కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదేమో. కాస్త ప్రేమ చూపిస్తే చాలు యజమానుల కోసం కుక్కలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగువేయవు. అందుకే పెంపుడు కుక్కలను చాలామంది ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు. వాటికేమైనా అయితే తల్లడిల్లిపోతారు.
అయితే కర్ణాటకకు చెందిన చన్నపట్న అనే ప్రాంతంలో ఏకంగా కుక్కలకు గుడి కట్టించేశారన్న విషయం మీకు తెలుసా? సాధారణ దేవాలయాల్లాగే ఇక్కడ కూడా ప్రతిరోజూ పూజలు జరుగుతాయి. ఈ వింతైన ఆలయం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా అందరూ దేవుడిని పూజిస్తే ఆ గ్రామంలో మాత్రం కుక్కలకు గుడికట్టి మరీ పూజిస్తున్నారు. గ్రామ దేవతకు ముందు ఈ శునకాలకే తొలిపూజలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని చన్నపట్న అనే నగరంలో అగ్రహార వలగెరెహల్లి అనే చిన్న గ్రామంలో ఈ శునక దేవాలయం ఉంది. ఊరి ప్రధాన దేవత కెంపమ్మ ఆలయాన్ని నిర్మించిన కొన్ని నెలలకే ఆ గ్రామానికి చెందిన రెండు కుక్కలు అకస్మాత్తుగా అదృశ్యం అయ్యాయట.
ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకి ఓ వ్యాపారవేత్త కలలోకి వచ్చిన గ్రామ దేవత గ్రామస్తుల రక్షణ కోసం తన ఆలయానికి దగ్గరగా కనిపించకుండాపోయిన ఆ కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని కోరిందట. ఆ రకంగా రెండు శునకాల విగ్రహాలను ప్రతిష్టించి ఆరోజు నుంచి పూజలు నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా శునకాల పేరుతో ప్రతి ఏడాది పండగ కూడా నిర్వహిస్తున్నారు. ఆనోటా ఈ నోటా విషయం తెలిసి ఈ గుడికి మంచి పాపులారిటీ రావడంతో భారీగా టూరిస్టులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment