ముధోల్ అధికార పార్టీ అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్నది ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి సీటివ్వద్దంటూ గులాబీ పార్టీని డిమాండ్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే పట్ల సొంత పార్టీలోనే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసమ్మతి నేతల మాటలను గులాబీ పార్టీ బాస్ ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ముధోల్‌లో అధికార పార్టీ అభ్యర్థి పరిస్తితి ఎలా ఉంది? స్థానిక నేతలు బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అసలు ముధోల్ అధికార పార్టీలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థి విఠల్‌రెడ్డికి సొంత పార్టీ నుంచే షాక్‌లు తగులుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన విఠల్‌రెడ్డి తర్వాత గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన విఠల్‌రెడ్డికి స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విఠల్‌రెడ్డికి ఈసారి టిక్కెట్ ఇవ్వవద్దని బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు అత్యధికులు పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు.
కాని కేసీఆర్ అసమ్మతి నేతల సూచనలను వినిపించుకోకుండా విఠల్‌రెడ్డికే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి పనులు చేయని, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేకే మరోసారి టిక్కెట్ ఎలా ఇస్తారని స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే తాము మూకుమ్మడిగా పార్టీని వీడుతున్నామని ప్రకటించారు.
విఠల్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వారిలో భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్‌బాబుతో సహా బాసర, భైంసా జడ్‌పీటీసీలు, పలువురు సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముధోల్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని.. పైగా పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. బాసర మాస్టర్ ప్లాన్ అమలుకు నిధులు కూడా తీసుకు రాలేకపోయారని, గుండేగామ్ నిరాశ్రయులకు పునరావాసం కల్పించడంలో విఫలం అయ్యారని మండిపడుతున్నారు.
కనీసం బాసర ఆలయ పాలక వర్గం కమిటీని కూడా నియమించలేకపోయిన ఎమ్మెల్యే కోసం ఈసారి తాము పనిచేయలేమని అసమ్మతి నేతలు తేల్చి చెప్పేశారు. ఈ అభ్యర్థి ఇష్టం లేనందునే తామంతా పార్టీకి రాజీనామా చేశామని...ఇప్పుడు విఠల్‌రెడ్డి ఓటమే లక్ష్మంగా పనిచేస్తామని చెబుతున్నారు. తమను వేధించిన ఎమ్మెల్యేకు ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డికి అసమ్మతి నాయకుల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఎన్నికల వేళ కీలక ప్రజాప్రతినిదుల రాజీనామాలు గులాబీ పార్టీ అభ్యర్థికి దడ పుట్టిస్తున్నాయి. తిరుగుబాటు దారులతో రాజీకోసం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది..పైగా బెడిసి కొట్టాయి. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఓటమి లక్ష్యంగా పని చేస్తామని శపథాలు చేస్తుండటంతో కోలుకోలేని దెబ్బ తప్పదని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్ కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఎమ్మెల్యేను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
రాజేష్‌బాబు బంజారా సామాజికవర్గం గనుక ఆయన బరిలో ఉంటే ఆ వర్గం అంతా ఆయనకే మద్దతిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరింత నష్టం సంభవిస్తుందని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట. అయితే అసమ్మతి నేతలు పోయినంత మాత్రాన తనకు నష్టం లేదని పైకి బింకంగా చెబుతున్నారట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి. ఎవరెంత వ్యతిరేకించినా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారట.
సిట్టింగ్ ఎమ్మెల్యేను అసమ్మతి నేతలు వ్యతిరేకించారు. అటు పార్టీ నాయకత్వం అసమ్మతిని పట్టించుకోలేదు. ఇటు ఎమ్మెల్యే కూడా కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అసమ్మతి నేతల తిరుగుబాటుతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? వేచి చూడాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment