బెంగళూరులో ఓ ప్రదర్శనలో ముధోళ్ శునకాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బాగల్‌కోట జిల్లా ముధోల్ ప్రాంతానికి చెందిన శునకాల ప్రత్యేకత, శక్తిసామర్థ్యం అన్ని వర్గాలనూ ఆకర్షిస్తోంది. దేశ సరిహద్దుల్లో పహారా, నేరస్తులను పట్టుకోవడం, తదితర అన్ని పనుల్లో ఈ జాగిలాలను చేర్చుకుంటున్నారు. గతంలో ఆర్మీతో పాటు ఇటీవల భారత వాయుసేన నాలుగు శునకాలను భద్రతా సేవలకు స్వీకరించింది. వైమానిక దళ స్థావరాల్లో విమానాల రాకపోకలకు అడ్డుపడుతున్న పక్షులు, ఇతర ప్రాణులను తరిమేందుకు ముధోళ్ జాతి కుక్కలను వినియోగిస్తారు.
ఎన్నో ప్రత్యేకతలు సొంతం
ముధోళ్ శునకాలు చూడడానికి బక్కగా, సాధారణంగా కనిపిస్తాయి. కానీ చాలా చురుకైనవి. మామూలు కుక్కల కంటే ఎత్తుగా ఉంటాయి, యజమానులకు ఎంతో నమ్మకంగా ఉంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అలవోకగా పనిచేస్తాయని చెబుతారు. అందుకే ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో వినియోగిస్తున్నారు. ఇటీవల మన్‌కీ బాత్, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముధోళ్ జాగిలాలను ప్రశంసించారు.
రూ.5 కోట్లతో పరిరక్షణ కేంద్రం
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ముధోల్ శునకాల పాటవం ఎంతో ప్రసిద్ధి. అయితే ఈ శునకాల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. గత బడ్జెట్‌లో రూ. 5 కోట్లతో బాగల్‌కోట జిల్లా తిమ్మాపురలోని శునకాల పరిశోధన, సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ముధోళ్ జాతి శునకాల పరిరక్షణకు పరిశోధనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment