ్చారు. నేతల ఉపన్యాసాలు వినేందుకు జనమే కరువయ్యారు. అది ఏ జిల్లా? రేవంత్‌కు పోటీగా పాదయాత్ర నిర్వహించిన ఆ నేత ఎవరు?
చేతిలో పోటీ పాదయాత్ర
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వరరరెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సందేశాన్ని, తెలంగాణ సర్కార్ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు టీపీసీసీ చీఫ్. రాబోయే ఎన్నికలలో హస్తం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు రేవంత్.
ఇదిలా ఉంటే మహేశ్వర రెడ్డి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసాలో తన పాదయాత్ర చేపట్టారు. రేవంత్ యాత్రకు సవాలు విసిరే విధంగా ఉందని భావించిన ఆయన వ్యతిరేక ఉద్దండ నేతలంతా మహేశ్వరరెడ్డి పాదయాత్ర ప్రారంభించడానికి హాజరయ్యారు. సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితర రేవంత్ వ్యతిరేక వర్గం అంతా మహేశ్వరరెడ్డి పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చారు.
పబ్లిక్ రిపోర్ట్‌లో రిజల్ట్ లేదా?
అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. తన పాదయాత్ర అంటే వేలాది మంది ప్రజలు తరలి వస్తారని మహేశ్వర్ రెడ్డి అంచనా వేసుకున్నారు. కాని సభకు కొన్ని వందల మంది మాత్రమే హజరయ్యారు. వచ్చినవారంతా మహేశ్వరరెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ జనమే ఎక్కువగా ఉన్నారు. సభ నిర్వహించిన ముథోల్ నియోజకవర్గం నుండి జనాన్ని తరలించడంలో మహేశ్వరరెడ్డి అనుచరులు ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది.
జనం లేక పాదయాత్ర ప్రారంభ సభలో కాంగ్రెస్ నాయకులకు ప్రోత్సాహం కరువైంది. మహేశ్వరరెడ్డితో సహా సభలో పాల్గొన్న నాయకులంతా నిమిషాల వ్యవధిలోనే తమ ఉపన్యాసాలను ముగించారు. అందరూ మహేశ్వరరెడ్డి పాదయాత్ర చేపట్టినందుకు ప్రశంసించారు. కాంగ్రెస్ ఉద్దండులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ సభ ప్రసంగాలు వినే ప్రజలు లేక కేవలం 40 నిమిషాల్లోపే ముగిసింది.
ఎందుకిలా జరిగింది?
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు పోటీ పాదయాత్ర అంటే జనం పోటెత్తుతారని భావిస్తే.. అసలు స్పందనే రాకపోవడంతో మహేశ్వరరెడ్డి ఆందోళన చెందుతున్నారట. పార్టీలోని సీనియర్ నాయకుల ముందు పరువు పోయిందని మదన పడుతున్నారట. రేవంత్ పాదయాత్ర కంటే తన పాదయాత్రకు ప్రజలు భారీగా వస్తారని అంచనాలు వేసుకున్నారట మహేశ్వరరెడ్డి.
కాని రేవంత్ పాదయాత్రకు వస్తున్న స్పందనలో పది శాతం కూడా తనకు రాకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారట. నిర్మల్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయింది. బారీ బహిరంగ సభలు సక్సెస్ చేశారు. కాని తన పాదయాత్రకు స్పందన లేకపోవడానికి గల కారణాలను వెతుకుతున్నారట. మొదటగా జనాన్ని తరలించడంలో విఫలమైన అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారట మహేశ్వర్ రెడ్డి.
ఆ వైఫల్యానికి కారణాలేంటీ?
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే సీనియర్ నాయకులంతా వెన్ను తట్టి ప్రోత్సహించడంతో.. అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు స్పందన రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. మహేశ్వరరెడ్డి రోడ్డు మీదకు వెళితే తండోపతండాలుగా జనం వచ్చేంత పాపులర్ లీడర్ ఏమీ కాదు. పైగా ఆయన తన సొంత నియోజకవర్గం నిర్మల్ వదిలి పక్క నియోజకవర్గం అయిన ముథోల్‌లో పాదయాత్ర చేపట్టారు.
ముథోల్ సెగ్మెంట్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో.. క్యాడర్ మొత్తం ఆయనతో పాటు కాషాయ తీర్థం తీసుకుంది. కాంగ్రెస్ జెండాలు కట్టేవాళ్లు లేనిచోట మహేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టడం మైనస్ గా మారిందట.
ముథోల్‌లో కాకుండా సొంత నియోజకవర్గం నిర్మల్‌లోనే యాత్ర చేపట్టాలని సన్నిహితులు, సీనియర్లు సూచించినా మహేశ్వరరెడ్డి పట్టించుకోలేదట. కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ హోదాలో ఉండి అత్యుత్సాహం చూపిన ఫలితంగా మహేశ్వర రెడ్డి తన పరువు తానే తీసుకున్నారని ఆయన అనుచరులు, కార్యక్తలు అందోళన చెందుతున్నారట.
చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి?
ఆరంభ సభే అట్టర్ ప్లాప్ కావడంతో...ఈ ప్రభావం తర్వాత రోజులలో నిర్వహించే పాదయాత్రపై పడకుండా మహేశ్వరరెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట. భారీగా జనాన్ని తరలించాలని అనుచరులకు మహేశ్వర రెడ్డి ఆదేశాలు జారీచేశారట.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment