mudhol
-
ఈ సారి ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వనున్నాయా..?
ముధోల్ అధికార పార్టీ అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్నది ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి సీటివ్వద్దంటూ గులాబీ పార్టీని డిమాండ్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే పట్ల సొంత పార్టీలోనే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసమ్మతి నేతల మాటలను గులాబీ పార్టీ బాస్ ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ముధోల్‌లో అధికార పార్టీ అభ్యర్థి పరిస్తితి ఎలా ఉంది? స్థానిక నేతలు బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అసలు ముధోల్ అధికార పార్టీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థి విఠల్‌రెడ్డికి సొంత పార్టీ నుంచే షాక్‌లు తగులుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన విఠల్‌రెడ్డి తర్వాత గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన విఠల్‌రెడ్డికి స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విఠల్‌రెడ్డికి ఈసారి టిక్కెట్ ఇవ్వవద్దని బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు అత్యధికులు పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. కాని కేసీఆర్ అసమ్మతి నేతల సూచనలను వినిపించుకోకుండా విఠల్‌రెడ్డికే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి పనులు చేయని, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేకే మరోసారి టిక్కెట్ ఎలా ఇస్తారని స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే తాము మూకుమ్మడిగా పార్టీని వీడుతున్నామని ప్రకటించారు. విఠల్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు రాజీనామా చేసిన వారిలో భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్బాబుతో సహా బాసర, భైంసా జడ్పీటీసీలు, పలువురు సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముధోల్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని.. పైగా పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. బాసర మాస్టర్ ప్లాన్ అమలుకు నిధులు కూడా తీసుకు రాలేకపోయారని, గుండేగామ్ నిరాశ్రయులకు పునరావాసం కల్పించడంలో విఫలం అయ్యారని మండిపడుతున్నారు. కనీసం బాసర ఆలయ పాలక వర్గం కమిటీని కూడా నియమించలేకపోయిన ఎమ్మెల్యే కోసం ఈసారి తాము పనిచేయలేమని అసమ్మతి నేతలు తేల్చి చెప్పేశారు. ఈ అభ్యర్థి ఇష్టం లేనందునే తామంతా పార్టీకి రాజీనామా చేశామని...ఇప్పుడు విఠల్‌రెడ్డి ఓటమే లక్ష్మంగా పనిచేస్తామని చెబుతున్నారు. తమను వేధించిన ఎమ్మెల్యేకు ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డికి అసమ్మతి నాయకుల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఎన్నికల వేళ కీలక ప్రజాప్రతినిదుల రాజీనామాలు గులాబీ పార్టీ అభ్యర్థికి దడ పుట్టిస్తున్నాయి. తిరుగుబాటు దారులతో రాజీకోసం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది..పైగా బెడిసి కొట్టాయి. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఓటమి లక్ష్యంగా పని చేస్తామని శపథాలు చేస్తుండటంతో కోలుకోలేని దెబ్బ తప్పదని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్ కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఎమ్మెల్యేను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాజేష్‌బాబు బంజారా సామాజికవర్గం గనుక ఆయన బరిలో ఉంటే ఆ వర్గం అంతా ఆయనకే మద్దతిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరింత నష్టం సంభవిస్తుందని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట. అయితే అసమ్మతి నేతలు పోయినంత మాత్రాన తనకు నష్టం లేదని పైకి బింకంగా చెబుతున్నారట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి. ఎవరెంత వ్యతిరేకించినా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేను అసమ్మతి నేతలు వ్యతిరేకించారు. అటు పార్టీ నాయకత్వం అసమ్మతిని పట్టించుకోలేదు. ఇటు ఎమ్మెల్యే కూడా కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అసమ్మతి నేతల తిరుగుబాటుతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? వేచి చూడాల్సిందే.. -
డామిట్.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదా?.. ఎందుకిలా జరిగింది?
పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్కీ ఇద్దామనుకున్నారు. సొంత జిల్లాలో పాదయాత్ర, సభ నిర్వహించారు. రేవంత్ వ్యతిరేక నేతలందరినీ కూడగట్టారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌కు దడ పుడుతుందని భ్రమించారు. కాని సీన్ రివర్సయింది. నాయకులు చాలా మంది వచ్చారు. కాని జనమే తక్కువ మంది వచ్చారు. నేతల ఉపన్యాసాలు వినేందుకు జనమే కరువయ్యారు. అది ఏ జిల్లా? రేవంత్‌కు పోటీగా పాదయాత్ర నిర్వహించిన ఆ నేత ఎవరు? చేతిలో పోటీ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వరరరెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సందేశాన్ని, తెలంగాణ సర్కార్ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు టీపీసీసీ చీఫ్. రాబోయే ఎన్నికలలో హస్తం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు రేవంత్. ఇదిలా ఉంటే మహేశ్వర రెడ్డి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసాలో తన పాదయాత్ర చేపట్టారు. రేవంత్ యాత్రకు సవాలు విసిరే విధంగా ఉందని భావించిన ఆయన వ్యతిరేక ఉద్దండ నేతలంతా మహేశ్వరరెడ్డి పాదయాత్ర ప్రారంభించడానికి హాజరయ్యారు. సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితర రేవంత్ వ్యతిరేక వర్గం అంతా మహేశ్వరరెడ్డి పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చారు. పబ్లిక్ రిపోర్ట్‌లో రిజల్ట్ లేదా? అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. తన పాదయాత్ర అంటే వేలాది మంది ప్రజలు తరలి వస్తారని మహేశ్వర్ రెడ్డి అంచనా వేసుకున్నారు. కాని సభకు కొన్ని వందల మంది మాత్రమే హజరయ్యారు. వచ్చినవారంతా మహేశ్వరరెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ జనమే ఎక్కువగా ఉన్నారు. సభ నిర్వహించిన ముథోల్ నియోజకవర్గం నుండి జనాన్ని తరలించడంలో మహేశ్వరరెడ్డి అనుచరులు ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది. జనం లేక పాదయాత్ర ప్రారంభ సభలో కాంగ్రెస్ నాయకులకు ప్రోత్సాహం కరువైంది. మహేశ్వరరెడ్డితో సహా సభలో పాల్గొన్న నాయకులంతా నిమిషాల వ్యవధిలోనే తమ ఉపన్యాసాలను ముగించారు. అందరూ మహేశ్వరరెడ్డి పాదయాత్ర చేపట్టినందుకు ప్రశంసించారు. కాంగ్రెస్ ఉద్దండులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ సభ ప్రసంగాలు వినే ప్రజలు లేక కేవలం 40 నిమిషాల్లోపే ముగిసింది. ఎందుకిలా జరిగింది? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు పోటీ పాదయాత్ర అంటే జనం పోటెత్తుతారని భావిస్తే.. అసలు స్పందనే రాకపోవడంతో మహేశ్వరరెడ్డి ఆందోళన చెందుతున్నారట. పార్టీలోని సీనియర్ నాయకుల ముందు పరువు పోయిందని మదన పడుతున్నారట. రేవంత్ పాదయాత్ర కంటే తన పాదయాత్రకు ప్రజలు భారీగా వస్తారని అంచనాలు వేసుకున్నారట మహేశ్వరరెడ్డి. కాని రేవంత్ పాదయాత్రకు వస్తున్న స్పందనలో పది శాతం కూడా తనకు రాకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారట. నిర్మల్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయింది. బారీ బహిరంగ సభలు సక్సెస్ చేశారు. కాని తన పాదయాత్రకు స్పందన లేకపోవడానికి గల కారణాలను వెతుకుతున్నారట. మొదటగా జనాన్ని తరలించడంలో విఫలమైన అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారట మహేశ్వర్ రెడ్డి. ఆ వైఫల్యానికి కారణాలేంటీ? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే సీనియర్ నాయకులంతా వెన్ను తట్టి ప్రోత్సహించడంతో.. అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు స్పందన రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. మహేశ్వరరెడ్డి రోడ్డు మీదకు వెళితే తండోపతండాలుగా జనం వచ్చేంత పాపులర్ లీడర్ ఏమీ కాదు. పైగా ఆయన తన సొంత నియోజకవర్గం నిర్మల్ వదిలి పక్క నియోజకవర్గం అయిన ముథోల్‌లో పాదయాత్ర చేపట్టారు. ముథోల్ సెగ్మెంట్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో.. క్యాడర్ మొత్తం ఆయనతో పాటు కాషాయ తీర్థం తీసుకుంది. కాంగ్రెస్ జెండాలు కట్టేవాళ్లు లేనిచోట మహేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టడం మైనస్ గా మారిందట. ముథోల్‌లో కాకుండా సొంత నియోజకవర్గం నిర్మల్‌లోనే యాత్ర చేపట్టాలని సన్నిహితులు, సీనియర్లు సూచించినా మహేశ్వరరెడ్డి పట్టించుకోలేదట. కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ హోదాలో ఉండి అత్యుత్సాహం చూపిన ఫలితంగా మహేశ్వర రెడ్డి తన పరువు తానే తీసుకున్నారని ఆయన అనుచరులు, కార్యక్తలు అందోళన చెందుతున్నారట. చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఆరంభ సభే అట్టర్ ప్లాప్ కావడంతో...ఈ ప్రభావం తర్వాత రోజులలో నిర్వహించే పాదయాత్రపై పడకుండా మహేశ్వరరెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట. భారీగా జనాన్ని తరలించాలని అనుచరులకు మహేశ్వర రెడ్డి ఆదేశాలు జారీచేశారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
మంత్రి కేటీఆర్ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్
సాక్షి, నిర్మల్: ‘రోషిణి నువ్వు చాలా హుషారుగా ఉన్నావ్. బాగా చదవాలి..’ అంటూ కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖి ఓ చిన్నారిని ప్రశంసించారు. ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామానికి చెందిన భూమవ్వ అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం చనిపోయింది. ఆమెకు భర్త కూడా లేకపోవడంతో కూతురు రోషిణి(5) అనాథలా మారింది. ఈ విషయం ఇటీవల ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేయగా.. కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖికి రీట్వీట్ చేశారు. మంత్రి సూచన మేరకు ఆయన బుధవారం ఎడ్బిడ్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్.. చిన్నారి రోషిణితో మాట్లాడారు. నీ పేరేంటి అని ప్రశ్నించగా.. రోషిణి అని సమాధానమిచ్చింది. చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి Request @WCDTelangana and @Collector_NML to take full care of this child’s well-being https://t.co/kDOqgnOPV3 — KTR (@KTRTRS) November 17, 2021 ‘‘నువ్వు స్కూల్‌కెళ్తున్నవా..’’ అనగా.. బాలబడికి వెళ్తున్నానని చెప్పింది. ‘‘మీ అంగన్వాడీ టీచర్ ఎవరు..’’ అనగా.. ‘‘అగో ఆమెనే..’’ అని చూపించింది. ‘‘అంగన్వాడీలో ఏం పెడుతున్నరనగా.. ‘‘అన్నము, గుడ్డు..’’ అంటూ మెరుస్తున్న కళ్లు.. ఆడిస్తున్న చేతులతో చూపించగానే కలెక్టర్ ఒక్కసారిగా నవ్వారు. అనంతరం రోషిణి తన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. శిశుసంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని ఆదిలాబాద్ శిశుగృహానికి పంపించారు. గ్రామస్తులు దాతల ద్వారా సేకరించిన రూ.1.80లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ శివప్రసాద్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు. Many thanks Collector Garu 👍 https://t.co/9LDueudg6Q — KTR (@KTRTRS) November 17, 2021 -
ఈ శునకాలు చాలా షార్ప్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బాగల్‌కోట జిల్లా ముధోల్ ప్రాంతానికి చెందిన శునకాల ప్రత్యేకత, శక్తిసామర్థ్యం అన్ని వర్గాలనూ ఆకర్షిస్తోంది. దేశ సరిహద్దుల్లో పహారా, నేరస్తులను పట్టుకోవడం, తదితర అన్ని పనుల్లో ఈ జాగిలాలను చేర్చుకుంటున్నారు. గతంలో ఆర్మీతో పాటు ఇటీవల భారత వాయుసేన నాలుగు శునకాలను భద్రతా సేవలకు స్వీకరించింది. వైమానిక దళ స్థావరాల్లో విమానాల రాకపోకలకు అడ్డుపడుతున్న పక్షులు, ఇతర ప్రాణులను తరిమేందుకు ముధోళ్ జాతి కుక్కలను వినియోగిస్తారు. ఎన్నో ప్రత్యేకతలు సొంతం ముధోళ్ శునకాలు చూడడానికి బక్కగా, సాధారణంగా కనిపిస్తాయి. కానీ చాలా చురుకైనవి. మామూలు కుక్కల కంటే ఎత్తుగా ఉంటాయి, యజమానులకు ఎంతో నమ్మకంగా ఉంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అలవోకగా పనిచేస్తాయని చెబుతారు. అందుకే ఆర్మీ, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో వినియోగిస్తున్నారు. ఇటీవల మన్‌కీ బాత్, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముధోళ్ జాగిలాలను ప్రశంసించారు. రూ.5 కోట్లతో పరిరక్షణ కేంద్రం స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ముధోల్ శునకాల పాటవం ఎంతో ప్రసిద్ధి. అయితే ఈ శునకాల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. గత బడ్జెట్లో రూ. 5 కోట్లతో బాగల్‌కోట జిల్లా తిమ్మాపురలోని శునకాల పరిశోధన, సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ముధోళ్ జాతి శునకాల పరిరక్షణకు పరిశోధనలు చేస్తున్నారు. చదవండి: అతి వినియోగం.. అన్ని వయసులవారూ బలి తిరిగొచ్చిన మృతుడు.. విచిత్ర ఘటన -
పోలీసుల అదుపులో ముధోల్ నిందితులు?
(ముధోల్ నుంచి మురళీగౌడ్, సాక్షి) ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఘటనలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేయించారు. సంఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 8 మంది నిందితులను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ముధోల్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఓవర్గానికి చెందిన ప్రార్థన మందిరం అపవిత్రం అయ్యిందన్న ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. వెంటనే బాధ్యులను అరెస్టు చేయాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో చుట్టుపక్కల మూడు నాలుగు మండలాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు.సంఘటన స్థలానికి భైంసా డీఎస్పీ గిరిధర్ కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిని ఎలా అదుపు చేయాలన్న విషయమై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోనే భైంసా పట్టణంలో ఇలాగే మతఘర్షణలు జరిగాయి. అప్పట్లో అవి తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.