సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. నిర్మల్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు అన్ని విధాలా అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు.
బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
మరోవైపు చిన్నారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష సాయం చేశారు. ఈ నగదును స్థానిక అధికారుల చేత ఆమెకు అందించారు. చిన్నారి చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాలికకు ఇల్లు కూడా సమకూరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈమేరకు బాలికకు వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఖర్చులకు ప్రతి నెల డబ్బులు పంపుతానని, త్వరలో కలుస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment