MLA Vittal Reddy
-
ఈ సారి ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వనున్నాయా..?
ముధోల్ అధికార పార్టీ అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్నది ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి సీటివ్వద్దంటూ గులాబీ పార్టీని డిమాండ్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే పట్ల సొంత పార్టీలోనే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసమ్మతి నేతల మాటలను గులాబీ పార్టీ బాస్ ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ముధోల్‌లో అధికార పార్టీ అభ్యర్థి పరిస్తితి ఎలా ఉంది? స్థానిక నేతలు బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అసలు ముధోల్ అధికార పార్టీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థి విఠల్‌రెడ్డికి సొంత పార్టీ నుంచే షాక్‌లు తగులుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన విఠల్‌రెడ్డి తర్వాత గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన విఠల్‌రెడ్డికి స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విఠల్‌రెడ్డికి ఈసారి టిక్కెట్ ఇవ్వవద్దని బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు అత్యధికులు పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. కాని కేసీఆర్ అసమ్మతి నేతల సూచనలను వినిపించుకోకుండా విఠల్‌రెడ్డికే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి పనులు చేయని, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేకే మరోసారి టిక్కెట్ ఎలా ఇస్తారని స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే తాము మూకుమ్మడిగా పార్టీని వీడుతున్నామని ప్రకటించారు. విఠల్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు రాజీనామా చేసిన వారిలో భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్బాబుతో సహా బాసర, భైంసా జడ్పీటీసీలు, పలువురు సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముధోల్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని.. పైగా పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. బాసర మాస్టర్ ప్లాన్ అమలుకు నిధులు కూడా తీసుకు రాలేకపోయారని, గుండేగామ్ నిరాశ్రయులకు పునరావాసం కల్పించడంలో విఫలం అయ్యారని మండిపడుతున్నారు. కనీసం బాసర ఆలయ పాలక వర్గం కమిటీని కూడా నియమించలేకపోయిన ఎమ్మెల్యే కోసం ఈసారి తాము పనిచేయలేమని అసమ్మతి నేతలు తేల్చి చెప్పేశారు. ఈ అభ్యర్థి ఇష్టం లేనందునే తామంతా పార్టీకి రాజీనామా చేశామని...ఇప్పుడు విఠల్‌రెడ్డి ఓటమే లక్ష్మంగా పనిచేస్తామని చెబుతున్నారు. తమను వేధించిన ఎమ్మెల్యేకు ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డికి అసమ్మతి నాయకుల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఎన్నికల వేళ కీలక ప్రజాప్రతినిదుల రాజీనామాలు గులాబీ పార్టీ అభ్యర్థికి దడ పుట్టిస్తున్నాయి. తిరుగుబాటు దారులతో రాజీకోసం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది..పైగా బెడిసి కొట్టాయి. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఓటమి లక్ష్యంగా పని చేస్తామని శపథాలు చేస్తుండటంతో కోలుకోలేని దెబ్బ తప్పదని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్ కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఎమ్మెల్యేను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాజేష్‌బాబు బంజారా సామాజికవర్గం గనుక ఆయన బరిలో ఉంటే ఆ వర్గం అంతా ఆయనకే మద్దతిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరింత నష్టం సంభవిస్తుందని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట. అయితే అసమ్మతి నేతలు పోయినంత మాత్రాన తనకు నష్టం లేదని పైకి బింకంగా చెబుతున్నారట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి. ఎవరెంత వ్యతిరేకించినా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేను అసమ్మతి నేతలు వ్యతిరేకించారు. అటు పార్టీ నాయకత్వం అసమ్మతిని పట్టించుకోలేదు. ఇటు ఎమ్మెల్యే కూడా కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అసమ్మతి నేతల తిరుగుబాటుతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? వేచి చూడాల్సిందే.. -
భక్తజన సంద్రం బాసర క్షేత్రం..
భైంసా టౌన్/బాసర(ముథోల్): చదువుల తల్లి కొలువైన బాసర పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వసంత పంచమి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి 2 గంటల నుంచే ఆలయంలో భక్తులు క్యూలైన్లో నిరీక్షిస్తూ కనిపించారు. వేదపండితులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. లక్షకు పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. 5,850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం వసంతి పంచమి సందర్భంగా ఆలయంలో 5,850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. రూ.100, రూ.1000 అక్షరాభ్యాసం టికెట్లతోపాటు ప్రత్యేక దర్శనం టికెట్లు, లడ్డూ, పులిహోర అమ్మకాల ద్వారా ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.42,49,350 ఆదాయం సమకూరినట్లు ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు.. ఈ ఏడాది బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. వీఐపీ క్యూలైన్లో కూడా బారులు తీరి కనిపించారు. రూ.వెయ్యి అక్షరాభ్యాసం క్యూలైన్ పరిస్థితి కూడా అలాగే కనిపించింది. ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంగా సుమారు ఐదు గంటలపాటు భక్తులు క్యూలో ఇబ్బందులు పడ్డారు. అక్షరాభ్యాస పూజల అనంతరం భక్తులను మండపం నుంచి పంపించే ఏర్పాట్లలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో అక్షరాభ్యాస మండపం నుంచి గర్భగుడికి వెళ్లే మార్గంలో గంటలపాటు భక్తులకు నిరీక్షణ తప్పలేదు. శనివారం రాత్రి బాసర చేరుకున్న సామాన్య భక్తులకు అతిథిగృహాలు దొరకలేదు. అనేకమంది చలిలో ఆలయ ఆవరణలోనే రాత్రంతా జాగరణ చేశారు. -
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న (37)కు ప్రభుత్వం చెరువు పక్కన గతంలో మూడెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద మామిడి, జామ చెట్లు పెంచుకుంటున్నాడు. చెరువు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవన్న కొంత భూమిని కోల్పోయాడు. భూమికి బదులు భూమి ఇప్పించాలంటూ కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలసి సచివాలయం వద్దకు వచ్చాడు. మంత్రి హరీశ్‌రావును కలవాలని భావించాడు. మూడేళ్ళుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సూసైడ్ నోట్ రాశారు.‘నా చావుకు కారణం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివ లింగయ్య’అని అందులో పేర్కొన్నారు. తనకు తిండి, నీరు, ఉపాధి లేకుండా చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. దళితులకు న్యాయం చేయాలని సీఎంను వేడుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా లేఖ రాశాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని పార్టీ కోసం పని చేసిన పుణ్యానికి నా తండ్రిని, కొడుకుని పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. టాయిలెట్ క్లీనర్ తాగిన దేవయ్యను పోలీసులు మాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. దేవయ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తా
బాసర : బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బాసర ట్రీపుల్ ఐటీ కళాశాలను ఆదివారం ఆయన ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు మార్వేల్ మెస్ నిర్వాహకులు సరైన భోజనం అందించడం లేదని ఆందోళనకు దిగిన నేపథ్యంలో వారు కళాశాలను సందర్శించారు. సుమారు 2 గంటలపాటు మెస్ కేఏంకే, మార్వేల్‌లోని కూరగాయాల స్టోరేజ్, వంట గదులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం తనిఖీ చేశారు. ఇంజినీరింగ్ ఈ2, ఈ3, ఈ4 విద్యార్థులతో మాట్లాడారు. మెస్ నిర్వాహకులు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థులు తెలిపారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీనియర్ విద్యార్థులు మార్వేల్ మెస్ తీరుపై, సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్‌లో కళాశాలలో మరో మెస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మరో ఫిజికల్ డెరైక్టర్, ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. రూ.2 కోట్లు స్కాలర్షిప్ బకారుులు విడుదల చేయించేందుకు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, భైంసా డీఎస్పీ అందె రాములు, ట్రీపుల్ ఐటీ డెరైక్టర్ అప్పల నాయుడు, నాయకులు పీఏసీఎస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, జెడ్పీటీసీ సభ్యుడు సావ్లీ రమేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పోతన్న యాదవ్, బాసర మాజీ సర్పంచ్ రమేశ్, నూకం రామారావు, బాల్గాం దేవేందర్, పాల్గొన్నారు.